హక్కుల జాబితాలో ఆరోగ్యం!
జబ్బు పడివున్న మన ఆరోగ్య వ్యవస్థకు జవసత్వాలు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలైనట్టు కనబడుతున్నది. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించే దిశగా ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంకల్పించింది. ఈమధ్య విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానం-2015లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం పొందుపరిచింది. విద్యా హక్కు చట్టం తరహాలో జాతీయ ఆరోగ్య హక్కుల చట్టాన్ని రూపొందించి ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా చేయాలను కుంటున్నట్టు అందులో తెలిపింది. ఇది అమల్లోకొస్తే వైద్య సౌకర్యాన్ని నిరాకరిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి పౌరులకు వీలవుతుంది.
జాతీయ ఆరోగ్య విధానం రూపకల్పనపై స్వాతంత్య్రానంతరం ఇప్పటికి రెండుసార్లు మాత్రమే కేంద్రం దృష్టిపెట్టిందంటే ఈ రంగంపై మన పాలకుల్లో ఎంతగా నిర్లక్ష్యం గూడుకట్టుకుని ఉన్నదో అర్థమవుతుంది. 1983లో తొలిసారి ఈ తరహా విధాన పత్రాన్ని రూపొందించగా 2002లో మరోసారి ఆ పని జరిగింది. అలాగని మన దేశంలో ప్రజారోగ్య స్థితిగతులు అంత ‘పట్టించుకోనవసరం లేనంత’గా ఏం లేవు. సామాజిక, ఆర్థిక అసమానతలు ఆరోగ్యరంగంలో ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తున్నాయి. డబ్బున్న మారాజులకే జబ్బులనుంచి విముక్తి... సామాన్యులకు చావే శరణ్యమనే స్థితి ఏర్పడింది. మారిన కాలమాన పరిస్థితులవల్ల ‘అభివృద్ధి’ అనే పదానికి నిర్వచనమే మారిపోయింది. అది స్థూల జాతీయోత్పత్తి (జీఎన్పీ), స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) చుట్టూ గిరికీలు కొడుతుంటే సామాన్యుల బతుకులు మాత్రం జబ్బుల్లో కొడిగడుతున్నాయి. వైద్య సేవలకయ్యే వ్యయంలో ప్రభుత్వాలపరంగా ఖర్చు పెడుతున్నది కేవలం 22 శాతం మాత్రమే. మిగిలిన 78 శాతం వ్యయాన్ని జనమే భరించవలసివస్తున్నది.
వాస్తవానికి ఆరోగ్య హక్కు రాజ్యాంగం ప్రకారం ఇప్పటికే ప్రాథమిక హక్కు. జీవించే హక్కుకు హామీపడుతున్న 21వ అధికరణంలో ఆరోగ్యంగా ఉండే హక్కు అంతర్లీనంగా ఇమిడి ఉన్నదని 1984లోనే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. జీవన ప్రమాణాన్ని, ప్రజారోగ్యాన్ని పెంచాల్సిన బాధ్యత...పోషకాహారం ప్రజలందరికీ అందేలా చూడవలసిన కర్తవ్యం రాజ్యంపై ఉన్నాయని రాజ్యాంగంలోని ఆదే శిక సూత్రాలు కూడా చెబుతున్నాయి. కానీ, అన్నిటిలాగే ప్రజారోగ్యాన్ని కూడా ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ప్రణాళిక, ప్రణాళికేతర రంగాలద్వారా దేశంలో ప్రజారోగ్యానికి వ్యయం చేస్తున్నది జీడీపీలో ఒకటిన్నర శాతం కూడా లేదని గమనిస్తే ఈ నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరుకున్నదో అర్థమవుతుంది. 2002నాటి జాతీయ ఆరోగ్య విధానంలో ప్రజారోగ్యానికి జీడీపీలో కనీసం 2శాతం వ్యయం చేయాలని ఘనంగా సంకల్పం చెప్పుకున్నా ఆచరణలో అది ఎటో కొట్టుకుపోయింది. మనం చాలా వెనకబడిన దేశాలనుకుంటున్న అఫ్ఘానిస్థాన్ 7.6 శాతం, భూటాన్ 5.2 శాతం, రువాండా 10.5 శాతం, సుడాన్ 6.3 శాతం చొప్పున ఖర్చుచేస్తున్నాయి. ఇక సంపన్న దేశాల విషయానికొస్తే అమెరికా 17.6 శాతం, కెనడా 11.3 శాతం, బ్రిటన్ 9.6 శాతం వ్యయం చేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండటమంటే కేవలం జబ్బు లేకుండా ఉండటమే కాదు... భౌతిక, మానసిక, భావోద్వేగ అంశాలన్నిటా దృఢంగా ఉండటం. ఒక పౌరుడు తన శారీరక, మానసిక శక్తియుక్తులను సంపూర్ణంగా సమాజాభివృద్ధికి వినియోగించగలిగేలా ఉండటం.
కనీస సౌకర్యాలతో గౌరవంగా, తలెత్తుకు తిరిగేలా బతకగలగటం. ఇవన్నీ మన దేశంలో సామాన్య పౌరులకు మృగ్యమయ్యాయి. మన దేశంలో 10,000 మంది జనాభాకు 9 పడకలున్నాయి. ప్రపంచ సగటు 30తో పోలిస్తే ఇదెంత అథమస్థాయిలో ఉన్నదో స్పష్టమవుతుంది. వైద్యుల విషయానికొస్తే 10,000 మందికి మన దేశంలో 6.5 శాతంమంది ఉన్నారు. ఈ అంశంలో ప్రపంచ సగటు 14.5! నివారించదగిన డెంగ్యూ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో భారత్లో 20 లక్షలమంది మృత్యువాత పడ్డారని... అవసరమైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని 2008లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.
ఎన్డీయే సర్కారు ఇప్పుడు ప్రతిపాదించిన జాతీయ ఆరోగ్య విధానం ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తానని ప్రకటించడం హర్షించదగ్గదే. అందు కోసం విద్యా సెస్ తరహాలో ఆరోగ్య సెస్ వసూలుకు కూడా సంకల్పించింది. దానివల్ల నిధుల సమీకరణ సులభమవుతుంది. అయితే, ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణపైనా... మరీ ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపైనా, వారి పునరుత్పత్తి ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టని ఎలాంటి చర్యలైనా ఆచరణలో మెరుగైన ఫలితాలను అందించలేవని పాలకులు తెలుసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తే ఏ వ్యాధినైనా మొగ్గలోనే తుంచేయడానికి వీలుంటుంది. జబ్బులబారినుంచి రక్షించుకోవడానికి పేద జనం చేసే వ్యయంలో చాలా భాగం తగ్గిపోతుంది.
మారుమూల ప్రాంతాలకు సైతం సమర్థవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని, 108, 104 సేవలను అందుబాటులోకి తెచ్చారు. అనంతరకాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలకు ఇవి ఆదర్శనీయమయ్యాయి. ప్రజారోగ్యం సరిగా లేనప్పుడు నష్టపోయేది సంబంధిత కుటుంబాలు, వ్యక్తులు మాత్రమే కాదు... మొత్తంగా సమాజంపైనే దాని ప్రభావం పడుతుంది. పనిదినాలు నష్టపోవడం, ఉత్పాదకత క్షీణించడంతోపాటు ఆరోగ్యం కోసం చేసే ఖర్చు తడిసిమోపెడై ఏటా కోట్లాదిమంది అదనంగా దారిద్య్రరేఖ దిగువకు చేరుకుంటున్నారు. అయితే ఆచరణలో విద్యాహక్కు చట్టం కొరగానిదిగా తయారైనట్టు ఇది మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పుడే ఇలాంటి అపురూపమైన, ప్రాణావసరమైన హక్కును సంరక్షించుకోగలమని పౌరులు కూడా తెలుసుకోవాలి.