మీన‘వేషాలు’
- పింఛన్ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు
- నిధుల రికవరీలో నిర్లక్ష్యం వివరాలు ఇవ్వని రెండు
- మున్సిపాలిటీలు, నాలుగు మండలాలు..
ఇందూరు : ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందినా.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ప్రభుత్వ పథకాల లబ్ధికి అర్హులు కాదు. కానీ.. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా 2,844 మంది ప్రభుత్వం నుంచి నెలనెలా వృద్ధాప్య, వితంతు, వికలాంగ, బీడీ, ఇతర పింఛన్ల రూపంలో డబ్బులు పొందుతున్నారు. పింఛన్లపై తనిఖీలు చేపట్టిన సమయంలో అధికారులు గుర్తించి పింఛన్లను తొలగించారు. రూ.2 కోట్ల 24 లక్షల 94 వేలు సర్కారు ఖజానాకు గండి పడినట్లు లెక్క తేల్చారు. ఇది కేవలం జిల్లాలోని 32 మండలాలు, రెండు మున్సిపాలిటీలకు సంబంధించినవే. ఇంకా రెండు మున్సిపాలిటీలు, నాలుగు మండలాల నుంచి వివరాలు పంపడంలో అక్కడి అధికారులు, ఎంపీడీఓలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సదరు మున్సిపాలిటీలు, మండలాల నుంచి కూడా వివరాలు అందితే అదనంగా రూ.3 కోట్లు పెరిగే అవకాశం ఉంది. ఇదిలాఉండగా అధికారులు ఇప్పటివరకు కేవలం రూ. 63,36,500 రికవరీ చేశారు. నిధులు రికవరీ చేయాలని ఎన్నిసార్లు ఉన్నతాధికారులు చెప్పినా అధికారులు, ఎంపీడీఓలు బాధ్యతగా తీసుకుని ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
వారి జాడ తెలీదు..
ప్రభుత్వం నుంచి నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందిన వారి వివరాలు ఎంపీడీఓలకు తెలియడం లేదని చెప్తున్నారు. ఆధార్ కార్డులు లేకుండానే పింఛన్లు ఇవ్వడంతో ఈ సమస్య ఏర్పడింది. వారి చిరునామాలు తెలియరాకపోవడంతో నోటీసులు జారీ చేయడానికి వీలు కావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న, ఉద్యోగం చేసిన పదవీ విరమణ పొందిన వ్యక్తులు ఎక్కడున్నారో, పెన్షన్లు పొందిన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో అంతుచిక్కడం లేదు. వారిని గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అయితే కొంత మందిని గుర్తించిన అధికారులు వారికి నిధులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి నిధులు జమ చేయడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వేతన బిల్లులు చేసే అధికారి నోటీసు ఇచ్చి అతని వేతనాల నుంచి నిధులు కోత విధించాలని సూచించారు. ఇటు పదవీ విరమణ పొందిన వ్యక్తి పెన్షన్ డబ్బుల్లోంచి కోత విధించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఇలా కొంత మంది నుంచి రూ.63.36 లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి.
వివరాలు ఇవ్వని మున్సిపాలిటీలు, మండలాలు
ఆర్మూర్, కామారెడ్డి మున్సిపాలిటీలతోపాటు బిచ్కుంద, కామారెడ్డి, సిరికొండ, ఎడపల్లి మండలాలు ఉన్నారుు.