అరటి పళ్లు అంతమవుతాయా?
లాటిన్ అమెరికా: ప్రపంచ వ్యాప్తంగా అరటి సంక్షోభం తలెత్తనుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అరటి పళ్లకు ఉరికొయ్యగా మారిన 'ఫుసారియమ్ ఆక్సిస్పోరమ్' అనే ఒకరకమైన ఫంగస్ వల్ల వ్యాపించే 'పనామా వ్యాధి' విజృంభిస్తోంది. ఇతర దేశాలకు దీని బెడద ఎంత ఉందోగానీ.. ఉత్తర అమెరికాకు అతిపెద్ద అరటి పళ్ల ఎగుమతిదారైన లాటిన్ అమెరికాకు మాత్రం కొంత ఇబ్బందికరంగా మారింది.
ఎందుకంటే లాటిన్ అమెరికాకు వచ్చే ఆదాయంలో ఈ వ్యాధి సోకుతున్న కెవండిష్ రకం అరటి పళ్ల నుంచే అధికంగా వస్తోంది. ఆ వ్యాధి ఎక్కడ తమ వద్దకు కూడా అడుగుపెడుతుందో అని గత వారంలో జరిగిన అంతర్జాతీయ అరటి పళ్ల సదస్సుకు కూడా చివరి నిమిషంలో మాత్రమే లాటిన్ అమెరికా ప్రతినిధులు హాజరయ్యారు. ఎందుకంటే ఈ సదస్సుకు వచ్చిన వారిలో పలు దేశాలకు చెందిన వారు ఉండటం.. ఆయా దేశాల్లో అరటి పళ్లకు ఈ పనామా వ్యాధి వచ్చి ఉండటం కారణం. అది కాకుండా ఆ వ్యాధి సోకిన దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల బూట్లకు అంటుకొని ఎక్కడ ఆ ఫంగస్ తమ ప్రాంతంలోకి వస్తుందోనన్న భయంతోనే చివరి సమయంలో హాజరయ్యారు.
ఇప్పటికే ఆసియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మధ్యాసియా ప్రాంతాల్లోని అరటి పళ్లకు ఈ పనామా దెబ్బ తగిలింది. అంతేకాకుండా అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ కూడా అరటిని సంరక్షించుకునే విషయంలో ముందు జాగ్రత్తగా ఉండకుంటే పెను ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతకు ముందున్న రకం అరటిని 1960లో వచ్చిన ఒక కొత్త డిసీజ్ తుడిచి పెట్టేయడంతో కొత్తగా కెవండిష్ రకం అరటిని తీసుకొచ్చారు. దీనికి కూడా తెగులు సోకుతుండటంతో మరోసారి ఇంకో కొత్త రకం అరటి రకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే ఆసియా ప్రాంతాల్లో ఉన్న కెవండిష్ అరటి స్థానంలో ఏ రకం అరటిని తెస్తే మంచిదని అధికారులు, శాస్త్రవేత్తలను రైతులు ప్రశ్నిస్తున్నారు.