FY16
-
భారీగా కుదేలైన టాటా సన్స్ లాభాలు
ముంబై : చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని బయటికి నెట్టేసి టాటా సన్స్, అసలు తమ గ్రూప్ లాభాలు ఏమేరకు ఉన్నాయా? అని లెక్కలేసుకుంది. ఈ లెక్కలో టాటా సన్స్ భారీగానే లాభాలను కోల్పోయింది. ఈ ఏడాది మార్చి వరకు టాటా సన్స్ లాభాలు 67 శాతం కుదేలై, రూ.3,013 కోట్లగా నమోదైనట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్‌లో పేర్కొంది. మిస్త్రీని తొలగించడానికి ప్రధాన కారణం కూడా ఆయన పనితీరు సరిగా లేదనే గ్రూప్ చెబుతోంది. అదేవిధంగా రెవెన్యూలు కూడా 39 శాతం క్షీణించి రూ.8,104 కోట్లగా నమోదుచేసింది. కానీ ఏకీకృత ప్రాతిపదికన మాత్రం కంపెనీ గతేడాదితో పోలిస్తే కొంత మెరుగైన లాభాలనే ఆర్జించింది. గతేడాది రూ.19,180 కోట్లగా ఉన్న లాభాలను రూ.23,119 కోట్లకు పెంచుకుంది. చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా తీసివేసిన తర్వాత ఆ పదవికి తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను బోర్డు ఎన్నుకుంది. గ్రూప్ వృద్ధిని పెంచడానికి రతన్ టాటా తమ స్ట్రాటజీలను మరోసారి పరిశీలిస్తున్నారని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. గత ఆర్థికసంవత్సరం టీసీఎస్ కంపెనీ చెల్లించిన ఎక్కువ డివిడెంట్లు కూడా స్వతంత్ర ఆదాయాలకు కొంత గండికొట్టినట్టు తెలిసింది. గతేడాది కంపెనీ డివిడెంట్లు కింద రూ.11,450 కోట్లను చెల్లించింది. కంపెనీ స్వతంత్ర ఆదాయాలకు, ఏకీకృత ఆదాయాకు పెద్దగా తేడా లేనప్పటికీ, లాభాల్లో మాత్రం కంపెనీ పడిపోయింది. దీంతో మిస్త్రీ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న బోర్డు సభ్యులు ... చైర్మన్ పదవికి ఎన్నికై నిండా నాలుగేళ్లు కూడా కొనసాగకముందే ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. మరోవైపు మిస్త్రీ స్థానంలో ఎన్నికైన రతన్ టాటా, కంపెనీ అధినేతలందరికీ తమతమ వ్యాపారాలపై దృష్టిసారించాలని ఉపదేశం చేశారు. పనితీరుతో పాటు, లాభాలను పెంచుకోవడంపై ఫోకస్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
కొత్త రిజిస్టర్డ్ ఎఫ్ పీఐలు ఎన్నో తెలుసా..?
న్యూఢిల్లీ : మార్కెట్ నిదానంగా కొనసాగుతున్నప్పటికీ 2015-16 ఆర్థికసంవత్సరంలో దాదాపు 2,900 కొత్త విదేశీ పోర్ట్ ఫోలియో మదుపరులు(ఎఫ్ పీఐలు) సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) దగ్గర నమోదు చేసుకున్నారట. సెబీ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మూలధన మార్కెట్లో 1,444 మంది కొత్త రిజిస్ట్ర్డర్డ్ ఎఫ్ పీఐలు ఉన్నారని సెబీ డేటా తెలిపింది. అదనంగా 2,867 ఎఫ్ పీఐలకు గత ఆర్థికసంవత్సరం సెబీ నుంచి అనుమతులు లబించాయని డేటా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన రూ.1.11 లక్షల కోట్ల నుంచి రూ.14వేల కోట్లకు పైగా మొత్తాన్ని ఎఫ్ పీఐలు విత్ డ్రా చేసుకున్నారని డేటా పేర్కొంది. బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ గత ఆర్థిక సంవత్సరం 9.36శాతం పడిపోయింది. వివిధ కేటగిరీలో ఉన్న విదేశీ మదుపరులను కొత్త క్లాస్ ఎఫ్ పీఐ ల్లో కలుపుతూ.. సెబీ 2014లో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలతో ఎఫ్ పీఐలను రిస్క్ ప్రొఫైల్, నో యువర్ క్లెయింట్(కేవైసీ) అవసరాలు, రిజిస్ట్రేషన్ పద్ధతులకు అనుగుణంగా మూడు రకాలుగా వర్గీకరించారు. అంతకముందు భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ సంస్థలకు ఒక ఏడాదికి లేదా ఐదేళ్లకు మాత్రమే అనుమతులు లభించేవి. అయితే ప్రస్తుత ఎఫ్ పీఐలకు శాశ్వత రిజిస్ట్రేషన్ అనుమతులను సెబీ కల్పించింది. బోర్డు సస్పెండ్ లేదా రద్దు అయ్యేంతవరకూ ఈ రిజిస్ట్రేషన్ శాశ్వతంగా ఉంటుంది. అదేవిధంగా డీమ్డ్ ఎఫ్ పీఐలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 4,406 పెరిగాయని డేటా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 6,772 ఉన్నాయి. 55 వివిధ అధికార ప్రాంతాలకు చెందిన ఎఫ్ పీఐలు సెబీ దగ్గర నమోదయ్యాయి.