'జాతీయ, లౌకిక వాదాలు గొప్ప జీవన విధానాలు'
కావలి అర్బన్: లౌకికవాదం, జాతీయవాదాలు గొప్ప జీవన విధానాలని విరసం సభ్యుడు, విశ్వోదయ గౌరవ జీవిత సభ్యుడు జి.కల్యాణరావు పేర్కొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో శనివారం ఎస్ఆర్ శంకరన్ 82వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ‘వర్తమానంలో జాతీయవాదం, లౌకికవాదం’ అంశంపై కల్యాణరావు మాట్లాడారు.
కేంద్రం మతాలకు సంబంధించిన ఆలోచనలను ప్రోత్సహిస్తోందని, లౌకిక రాజ్యమంటే మత రాజ్యం కాదన్నారు. దేశం బాగుండాలంటే వర్గం, కులం నిర్మూలించాలని చెప్పారు. మతం జీవితంలోకి ప్రవేశించిందంటే స్వేచ్ఛ నశిస్తున్నట్లేనని వివరించారు. వ్యక్తికి ప్రశ్నించే హక్కులేనప్పుడు జాతీయవాదం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. సామాజిక న్యాయం కోసం గొంతు విప్పితే ప్రస్తుత సమాజం దాన్ని నేరంగా పరిగణిస్తోందని వాపోయారు. అసమానతలను తొలగించి సమానత్వం సాధించేదే జాతీయవాదమని నిర్వచించారు.
దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత నేటి విద్యార్థులదేనన్నారు. అంతకుముందు ఆయన దివంగత ఎస్ఆర్ శంకరన్, దొడ్ల రామచంద్రారెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఏబీపీ పాల్మనోహర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి.పోతురాజు, విశ్వోదయ సంస్థల రెక్టార్ దొడ్ల వినయకుమార్రెడ్డి పాల్గొన్నారు.