ప్రసంగాలు వద్దు.. పనిచేయండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా:
‘సభలు, సమావేశాలల్లో రాజకీయ నాయకులు మాటల గారడి చేస్తరు.. ఏకదాటిగా మాట్లాడుతూ.. ఏవేవో చెప్పి మిమ్మల్ని పరేషాన్ చేస్తరు.. ఈ రోజు ఇక్కడ చూస్తుంటే రాజకీయ నాయకుల స్థాయిలో ఉద్యోగ సంఘాల నేతలూ మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆకాంక్ష నేరవేరబోతోంది. ఇక ఉద్యోగులు ప్రసంగాలు కాకుండా ఎక్కువ పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ పునర్నిర్మాణంలో మీదే కీలక పాత్ర’అని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ ఉద్యోగులకు హితబోధ చేశారు. సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుడి ప్రార్థన, పెద్దలను గౌరవించడం, కమిట్మెంట్తో పనిచేయడం నా సిద్ధాంతాలని, వాటిని పాటించి ఇంతటి వాడినయ్యానని అన్నారు. ఉద్యోగులు కూడా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని, జిల్లాలో పనిచేస్తున్న పదివేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్‌లో టీఎన్జీఓ భవన నిర్మాణానికి రూ.రెండు లక్షలు ఇచ్చానని, మరో రూ.మూడు లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు.
ఇంటి స్థలాలకు ప్రతిపాదనలివ్వండి: కలెక్టర్
జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలిచ్చేందుకు తనవంతు సహకారం అందిస్తానని కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపాదనలు తయారుచేసి ఇస్తే ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. జిల్లాకున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పనిచేయడం కొంత కష్టమేనన్నారు. కొత్త నియామకాలు లేనందున బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగులకు పరిమితిలేని ఆరోగ్య కార్డులివ్వాలని, ఇటీవల విడుదలచేసిన హెల్త్‌కార్డుల జీఓల్లో సవరణలు అవసరమని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
బహుళ జాతి కంపెనీలకు వందల ఎకరాలు కట్టబెట్టిన ప్రభుత్వం ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపడంలేదని టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి అన్నారు. పాలన వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమలులో జిల్లాలోని ఉద్యోగులంతా అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. సమావేశం ప్రారంభంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.రామ్మోహన్ తెలంగాణ ఉద్యమం, ఉద్యోగుల సమస్యలపై జిల్లా ఉద్యోగుల కృషిని వివరిస్తూ నివేదికను చదివి వినిపించారు. ఉద్యమ సమయంలో బస్సు దగ్ధమైన ఘటనలో మృతిచెందిన బాధిత కుటుం బానికి రూ.10వేల చెక్కును మంత్రి అందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, టీజీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి వివిధ సంఘాల నేతలు నరసింహారావు, రాజ్‌కుమార్, జేఏసీ జిల్లా కోకన్వీనర్ మహ్మద్‌గౌస్ తదితరులు పాల్గొన్నారు.