G Ramachandran
-
భార్య మరణించిన కొన్ని రోజులకే నటుడు కన్నుమూత
చెన్నై: సీనియర్ నటుడు, నిర్మాత జి.రామచంద్రన్(73) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. కలత్తూరు కన్నమ్మ, నాట్టుపుర పాట్టు, ఎట్టుపట్టి రాసా, వీర తాలాట్టు, రాజాధిరాజ, మనునీతి చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు. నిర్మాతగా జీఆర్టీ గోల్డ్ ఫిలిమ్స్ పతాకంపై మనునీతి, సౌండ్ పార్టీ, కాసు ఇరుక్కున్న, ఎంగరాశి నల్లరాశి, కాదలి కానవిల్లై వంటి చిత్రాలతో పాటు కన్నడలోనూ పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవలే ఈయన సతీమణి ఆర్.వి.పూరణి గుండెపోటుతో కన్నుమూశారు. వీరికి కుమారులు శివకుమార్, ఆర్ స్వామికుమార్ ఉన్నారు. మాంగాడులోని ఆయన ఫాంహౌస్ వద్ద బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
‘పన్నీర్ సెల్వంకు అండగా ఉన్నాననే..’
చెన్నై: శశికళకు వ్యతిరేకంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు పలికినందుకే తనను తొలగించారని అన్నాడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి పదవి నుంచి ఉద్వాసనకు గురైన జి. రామచంద్రన్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు దివంగత నాయకురాలు జయలలిత పార్టీలో పదవి ఇచ్చారని వెల్లడించారు. తన స్థానంలో ఐటీ విభాగం కార్యదర్శిగా నియమితులైన వీవీఆర్ రాజ్ సత్యయాన్ కు అభినందనలు తెలిపారు. ‘అమ్మ’ వేసిన బాటలో పనిచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రామచంద్రన్ ను పదవి నుంచి తప్పించారు. -
పన్నీరుకు మరో షాక్ ఇచ్చిన చిన్నమ్మ
చెన్నై: తనపై తిరుగుబాటు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మద్దతుదారులపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ గురి పెట్టారు. పన్నీరు సెల్వంకు దన్నుగా నిలబడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి పదవి నుంచి జి. రామచంద్రన్ ను తొలంగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయనను తప్పించారు. రామచంద్రన్ స్థానంలో ఐటీ విభాగం కార్యదర్శిగా వీవీఆర్ రాజ్ సత్యయాన్ ను నియమించారు. తనపై తిరుగుబాటు చేసిన పన్నీరు సెల్వంను పార్టీ కోశాధికారి పదవి నుంచి శశికళ తొలగించిన సంగతి తెలిసిందే. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని చిన్నమ్మ ఈ చర్యల ద్వారా తెలియజెప్పారు. అయితే తాను పార్టీలోనే కొనసాగుతానని, ఏ పార్టీలోనూ చేరనని పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి తొలగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. -
జయలలిత ఆరోగ్యంపై వదంతులకు చెక్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి వదంతులు ప్రచారం అవుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు ఓ ఐటీ డెస్క్ ను ఏర్పాటుచేశారు. తమిళులు అప్యాయంగా 'అమ్మ' అని పిలుచుకునే జయలలిత ఆరోగ్యం మెరుగవ్వాలని రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలు, ఆమె అభిమానులు చాలా ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం చనిపోయారని కొందరు, ఆమె బతికే అవకాశాలు లేవని మరికొందరు వ్యక్తులు సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ తో పాటుగా యూట్యూబ్ లో వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి కొంతదూరంలో ఓ ఐటీ డెస్క్ ఏర్పాటుచేశారు. ఐటీ బృందం.. అమ్మ ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులు ఎవరన్నది కనిపెట్టి పార్టీ నేతలకు సమాచారం అందిస్తున్నారు. ఆ వివరాల సహాయంతో సీఎంపై వదంతులు ప్రచారం చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. రోజుకు మూడు షిఫ్ట్ లు ఉన్నాయని, మొత్తం 24 గంటలు ఐటీ అధికారులు పని చేస్తుంటారని పార్టీ ఐటీ విభాగం సెక్రటరీ జీ.రామచంద్రన్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ డీఎంకే వదంతులు వ్యాప్తి చేసినా, రాజకీయాలతో సంబంధం లేనివారు పోస్ట్ పెట్టినా వదంతులు ప్రచారం జరిగి ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఇద్దరు కెనరా బ్యాంకు అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులు దాదాపు 50 కేసులు నమోదు చేశారని, వారిపై చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విదేశాలలో ఉన్న తమిళులు కూడా జయలలిత ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చేస్తున్నారని సైబర్ క్రైమ్ విభాగం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో గత 24 రోజులగా చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యం మరింత మెరుగుపడినట్లు కథనాలు వచ్చాయి. చిన్నపాటి గొంతుతో ఆమె మాట్లాడేందుకు ప్రయత్నించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లండన్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం రోజుకు రెండుసార్లు అపోలో వద్దకు వచ్చి జయ పరిస్థితిని పరిశీలిస్తున్నారు.