జయలలిత ఆరోగ్యంపై వదంతులకు చెక్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి వదంతులు ప్రచారం అవుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు ఓ ఐటీ డెస్క్ ను ఏర్పాటుచేశారు. తమిళులు అప్యాయంగా 'అమ్మ' అని పిలుచుకునే జయలలిత ఆరోగ్యం మెరుగవ్వాలని రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలు, ఆమె అభిమానులు చాలా ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం చనిపోయారని కొందరు, ఆమె బతికే అవకాశాలు లేవని మరికొందరు వ్యక్తులు సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ తో పాటుగా యూట్యూబ్ లో వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి కొంతదూరంలో ఓ ఐటీ డెస్క్ ఏర్పాటుచేశారు.
ఐటీ బృందం.. అమ్మ ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులు ఎవరన్నది కనిపెట్టి పార్టీ నేతలకు సమాచారం అందిస్తున్నారు. ఆ వివరాల సహాయంతో సీఎంపై వదంతులు ప్రచారం చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. రోజుకు మూడు షిఫ్ట్ లు ఉన్నాయని, మొత్తం 24 గంటలు ఐటీ అధికారులు పని చేస్తుంటారని పార్టీ ఐటీ విభాగం సెక్రటరీ జీ.రామచంద్రన్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ డీఎంకే వదంతులు వ్యాప్తి చేసినా, రాజకీయాలతో సంబంధం లేనివారు పోస్ట్ పెట్టినా వదంతులు ప్రచారం జరిగి ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఇద్దరు కెనరా బ్యాంకు అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులు దాదాపు 50 కేసులు నమోదు చేశారని, వారిపై చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విదేశాలలో ఉన్న తమిళులు కూడా జయలలిత ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చేస్తున్నారని సైబర్ క్రైమ్ విభాగం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
చెన్నై అపోలో ఆస్పత్రిలో గత 24 రోజులగా చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యం మరింత మెరుగుపడినట్లు కథనాలు వచ్చాయి. చిన్నపాటి గొంతుతో ఆమె మాట్లాడేందుకు ప్రయత్నించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లండన్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం రోజుకు రెండుసార్లు అపోలో వద్దకు వచ్చి జయ పరిస్థితిని పరిశీలిస్తున్నారు.