g veerapandian
-
ఎవరూ ఆందోళన చెందొద్దు : వీరపాండియన్
సాక్షి, కర్నూలు : ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీ గ్యాస్ లీక్ ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు. కంపెనీ లోపల మాత్రమే గ్యాస్ లీకైందని, బయట గ్యాస్ లీక్ ప్రమాదం లేదని స్పష్టం చేశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి(50) మృతి చెందినట్లు కలెక్టర్ వెల్లడించారు. గాయాలపాలైన మరో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ వీరపాండియన్ సంఘటనా స్థలానికి చేరుకుసి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అత్యవసర శాఖల అధికారులను యుద్దప్రాతిపదికన రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని, అన్ని రకాల జాగ్రత్తతు తీసుకున్నామని చెప్పారు. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు, పరిశ్రమలు, వైద్యశాఖ అధికారుల ద్వారా యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. (చదవండి : ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో విషవాయువు లీక్) కాగా, నంద్యాలలోని మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. ఈఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. 2 టన్నుల సామర్థ్యమున్న అమ్మోనియం ట్యాంకర్ లీకవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి గ్యాస్‌ను అదుపు చేస్తోంది. ఆగ్రోప్లాంట్ చుట్టూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
సర్టిఫికెట్ల పరిశీలనకు బోర్డులు ఏర్పాటు చేసుకోండి
సాక్షి,కర్నూలు: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల కోసం మెరిట్ జాబితా సిద్ధమైందని, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కోసం బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) చైర్మన్ జి.వీరపాండియన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఒక్కో బోర్డులో పది మంది సభ్యులు ఉండాలని, ఒక్కో శాఖ అభ్యర్థుల సంఖ్యను బట్టి ఒకటి నుంచి పది వరకు బోర్డులను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టితో కలిసి సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. 9,597 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితా సిద్ధమైందని, ఈ జాబితాలోని ప్రతి అభ్యర్థికి శని, ఆదివారాల్లో కాల్ లెటర్లను ఎస్ఎంఎస్, మెయిల్ లేదా వలంటీర్ల ద్వారా నేరుగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఈ నెల 21, 22 తేదీల్లో సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. అర్హత, పుట్టిన తేదీ, రెసిడెన్స్, పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్, స్పోర్ట్స్ కోటాలకు సంబంధించిన సర్టిఫికెట్లను కచ్చితంగా అప్లోడ్ చేయాలన్నారు. ఏవైనా సర్టిఫికెట్లు లేకపోతే పరిశీలన సమయంలో అవి ఎక్కడున్నాయో అధికారులు కనుగొని తగు చర్యలు తీసుకుంటారన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సి ఉంటుందని తెలియజేశారు. ఏ రోజు, ఏ సమయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందో అభ్యర్థులకు పంపే కాల్ లెటర్లో పేర్కొని ఉంటుందని, దాని ప్రకారమే పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు 27వ తేదీన రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇస్తారని, 28, 29 తేదీల్లో కౌన్సెలింగ్ ద్వారా స్థానాల కేటాయింపు ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో రెండు రోజుల శిక్షణ, అక్టోబర్ 2వ తేదీన ఉద్యోగాల్లో చేరేలా ప్రణాళికలు వేసినట్లు చెప్పారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ వరకు వి«ధుల్లో చేరేందుకు అవకాశం ఇస్తామని, ఆ లోపు రాకపోతే ఆ పోస్టును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల సందేహాలు, సలహాల కోసం జెడ్పీలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకే అభ్యర్థికి రెండు, మూడు ఉద్యోగాలు వస్తే అతను చేరే ఉద్యోగాన్ని వదిలి మిగిలిన ఉద్యోగాలను ఖాళీల కింద చూపి తరువాత మెరిట్ ఉన్న అభ్యర్థితో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీన మండలం/మునిసిపాలిటీల్లో ఒక సచివాలయాన్నైనా అన్ని హంగులతో ప్రారంభిస్తామని, ఇందులో అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్, డీపీఓ ప్రభాకరరావు, నగర పాలకసంస్థ కమిషనర్ రవీంద్రబాబు, ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ నరసింహులు, ఐసీడీఎస్ పీడీ లీలావతి, వ్యవసాయ శాఖ జేడీ విల్సన్, పశుసంవర్ధక శాఖ జేడీ రామచంద్రయ్య పాల్గొన్నారు. -
సీఎం ఆశయాలకు అనుగుణంగా నిర్వహణ
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. సచివాలయ పరీక్షలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సచివాలయ పరీక్షల నిర్వహణను ఒక యజ్ఞంలా భావించి డీఎస్సీ చైర్మన్ హోదాలో తాను, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, జేసీ రవి పట్టన్‌శెట్టి, జేసీ– 2 ఖాజా మొహిద్దీన్, డీఆర్ఓ వెంకటేశం తదితరులు చక్కటి సమన్వయంతో పనిచేశామని పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌లో 24x7కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి.. జెడ్పీ సీఈఓ విశ్వేశ్వరనాయుడు, డీపీఓ కేఎల్ ప్రభాకరరావు, ఏపీఎంఐపీ పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డీఈఓ తాహెరా సుల్తానా, పరీక్షల రాష్ట్ర పరిశీలకులు శంకర నాయక్‌తో పాటు 13 మంది క్లస్టర్ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా పూర్తి చేసినట్లు వివరించారు. దాదాపు 11 వేల మంది సిబ్బంది ఈ యజ్ఞంలో భాగస్వాములయ్యారని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పరీక్షల బందోబస్తు నిర్వహణలో పాలుపంచుకున్నారని తెలిపారు. జిల్లాలో సచివాలయ పరీక్షలను రోల్ మోడల్‌గా నిర్వహించినట్లు రాష్ట్ర పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజా శంకర్ నుంచి ప్రశంసలు కూడా అందాయని వెల్లడించారు. -
పరీక్షలకు హాజరు కాని టీచర్ల సస్పెండ్
సాక్షి, కర్నూల్ : రాష్ట్రంలో నిర్వహించిన గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీకి డూమ్మా కొట్టిన నలుగురు ఎస్జీటీ టీచర్లు నస్రీన్ సుల్తానా, షహనా బేగం, పుష్పలత, అన్నపూర్ణమ్మలను జిల్లా కలెక్టర్ జి. వీర పాండియన్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఆర్డర్లను వెంటనే సర్వ్ చేయాలని కర్నూలు మునిసిపల్ కమీషనర్, డీఈవోలను ఆదేశించారు. మంగళవారం కర్నూలులోని మాంటిస్సోరి, సిస్టర్ స్టాన్సీలా పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల నుండి నిర్వహించిన వీఆర్వో గ్రేడ్ 2, గ్రామ సర్వేయర్ గ్రేడ్ 3 పోస్టుల పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 23 కేంద్రాల్లో మొత్తం అభ్యర్థులు 13778 మందికి గాను 10727 (78 శాతం) మంది హాజరయ్యారు. 3051 మంది గైర్హాజరయ్యారు. కాగా, జిల్లా కమాండ్ కంట్రోల్ రూం నుండి మానిటర్ చేస్తున్న కలెక్టర్.. ఇన్విజిలేషన్ విధుల్లో ఉన్న టీచర్లు పరీక్ష రోజున ఉదయం 7 గంటలకు తప్పనిసరిగా చీఫ్ సూపర్ ఇంటెండెట్‌కు రిపోర్ట్ చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఈ కమిషనర్‌కూ ఓ లెక్కుంది!
కార్పొరేషన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం గుణదల స్థలంలో గజం రూ. 25 వేలు నేడు లాటరీ ద్వారా విక్రయం నోటీసు జారీతో భగ్గుమంటున్న ఉద్యోగులు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ కాసుల వేటలో పడ్డారు. ఇందుకోసం రెండు దశాబ్దాల కిందట ఉద్యోగులకోసం గుణదలలో కొనుగోలు చేసిన ప్లాట్లను బేరం పెట్టారు. సామాన్య ఉద్యోగులకు అందుబాటులో లేని విధంగా.. బడాబాబులకు మేలుచేసేలా గజం భూమి ధర అక్షరాలా పాతిక వేలుగా నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు లాటరీ ద్వారా ప్లాట్ల విక్రయానికి కౌన్సిల్‌హాల్ వేదికగా ముహూర్తాన్ని ఖరారు చేశారు. విజయవాడ : నగరపాలక సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసింది. ఇందుకు ఉద్యోగులనే ఎంచుకుంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లాభనష్టాలకు అతీతంగా కేటాయించాల్సిన ప్లాట్లతో బిజినెస్ చేసేందుకు సమాయత్తమైంది. గుణదలలోని ఆ ప్లాట్లలో రూ.8,300 పలికే గజం ధరను రూ.25 వేలుగా నిర్ణయించడం ద్వారా సామాన్య ఉద్యోగులు అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం లేకుండా పక్కా స్కేచ్ వేశారు. ఉద్యోగుల ముసుగులో లాటుగా స్థలాన్ని ఎగరేసుకుపోయేందుకు బిగ్షాట్లు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారనే బలమైన ఆరోపణలున్నాయి. తాజా పరిణామాలపై ఉద్యోగవర్గాలు భగ్గుమంటున్నాయి. వారు కమిషనర్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇలా మొదలైంది కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్థలాలు కొనుగోలు చేయాలని 1995లో అధికారులు ప్రతిపాదన చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 26న నాటి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గుణదలలో 57.43 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 200 చ.మీ స్థలం ధర రూ.1,44,360, 150 చ.మీ. రూ. 1,08,270, 100 చ.మీ రూ. 72,180 గా నిర్ణయించారు. 711 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్లాట్లు విక్రయించారు. రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో 2010లో రూ.8 కోట్లను కార్పొరేషన్ అధికారులు వారినుంచి వసూలు చేశారు. ఇంకా 73 ప్లాట్లు మిగిలిపోయాయి. వీటికోసం 811 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. రియల్ బిజినెస్ ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపిన టీడీపీ పాలకులు గుణదల ప్లాట్లను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు ప్రణాళిక రచించారు. ఈ మేరకు కౌన్సిల్లో తీర్మానం చేసేందుకు తెగబడ్డారు. ఉద్యోగ వర్గాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తమకు కేటాయించాల్సిన ప్లాట్లను బయటి వ్యక్తులకు ఎలా విక్రయిస్తారంటూ ఆందోళనకు దిగారు. అనూహ్య పరిణామంతో కంగుతిన్న పాలకులు బహిరంగ వేలం ప్రక్రియకు బ్రేక్ ఇచ్చారు. తాజాగా కమిషనర్‌ను అడ్డుపెట్టుకొని లాటరీ పేరుతో రియల్ బిజినెస్‌కు ఏర్పాట్లు చేశారు. సబ్‌రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం ఆ ప్రాంతంలో గజం రూ.8,300 ఉండగా కార్పొరేషన్ ఏకంగా రూ.25 వేలు నిర్ణయించింది. ఇది ముమ్మాటికీ వ్యాపారమే అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. లాటరీ ప్రక్రియ ద్వారా ప్లాట్లను ఉద్యోగులకు కేటాయిస్తారు. గజానికి రూ.25 వేలు చొప్పున చెల్లించి వారు ప్లాటును పొందాల్సిఉంటుంది. అంత పెద్ద మొత్తాన్ని భరించలేక వదులుకుంటే తన్నుకుపోయేందుకు పలువురు కాచుకుని కూర్చున్నారు. పోరాటం తప్పదు కమిషనర్ వీరపాం డియన్ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు అన్యాయం చేసేలా ఉంది. ఆయన తన ఆలోచన మార్చుకోకుంటే ఉద్యోగుల పక్షాన నిలిచి పోరాటం చేస్తాం. మేయర్ డెరైక్షన్లోనే కమిషనర్ యాక్షన్ చేస్తున్నారు. - ఆసుల రంగనాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్