
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. సచివాలయ పరీక్షలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సచివాలయ పరీక్షల నిర్వహణను ఒక యజ్ఞంలా భావించి డీఎస్సీ చైర్మన్ హోదాలో తాను, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, జేసీ రవి పట్టన్‌శెట్టి, జేసీ– 2 ఖాజా మొహిద్దీన్, డీఆర్‌ఓ వెంకటేశం తదితరులు చక్కటి సమన్వయంతో పనిచేశామని పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌లో 24x7కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి.. జెడ్పీ సీఈఓ విశ్వేశ్వరనాయుడు, డీపీఓ కేఎల్ ప్రభాకరరావు, ఏపీఎంఐపీ పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డీఈఓ తాహెరా సుల్తానా, పరీక్షల రాష్ట్ర పరిశీలకులు శంకర నాయక్‌తో పాటు 13 మంది క్లస్టర్ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా పూర్తి చేసినట్లు వివరించారు. దాదాపు 11 వేల మంది సిబ్బంది ఈ యజ్ఞంలో భాగస్వాములయ్యారని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పరీక్షల బందోబస్తు నిర్వహణలో పాలుపంచుకున్నారని తెలిపారు. జిల్లాలో సచివాలయ పరీక్షలను రోల్ మోడల్‌గా నిర్వహించినట్లు రాష్ట్ర పీఆర్ అండ్ ఆర్‌డీ కమిషనర్ గిరిజా శంకర్ నుంచి ప్రశంసలు కూడా అందాయని వెల్లడించారు.