సర్టిఫికెట్ల పరిశీలనకు బోర్డులు ఏర్పాటు చేసుకోండి | AP Grama Sachivalayam Selected Candidates Certificates Verification In Kurnool | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్ల పరిశీలనకు బోర్డులు ఏర్పాటు చేసుకోండి

Published Sat, Sep 21 2019 7:53 AM | Last Updated on Sat, Sep 21 2019 7:53 AM

AP Grama Sachivalayam Selected Candidates Certificates Verification In Kurnool - Sakshi

సాక్షి,కర్నూలు: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల కోసం మెరిట్‌ జాబితా సిద్ధమైందని, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కోసం బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) చైర్మన్‌  జి.వీరపాండియన్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఒక్కో బోర్డులో పది మంది సభ్యులు ఉండాలని, ఒక్కో శాఖ అభ్యర్థుల సంఖ్యను బట్టి ఒకటి నుంచి పది వరకు బోర్డులను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్‌ కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టితో కలిసి సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. 9,597 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెరిట్‌ జాబితా సిద్ధమైందని, ఈ జాబితాలోని ప్రతి అభ్యర్థికి శని, ఆదివారాల్లో కాల్‌ లెటర్లను ఎస్‌ఎంఎస్, మెయిల్‌ లేదా వలంటీర్ల ద్వారా నేరుగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అభ్యర్థులు ఈ నెల 21, 22 తేదీల్లో సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. అర్హత, పుట్టిన తేదీ, రెసిడెన్స్, పీహెచ్, ఎక్స్‌ సర్వీస్‌మెన్, స్పోర్ట్స్‌ కోటాలకు సంబంధించిన సర్టిఫికెట్లను కచ్చితంగా అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఏవైనా సర్టిఫికెట్లు లేకపోతే పరిశీలన సమయంలో అవి ఎక్కడున్నాయో అధికారులు కనుగొని తగు చర్యలు తీసుకుంటారన్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్ల ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు తీసుకురావాల్సి ఉంటుందని తెలియజేశారు. ఏ రోజు, ఏ సమయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందో  అభ్యర్థులకు పంపే కాల్‌ లెటర్‌లో పేర్కొని ఉంటుందని,  దాని ప్రకారమే పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు 27వ తేదీన రోస్టర్‌ కమ్‌ మెరిట్‌ ఆధారంగా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లను ఇస్తారని, 28, 29 తేదీల్లో కౌన్సెలింగ్‌ ద్వారా  స్థానాల కేటాయింపు ఉంటుందని తెలిపారు.

సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1వ తేదీల్లో రెండు రోజుల శిక్షణ, అక్టోబర్‌ 2వ తేదీన ఉద్యోగాల్లో చేరేలా ప్రణాళికలు వేసినట్లు చెప్పారు.  ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్‌ 14వ తేదీ వరకు వి«ధుల్లో చేరేందుకు అవకాశం ఇస్తామని, ఆ లోపు రాకపోతే ఆ పోస్టును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల సందేహాలు, సలహాల కోసం జెడ్పీలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకే అభ్యర్థికి రెండు, మూడు ఉద్యోగాలు వస్తే అతను చేరే ఉద్యోగాన్ని వదిలి మిగిలిన ఉద్యోగాలను ఖాళీల కింద చూపి తరువాత మెరిట్‌ ఉన్న అభ్యర్థితో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వెల్లడించారు. అక్టోబర్‌ 2వ తేదీన మండలం/మునిసిపాలిటీల్లో ఒక సచివాలయాన్నైనా అన్ని హంగులతో ప్రారంభిస్తామని, ఇందులో అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్, డీపీఓ ప్రభాకరరావు, నగర పాలకసంస్థ కమిషనర్‌ రవీంద్రబాబు, ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ నరసింహులు, ఐసీడీఎస్‌ పీడీ లీలావతి, వ్యవసాయ శాఖ జేడీ విల్సన్, పశుసంవర్ధక శాఖ జేడీ రామచంద్రయ్య పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement