సాక్షి, కర్నూలు : ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీ గ్యాస్ లీక్ ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు. కంపెనీ లోపల మాత్రమే గ్యాస్ లీకైందని, బయట గ్యాస్ లీక్ ప్రమాదం లేదని స్పష్టం చేశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి(50) మృతి చెందినట్లు కలెక్టర్ వెల్లడించారు. గాయాలపాలైన మరో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ వీరపాండియన్ సంఘటనా స్థలానికి చేరుకుసి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అత్యవసర శాఖల అధికారులను యుద్దప్రాతిపదికన రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని, అన్ని రకాల జాగ్రత్తతు తీసుకున్నామని చెప్పారు. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు, పరిశ్రమలు, వైద్యశాఖ అధికారుల ద్వారా యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. (చదవండి : ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో విషవాయువు లీక్)
కాగా, నంద్యాలలోని మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. ఈఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. 2 టన్నుల సామర్థ్యమున్న అమ్మోనియం ట్యాంకర్ లీకవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి గ్యాస్‌ను అదుపు చేస్తోంది. ఆగ్రోప్లాంట్ చుట్టూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment