ఉపాధిని మింగేస్తున్న కోతలు
విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో చేతిపనులు చిన్నబోయాయి. వ్యాపార, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. పరిశ్రమలూ నష్టాలను చవిచూస్తున్నాయి. చిన్న వ్యాపారస్తుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని, భవిష్యత్‌లో ఇదే విధంగా ఉంటే వ్యాపారాలు మూతపడతాయని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి రోజూ వేలల్లో నష్టం వ స్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ జనరేటర్ కనెక్షన్, ఇన్వెర్టర్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల అదనపు భారంగా పడుతుందని చెబుతున్నారు.
లేత్‌మిషన్, వెల్డింగ్, జిరాక్స్, జ్యూస్ సెంటర్లు, నెట్ సెంటర్లు, ల్యాబ్‌లు, ఫ్లెక్సీ సెంటర్లు, కుటీర పరిశ్రమలు, ఫ్యాన్సీ, పాన్ షాపులు, ఐస్‌క్రీం పార్లర్లు వంటి చిన్న చిన్న వ్యాపారాలు విద్యుత్ కోతలతో సతమతమవుతున్నాయి. పూర్తిగా విద్యుత్‌పై ఆధారపడి వ్యాపారాలు చేస్తుండటంతో ఉపాధి కరువై తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులలో సైతం విద్యుత్ కోతతో ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ జనరేటర్ కన క్షన్లపైనే ఆధారపడుతున్నారు.
- న్యూస్‌లైన్/భీమవరం అర్బన్
రోజుకు రూ.2,500 నష్టం
విద్యుత్ కోత వల్ల ప్రతిరోజూ రూ.2,500 నష్టం వస్తోంది. వర్కర్లకు రోజుకు రూ.500 వేతనం ఇస్తున్నాను. కరెంటు లేకపోవడంతో పని ఉన్నా చేసే వీలులేక వారిని ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలు ఇవ్వాల్సి వస్తోంది. ఏ సమయంలో కరెంటు పోతుందో.. వస్తుందో తెలీదు. కనీసం కరెంటు కోత వేళలను కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఒప్పుకున్న పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నాం. దీంతో ఆర్డర్ ఇచ్చేవారి నుంచి మాటపడాల్సి వస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదు.
- గడప శ్రీను, వెల్డింగ్ షాపు యజమాని, భీమవరం
కూల్‌డ్రింకుల అమ్మకాలు లేవు
అసలే వేసవి కావడం వల్ల కూల్డ్రింకులు ఎక్కువగానే తాగుతారు. విద్యుత్ కోతల వల్ల కూల్‌డ్రింక్‌లు చల్లబడటంలేదు. దీంతో కొనుగోలుదారులు తాగేందుకు నిరాకరిస్తున్నారు. కూల్డ్రింకులు, మంచినీరు తదితర పానీయాల అమ్మకాలు తగ్గిపోయి రోజుకు రూ.500 వరకు నష్టం వస్తోంది. కనీసం కోతల సమయాన్ని తగ్గిస్తే కొంతవరకైనా వ్యాపారం ఉంటుంది. అధికారులు విద్యుత్‌ను సరఫరాను మెరుగుపరచాలి.
- భాస్కర్, కూల్‌డ్రింక్ షాపు యజమాని
అదనపు భారం రోజుకు రూ.2 వేలు
విద్యుత్ కోతల కారణంగా క్యాంటీన్లో జనరేటర్‌ను ఉపయోగించక తప్పడం లేదు. లేకపోతే వినియోగదారులు వచ్చే అవకాశంలేదు. జనరేటర్ కోసం డీజిల్ ఖర్చు రోజుకు రూ.2 వేలు వరకు ఉంటుంది. మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వీటితో పాటు జనరేటర్‌కు వినియోగం అదనపు భారంగా మారింది. చిన్న వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ కోతలను తగ్గించాలి.
- తాళ్లపూడి పరమేశ్వరరావు, గణేష్ క్యాంటీన్ యజమాని, భీమవరం