Gainik ward
-
‘నువ్వు ఏమైనా జీతాలు ఇస్తున్నావా..
‘నువ్వు ఏమైనా జీతాలు ఇస్తున్నావా.. ఎవరు మాకు చెప్పడానికి ఇక్కడ ప్రసవం చెయ్యం.. హైదరాబాద్‌కు తీసుకుపో..’ ఇవి జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో పనిచేసే వైద్యసిబ్బంది ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు, వారి కుటుంబ సభ్యులతో అంటున్న మాటలు. ఈ ఫొటోలో కనిస్తున్న గర్భిణి పేరు ప్రియాంక. మహబూబ్‌నగర్ పట్టణంలోని టీడీగుట్టకు చెందిన ఈమె మూడో ప్రసవం కోసం ఈనెల 25వ తేదీ ఉదయం జనరల్ ఆస్పత్రికి వచ్చింది. కాగా, గతంలోనే వైద్యులు పరీక్షించి మే 2వ తేదీ డెలివరీ సమయం ఇచ్చారు. కాకపోతే ముందే నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకొచ్చారు. దీంతో ఆమెకు లేబర్ రూంలో నొప్పులు వస్తున్నాయని చెప్పగా అక్కడ పనిచేసే వైద్యసిబ్బంది సరిగా చూడలేదు. పైగా దూషిస్తూ ‘ఆమెకు ప్రసవం చేయం.. మీరు హైదరాబాద్ వెళ్లండి..’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో రెండు రోజుల పాటు అక్కడే ఉన్న వారు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడానికి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి తిరిగి వెళ్లారు. మహబూబ్‌నగర్ క్రైం: రోజురోజుకూ జిల్లా జనరల్ ఆస్పత్రిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. కరోనా అనుమానితుల శాంపిళ్ల సేకరణ, వారికి అవసరమైన వైద్యం అందించే క్రమంలో ఇతర రోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తాయి. వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బందిపై అధికారుల పర్యవేక్షణ కరువై వైద్యం గాడితప్పింది. ముఖ్యంగా నవమాసాలు మోసి ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు వైద్యులు, సిబ్బంది చుక్కలు చూపుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణులు ఆపసోపాలు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యసిబ్బంది ఇష్టం వచ్చినట్టు దూషిస్తుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆస్పత్రిలోని గైనిక్ వార్డు బయట గర్భిణులు పురిటినొప్పులతో అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇక క్యాజువాలిటీ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏదైనా అత్యవసరమైన వైద్యం కోసం, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి చికిత్స కోసం వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు వైద్యసిబ్బంది దూషించినట్టు మా దృష్టికి తేలేదు. ఎవరికైనా సరైన వైద్యం అందక ఇబ్బంది పడితే ఫిర్యాదు చేస్తే బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం. ప్రతిరోజూ 40 నుంచి 50 వరకు ప్రసవాలు చేస్తున్నాం. ప్రస్తుతం బయట ప్రైవేట్ ఆస్పత్రులు లేకపోవడంతో చాలా వరకు అందరూ ఇక్కడికే వస్తున్నారు. ఈనెల 750వరకు ప్రసవాలు చేశాం.– డాక్టర్ రామకిషన్,జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
బందరు ప్రభుత్వాస్పత్రిలో హడలిపోతున్న రోగులు
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ఇక్కడ కళ్లు తెరచినా... మూసినా అమ్యామ్యా సమర్పించుకోవాల్సిందే. ఒకవేళ ఎవరైనా ఎందికివ్వాలని ప్రశ్నిస్తే వారి ఒళ్లు హూనం కాకతప్పదు. ఉచిత సేవలందించాల్సిన సిబ్బందే రౌడీల అవతారమెత్తి మామూళ్లు వసూలు చేస్తూ రోగుల పట్ట నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇక్కడ చికిత్స కోసం చేరాలంటేనే హడలిపోతున్నారు. ఇదీ బందరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందే రోగుల దుస్థితి. ప్రైవేటు ఆస్పత్రికి వెళితే డబ్బులు ఖర్చవుతాయని ప్రభుత్వాసుపత్రికి వస్తే చికిత్స చేయించుకుని ఇంటిదారి పట్టేలోపు ఇక్కడ కూడా వేలాది రూపాయలను సిబ్బందికి సమర్పించుకోవాల్సి వస్తోంది. ఊడ్చే కార్మికుల నుంచి బట్టలు ఉతికే ధోబీ, స్ట్రేచర్ తోసే సహాయకుడు, గైనిక్‌వార్డులో సేవలందించే సహాయకులు ప్రతి పనికీ రూ. 50 నుంచి రూ. 500 వరకూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారని రోగులు పేర్కొంటున్నారు. ఈ కోవలోనే ఆస్పత్రిలో ఇటీవల జరిగిన ఘటన సిబ్బంది దౌర్జన్యానికి, అక్రమ వసూళ్లకు దర్పణం పడుతోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఘంటసాల మండలం తెలుగురావుపాలెంకు చెందిన పీ సుధారాణి అనే గర్భిణి నెలలు నిండటంతో ప్రసవం కోసం 26వ తేదీ సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరింది. ఉదయం వైద్యపరీక్షలు జరిపిన వైద్యురాలు ఈమెకు సిజేరియన్ చేశారు. సుధారాణి మగశిశువుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ థియేటర్ నుంచి ఈమెను స్ట్రేచర్‌పై తోసుకుని వచ్చే దోబీ శ్రీనివాసరావు, థియేటర్ బయట ఉన్న సుధారాణి భర్త పీ బాలవర్ధనరెడ్డి వద్దకు వచ్చి నీకు బాబు పుట్టాడని చెప్పి ఆమెను వార్డుకు తీసుకు వచ్చినందుకు రూ. 500 ఇవ్వాలని అడిగారు. దీనికి విభేదించిన బాలవర్ధనరెడ్డి రూ.400 ఇస్తానని చెప్పాడు. కుదరదు రూ 500 ఇవ్వాలని దోబీ పట్టుపట్టాడు. సరే నీవడిగిన రూ. 500 ఇస్తాను. ప్రస్తుతం నావద్ద డబ్బులులేవు. ఏటీఎంకు వెళ్లి తెచ్చి ఇస్తాను. నమ్మకపోతే ఏటీఎం నీవద్దే పెట్టుకోమని రెడ్డి దోబీకి చూసించాడు. దీనికి దోబీ శ్రీనివాసరావు సంతృప్తి చెందలేదు. అనంతరం సుధారాణిని ధోబీ స్ట్రేచర్‌పై ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా తోసుకుంటూ వస్తున్నాడు. దీన్ని చూసి తట్టుకోలేని రెడ్డి స్ట్రేచర్‌ను ఎందుకు అలా తోస్తున్నావ్.. నిదానంగా తోయ్.. అని కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన దోబీ నేనడిగిన డబ్బులు ఇవ్వని నీవేంటి మాట్లాడేదంటూ రెడ్డిపై చేయి చేసుకున్నాడు. దీంతో కొద్ది సేపు ఇద్దరూ ఘర్షణకు దిగారు. స్ట్రేచర్‌పై ఎడాపెడా తోసుకురావటంతో సుధారాణికి కుట్లు కదిలి విపరీతమైన నొప్పులొచ్చాయి. దీంతో రెడ్డి దోబీ శ్రీనివాసరావు వ్యవహారశైలిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ సోమసుందరరావుకు అదే రోజు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత డ్యూటీలో ఉన్న ఎన్కే రాణి అనే స్టాఫ్‌నర్స్ సుధారాణి వద్దకొచ్చి నీ భర్త ఎక్కువ చేస్తున్నాడు... నీవు ఇక్కడ ఇంకా 10 రోజులుండాలి...మా సిబ్బందిపైనే ఫిర్యాదు చేస్తాడా అని బెదిరించింది. దీంతో సుధారాణికి బీపీ అధికం కావటంతో బంధువులు ఆందోళన చెందారు. ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యంగా జరుగుతున్నా దీర్ఘకాలంగా ఇక్కడే ఉద్యోగం చేస్తున్న కింది స్ధాయి సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాస్పత్రి అధికారులు సాహసం చేయలేకపోవటంపై పలు విమర్శలు వినవస్తున్నాయి. చర్యలు తీసుకుంటాం : సోమసుందరరావు, సూపరింటెండెంట్ సుధారాణి భర్త బాలవర్ధనరెడ్డి జరిగిన సంఘనటపై రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చాడు. ఈ సంఘటనపై విచారణ జరిపి లంచం అడిగి, దాడికి పాల్పడ్డాడనే ఆరోపణ ఎదుర్కొంటున్న దోబీ శ్రీనివాసరావుపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.