బందరు ప్రభుత్వాస్పత్రిలో హడలిపోతున్న రోగులు | Staff Corruption in Bandar Government Hospital | Sakshi
Sakshi News home page

బందరు ప్రభుత్వాస్పత్రిలో హడలిపోతున్న రోగులు

Published Sun, Sep 1 2013 2:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

Staff Corruption in Bandar Government Hospital

మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ఇక్కడ కళ్లు తెరచినా... మూసినా అమ్యామ్యా సమర్పించుకోవాల్సిందే. ఒకవేళ ఎవరైనా ఎందికివ్వాలని ప్రశ్నిస్తే వారి ఒళ్లు హూనం కాకతప్పదు.  ఉచిత సేవలందించాల్సిన సిబ్బందే రౌడీల అవతారమెత్తి మామూళ్లు వసూలు చేస్తూ రోగుల పట్ట నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇక్కడ చికిత్స కోసం చేరాలంటేనే  హడలిపోతున్నారు.  ఇదీ బందరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందే రోగుల దుస్థితి.

ప్రైవేటు ఆస్పత్రికి వెళితే డబ్బులు ఖర్చవుతాయని ప్రభుత్వాసుపత్రికి వస్తే చికిత్స చేయించుకుని ఇంటిదారి పట్టేలోపు ఇక్కడ కూడా వేలాది రూపాయలను సిబ్బందికి సమర్పించుకోవాల్సి వస్తోంది. ఊడ్చే కార్మికుల నుంచి బట్టలు ఉతికే ధోబీ, స్ట్రేచర్ తోసే సహాయకుడు, గైనిక్‌వార్డులో సేవలందించే సహాయకులు ప్రతి పనికీ రూ. 50  నుంచి రూ. 500  వరకూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారని రోగులు పేర్కొంటున్నారు. ఈ కోవలోనే ఆస్పత్రిలో ఇటీవల జరిగిన ఘటన  సిబ్బంది దౌర్జన్యానికి, అక్రమ వసూళ్లకు దర్పణం పడుతోంది.  

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఘంటసాల మండలం తెలుగురావుపాలెంకు చెందిన పీ సుధారాణి అనే గర్భిణి నెలలు నిండటంతో ప్రసవం కోసం  26వ తేదీ సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరింది. ఉదయం వైద్యపరీక్షలు జరిపిన వైద్యురాలు ఈమెకు సిజేరియన్ చేశారు. సుధారాణి మగశిశువుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ థియేటర్ నుంచి ఈమెను స్ట్రేచర్‌పై తోసుకుని వచ్చే దోబీ శ్రీనివాసరావు, థియేటర్ బయట ఉన్న సుధారాణి భర్త పీ బాలవర్ధనరెడ్డి వద్దకు వచ్చి నీకు బాబు పుట్టాడని చెప్పి  ఆమెను వార్డుకు తీసుకు వచ్చినందుకు రూ. 500 ఇవ్వాలని అడిగారు.

దీనికి విభేదించిన బాలవర్ధనరెడ్డి రూ.400 ఇస్తానని చెప్పాడు. కుదరదు రూ 500  ఇవ్వాలని దోబీ పట్టుపట్టాడు. సరే నీవడిగిన రూ. 500  ఇస్తాను. ప్రస్తుతం నావద్ద డబ్బులులేవు. ఏటీఎంకు వెళ్లి తెచ్చి ఇస్తాను. నమ్మకపోతే ఏటీఎం నీవద్దే పెట్టుకోమని రెడ్డి దోబీకి చూసించాడు. దీనికి దోబీ శ్రీనివాసరావు సంతృప్తి చెందలేదు. అనంతరం సుధారాణిని ధోబీ స్ట్రేచర్‌పై ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా తోసుకుంటూ వస్తున్నాడు. దీన్ని చూసి తట్టుకోలేని రెడ్డి స్ట్రేచర్‌ను ఎందుకు అలా తోస్తున్నావ్.. నిదానంగా తోయ్.. అని కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన దోబీ నేనడిగిన డబ్బులు ఇవ్వని నీవేంటి మాట్లాడేదంటూ రెడ్డిపై చేయి చేసుకున్నాడు.

దీంతో కొద్ది సేపు ఇద్దరూ ఘర్షణకు దిగారు. స్ట్రేచర్‌పై ఎడాపెడా తోసుకురావటంతో సుధారాణికి కుట్లు కదిలి విపరీతమైన నొప్పులొచ్చాయి. దీంతో రెడ్డి దోబీ శ్రీనివాసరావు వ్యవహారశైలిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ సోమసుందరరావుకు అదే రోజు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత డ్యూటీలో ఉన్న ఎన్‌కే రాణి అనే స్టాఫ్‌నర్స్ సుధారాణి వద్దకొచ్చి నీ భర్త ఎక్కువ చేస్తున్నాడు... నీవు ఇక్కడ ఇంకా 10 రోజులుండాలి...మా సిబ్బందిపైనే ఫిర్యాదు చేస్తాడా అని  బెదిరించింది. దీంతో సుధారాణికి బీపీ అధికం కావటంతో బంధువులు ఆందోళన చెందారు.
 
ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యంగా జరుగుతున్నా దీర్ఘకాలంగా ఇక్కడే ఉద్యోగం చేస్తున్న  కింది స్ధాయి సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాస్పత్రి అధికారులు సాహసం చేయలేకపోవటంపై పలు విమర్శలు వినవస్తున్నాయి.

 చర్యలు తీసుకుంటాం : సోమసుందరరావు,  సూపరింటెండెంట్


 సుధారాణి భర్త బాలవర్ధనరెడ్డి జరిగిన సంఘనటపై రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చాడు. ఈ సంఘటనపై విచారణ జరిపి లంచం అడిగి, దాడికి పాల్పడ్డాడనే ఆరోపణ ఎదుర్కొంటున్న దోబీ శ్రీనివాసరావుపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement