సీనియర్ ఫొటో జర్నలిస్టు ఆత్మహత్య
సాక్షి, ముంబై: సీనియర్ ఛాయా గ్రాహకుడు గజానన్ గుర్యె (58) శనివారం వేకువజామున దాదర్‌లోని ఆయన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనకు కారణాలేంటన్నది మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. దాదర్‌లోని శివసేన పార్టీ ప్రధాన భవనం సమీపంలో ఉన్న సాయిచరణ్ బిల్డింగ్ మూడవ అంతస్తులో ఆయన నివాసముంటున్నారు. రోజు లాగానే గజానన్ గుర్యె శుక్రవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులకు బెడ్రూమ్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆయన మృతదేహం కన్పించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. కొన్ని రోజులుగా ఆయన కొంత మానసిక అశాంతితో ఉన్నారని, దానివల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.
35 సంవత్సరాలకుపైగా...
ఛాయాగ్రాహకుడిగా గజానన్ 35 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వసంత్ దాదా పాటిల్, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నుంచి శరద్ పవార్ వరకు దాదాపు అందరు రాజకీయ నాయకులతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన జిజిపిక్స్.కామ్ (జజఞజీఛిజుట.ఛిౌఝ) అనే వెబ్సైట్ రూపొందిం చారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కార్యక్రమాలు జరిగినా ఫొటోలు తీసి ఆ వెబ్సైట్లో పొందుపరిచేవారు. దీంతో నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వెలుపడే అనేక పత్రికలకు రాజకీయ పార్టీలు, నాయకులు, ఇతర ఫొటోలు ఆ వెబ్సైట్లో ఉచితంగా లభించేవి. ఇలా ఆయన ఫొటోలు అనేక మంది వాడుకుంటున్నారు. ఆయన ఓ ఛాయాగ్రాహకుడిగా గుర్తింపు పొందడంతోపాటు అనేక మంది ఛాయాగ్రాహకులుగా ఎదిగేందుకు సహాయపడ్డారు. ఇప్పటికీ ఆయన వద్ద అనేక మంది విధులు నిర్వహిస్తుండడం విశేషం.