galla jaidev
-
‘చిక్కరు... దొరకరు... కనపడరు’
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు పార్లమెంటు సభ్యుడు, ఇద్దరు మంత్రులు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారారు. వారి గురించి ‘చిక్కరూ, దొరకరు, కనపడరని’ ఆ పార్టీ కార్యకర్తలే సరదా కామెంట్లు విసురుతున్నారు. పార్లమె ంటు సమావేశాలు ముగిసి పది రోజులు దాటినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. రాష్ట్ర మంత్రుల్లో ప్రత్తిపాటి పుల్లారావు అడపాదడపా వస్తున్నా, రావెల కిషోర్ దొరకడం లేదు. నిత్యం అందుబాటులో ఉంటామని, సమస్యలు పరిష్కరిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని, పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన ఈ నేతలు వాటిని పూర్తిగా విస్మరించారు. కనీసం ఫోన్‌కాల్స్‌కు కూడా స్పందించడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. * ప్రత్తిపాటి పుల్లారావుకు జిల్లాలో కేరాఫ్ అడ్రస్ అంటూ ఒకటి ఉందని, రావెల కిషోర్, గల్లా జయదేవ్‌లకు కేరాఫ్ అడ్రస్‌లు లేకపోవడంతో ఎక్కడ కలుసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు, కార్యకర్తలు వాపోతున్నారు. * ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరుపై నిఘా ఉందని, దాని ఆధారంగా మార్కులు ఉంటాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ టీమ్ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడమే కాని ఆ పరిస్థితులేవీ జిల్లాలో కనపడటం లేదు. * ఇటీవల నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి పలు మార్లు మంత్రి రావెలకు ఫోన్ చేసినా స్పందించ లేదు. చిన్నపాటి బదిలీలు, సమస్యలు పరిష్కరించు కోలేని దుస్థితిలో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అందుబాటులో ఉన్నా స్థానిక నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోన రగిలిపోతున్నారు. * ఎంపీ గల్లా జయదేవ్ పరిస్థితి మరీ విచిత్రం. ఆయనకు గుంటూరులో స్థిర నివాసం లేదు. కుటుంబ సభ్యులూ ఇక్కడ ఉండరు. దాంతో ఆయన రాకపోకల సమాచారం పార్టీ ముఖ్యనేతలకీ తెలియడం లేదు. * సామాన్య ప్రజలకు ఆయన కార్యాలయ గడప తొక్కే పరిస్థితే లేదు. ఖరీదైన కారుల్లో వచ్చే వారికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటోంది. * సాగునీటి సమస్య ఎదుర్కొంటున్న రైతులు ఎంపీ జయదేవ్ అందుబాటులో లేకపోవడంతో ఎంపీటీసీ, జెడ్సీటీసీ సభ్యులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. * ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం, జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చిన గల్లా చివరకు గుంటూరులో ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోలేదని, ఇక ఈయనేం అభివృద్ధి చేస్తారని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. * మంత్రి పుల్లారావు జిల్లాకు వచ్చినప్పుడు కలిసేందుకు వెళ్లిన సామాన్య ప్రజలు, కార్యకర్తలను సెక్యూరిటీ సిబ్బంది బయటకు నెట్టివేస్తున్నారు. కనీసం మంత్రి బయటకు వచ్చినప్పుడైనా తమవైపు చూడకపోతారా అని వేచి చూసే కార్యకర్తలకు నిరాశే మిగులుతోంది. * చివరకు హైదరాబాద్‌లో కలుద్దామని వెళ్లినా అక్కడా చుక్కెదురవుతో ంది. కేవలం నిమిషం సమయం కేటాయించి ఇక్కడి వరకు రావాలా...నియోజవర్గంలోనే కలుద్దాం అంటూ మంత్రి వారిని సున్నితంగా తిప్పి పంపుతున్నారు. * ఓట్లు వేసి గెలిపించుకున్న తమ నాయకుడు మంత్రి అయ్యారనీ, తమ కూ మేలు చేస్తారని కలలు కంటున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో అంతర్మథనం ఆరంభమైంది. -
మీలాంటి వాళ్లను ఎక్కడ ఉంచాలో తెలుసు..
ఫిరంగిపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని మాత్రం ఏమీ అనడం లేదు, మా పార్టీ కార్యకర్తలను మాత్రం కనీసం ఓట్లు వేసేందుకు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వరా అంటూ ఎస్ఐ పి.ఉద యబాబుతో టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ దురుసుగా ప్రవర్తించారు. స్థానిక సెయింట్‌పాల్స్, సెయింట్ ఆన్స్ పాఠశాల కేంద్రాల్లో పోలింగ్ సరళిని వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కత్తెర హెనీ క్రిస్టినా పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్, అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ తో కలసి రెండు చోట్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. హెనీక్రిస్టినా వెంటనే చర్చి ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ఆమె వెంట వచ్చిన కార్యకర్తలు చర్చి ప్రాంగణంలో నుంచి బెల్ టవర్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సెయింట్‌ఆన్స్ పాఠశాలలో కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లి టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు చర్చి ప్రాంగణంలో ఉన్న చెట్టు కింద ఉన్న కార్యకర్తలతో మాట్లాడుతుండగా అప్పుడే ఎన్నికల కేంద్రానికి చేరుకున్న ఎస్ఐ ఉదయబాబు ఇక్కడ ఎవ్వరూ ఉండవద్దు వె ళ్లిపోవాలంటూ సూచించారు. ఇంతలో టీడీపీ కార్యకర్తలు కొంతమంది ఎస్ఐపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా ఉంటున్నాడని గల్లా జయదేవ్ దృష్టి తెచ్చారు. దీంతో రెచ్చిపోయిన ఆయన వచ్చేది మా ప్రభుత్వమే.. మా వెంట కార్యకర్తలు ఉండకూడదా అంటూ ఎస్ఐతో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇంకా ఎన్నాళ్ళు చేస్తారో చూస్తాం.. మీ లాంటి అధికారులను ఎక్కడ ఉంచాలో మాకు తెలుసంటూ ఆవేశంగా మాట్లాడారు. ఎస్ఐ ఉదయబాబు మాత్రం సంయమనం పాటిస్తూ అక్కడి నుంచి కార్యకర్తలు, నాయకులను పంపించి వేశారు. -
గుంటూరుకు ‘గల్లా’
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు చేస్తున్న కసరత్తు ఆ పార్టీలో కలవరాన్ని సృష్టిస్తోంది. కష్టకాలంలో పార్టీని బతికించినవారిని విస్మరించి సర్వేల పేరుతో ధనికులకు రెడ్ కార్పెట్ పరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. కొనసాగుతున్న నియోజకవర్గాల నుంచే పోటీచేస్తామని తెగేసి చెబుతున్నారు. కసరత్తు ప్రారంభమైన రోజే నేతల నుంచి తిరుగుబాటు స్వరం వినపడటంతో ఆ కసరత్తును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మరి కొందరు ఎమ్మెల్యేల సమక్షంలో అధినేత రాజధానిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, తెనాలి, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన కసరత్తుపై ఆ పార్టీలో చర్చ కొనసాగుతోంది. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ పేరును అధినేత చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలో గల్లా జయదేవ్‌కు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్టు అధినేత స్పష్టం చేశారు. అసెంబ్లీ సెగ్మంట్లలోని పార్టీనేతలు కూడా గల్లాకు అనుకూలంగా ఉండటంతో అతని పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు పేరును అధినేత పరిశీలించినట్టు తెలిసింది. ఆ నియోజకవర్గంలో ఆయనకు బంధువులు వున్నారని, కమ్మ సామాజికవర్గం కూడా అక్కడ అధికంగా ఉన్నట్టు గణాంకాలతో వివరించినట్టు తెలిసింది. ఆ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలనే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనను రాజా వ్యతిరేకించినట్టు సమాచారం. తాను గుంటూరు నుంచి పోటీచేయనని, తెనాలి నియోజకవర్గంలో ఐదేళ్ల నుంచి పార్టీని పటిష్టం చేస్తుంటే, అక్కడికి ఎలా వెళతానని ఆయన తన అభిమానుల వద్ద పేర్కొన్నట్టు తెలిసింది. రాజా కూడా దీనిని వ్యతిరేకిస్తున్న సమాచారం బాబు వద్ద ఉండటంతో తర్వాత పరిశీలించే ధోరణిలో ఉన్నట్టు తెలిసింది. ఇక నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరుమల డెయిరీ మేనేజింగ్ డెరైక్టర్ దండా బ్రహ్మానందం పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఆ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ వ్యతిరేక వర్గం ఇటీవల చంద్రబాబును కలిసి బ్రహ్మానందంకు సీటు ఇవ్వాలని కోరినట్టు పార్టీ వర్గాల కథనం. తిరుమల డెయిరీలో ముఖ్య భాగస్వాములంతా బ్రహ్మానందంకు మద్దతు పలకడంతో కోడెల వ్యతిరేక వర్గం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు పార్టీ వర్గాల కథనం. నియోజకవర్గాల పునర్విభజనలో కోడెల స్వగ్రామం కండ్లకుంట (నకరికల్లు మండలం) సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఆయన్ను అక్కడికి పంపితే పరిస్థితులు సానుకూలంగా ఉంటాయనే అభిప్రాయం వినపడుతోంది. అయితే ఈ ప్రస్తావన అధినేత వద్ద రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై రాజధానిలో తరచూ కసరత్తులు జరుగుతుండటంతో పార్టీ నేతలు అక్కడే మకాం వేస్తున్నారని కార్యకర్తలు చెబుతున్నారు. -
సినీ గ్లామర్ కోసం తహతహ!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సినీ నటుడు కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్‌కు గుంటూరు ఎంపీ సీటు ఇవ్వాలని జిల్లా టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. అతనికి సీటు ఇస్తే సినీనటుడు మహేష్‌బాబును ఉపయోగించుకుని ఎక్కువ ఓట్లు పొందవచ్చనే ఆలోచనతో ఉన్నారు. మరోవైపున కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ నుంచి గుంటూరు ఎంపీ సీటును ఆశిస్తున్నప్పటికీ జయదేవ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థులెవరూ కనపడకపోవడంతో స్థానిక నేతలు గల్లా జయదేవ్ పేరును తెరపైకి తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనలో స్థానిక నేతల స్వార్థం లేకపోలేదు. ఆర్థికంగా వెసులుబాటు కలిగిన గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తే అసెంబ్లీ సెగ్మెంట్లలోని అభ్యర్థులకు నిధుల సమస్య ఉండదని, సినీనటుడు మహేష్‌ను ప్రచారానికి తీసుకురావచ్చని, అలా కుదరని పక్షంలో ఆతని ఫ్యాన్స్ ద్వారా పార్టీకి మరిన్ని ఓట్లు పొందాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు చేసిన సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ఇప్పుడు దివంగత ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధాలు బెడిసికొట్టాయి. అధినేత చంద్రబాబు, సినీనటుడు బాలకృష్ణతో తీవ్రస్థాయిలో విభేదాలు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్‌పై ఆశలు వదులుకున్నారు. ఇక మిగిలింది సినీనటుడు బాలకృష్ణ ఒక్కరే. రానున్న ఎన్నికల్లో తాను పోటీచేస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించారు. పార్టీ ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా బాలకృష్ణ పర్యటించలేకపోవచ్చని, ఒకవేళ పర్యటించినా ఆశించిన ఫలితం రాకపోవచ్చనే భావనలో ఉన్నారు. బహిరంగ సభల్లో ఆయన ప్రసంగాలు, హావభావాలు ప్రజల్ని ఆకర్షించలేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ప్రజల్ని ఆకర్షించే శక్తిగాని, ఆ దిశగా ఆయన ప్రసంగాలు లేకపోవడంతో ఈ ఎన్నికలకు ప్రిన్స్మహేష్పైనే ఆశలు పెంచుకున్నారు. ఘట్టమనేని కృష్ణ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆయన అల్లుడుకు ఇక్కడ సీటు కేటాయిస్తే జిల్లాలో పార్టీ పరి స్థితి కొంత మెరుగవుతుందనే భావన స్థానిక నేతలకు ఉంది. ఇక్కడ అభ్యర్థులు లభించక ఎక్కడ నుంచో దిగుమతి చేసుకున్నారనే విమర్శ నుంచి తప్పుకునే అవకాశం లేకపోలేదు. ఈ విషయాలను అధినేతకు స్థానిక నేతలు వివరించినట్టు తెలుస్తోంది. గ్లామర్‌కు రాలని ఓట్లు.. 2004 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సినీ నిర్మాత అశ్వనీదత్ పోటీచేశారు. సినీ రంగంలో మంచి ఫామ్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి అశ్వనీదత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అశ్వనీదత్ కోసం చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే ఊహాగానాలు కూడా వినపడ్డాయి. అశ్వనీదత్‌తోపాటు పార్టీనేతలు ఎప్పటికప్పుడు చిరంజీవి ప్రచారానికి వస్తున్నారని చెప్పుకుంటూ వచ్చారు. చివరకు చిరంజీవి ప్రచారానికి రాకుండా ఓ దినపత్రిక ద్వారా అశ్వనీదత్ గెలుపునకు సహకరించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అయితే ఆ పిలుపునకు అభిమానులు స్పందించకపోవడంతో అశ్వనీదత్ ఓటమి పాలయ్యారు. మరి రానున్న ఎన్నికల్లో ఈ సినీగ్లామర్ ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచిచూడాల్సిందే మరి!