మీలాంటి వాళ్లను ఎక్కడ ఉంచాలో తెలుసు..
ఫిరంగిపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని మాత్రం ఏమీ అనడం లేదు, మా పార్టీ కార్యకర్తలను మాత్రం కనీసం ఓట్లు వేసేందుకు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వరా అంటూ ఎస్‌ఐ పి.ఉద యబాబుతో టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ దురుసుగా ప్రవర్తించారు. స్థానిక సెయింట్‌పాల్స్, సెయింట్ ఆన్స్ పాఠశాల కేంద్రాల్లో పోలింగ్ సరళిని వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కత్తెర హెనీ క్రిస్టినా పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్, అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ తో కలసి రెండు చోట్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. హెనీక్రిస్టినా వెంటనే చర్చి ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.
ఆమె వెంట వచ్చిన కార్యకర్తలు చర్చి ప్రాంగణంలో నుంచి బెల్ టవర్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సెయింట్‌ఆన్స్ పాఠశాలలో కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లి టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు చర్చి ప్రాంగణంలో ఉన్న చెట్టు కింద ఉన్న కార్యకర్తలతో మాట్లాడుతుండగా అప్పుడే ఎన్నికల కేంద్రానికి చేరుకున్న ఎస్‌ఐ ఉదయబాబు ఇక్కడ ఎవ్వరూ ఉండవద్దు వె ళ్లిపోవాలంటూ సూచించారు. ఇంతలో టీడీపీ కార్యకర్తలు కొంతమంది ఎస్‌ఐపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా ఉంటున్నాడని గల్లా జయదేవ్ దృష్టి తెచ్చారు. దీంతో రెచ్చిపోయిన ఆయన వచ్చేది మా ప్రభుత్వమే.. మా వెంట కార్యకర్తలు ఉండకూడదా అంటూ ఎస్‌ఐతో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇంకా ఎన్నాళ్ళు చేస్తారో చూస్తాం.. మీ లాంటి అధికారులను ఎక్కడ ఉంచాలో మాకు తెలుసంటూ ఆవేశంగా మాట్లాడారు. ఎస్‌ఐ ఉదయబాబు మాత్రం సంయమనం పాటిస్తూ అక్కడి నుంచి కార్యకర్తలు, నాయకులను పంపించి వేశారు.