సినీ గ్లామర్ కోసం తహతహ!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సినీ నటుడు కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్‌కు గుంటూరు ఎంపీ సీటు ఇవ్వాలని జిల్లా టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. అతనికి సీటు ఇస్తే సినీనటుడు మహేష్‌బాబును ఉపయోగించుకుని ఎక్కువ ఓట్లు పొందవచ్చనే ఆలోచనతో ఉన్నారు. మరోవైపున కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ నుంచి గుంటూరు ఎంపీ సీటును ఆశిస్తున్నప్పటికీ జయదేవ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థులెవరూ కనపడకపోవడంతో స్థానిక నేతలు గల్లా జయదేవ్ పేరును తెరపైకి తీసుకువచ్చారు.
ఈ ప్రతిపాదనలో స్థానిక నేతల స్వార్థం లేకపోలేదు. ఆర్థికంగా వెసులుబాటు కలిగిన గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తే అసెంబ్లీ సెగ్మెంట్లలోని అభ్యర్థులకు నిధుల సమస్య ఉండదని, సినీనటుడు మహేష్‌ను ప్రచారానికి తీసుకురావచ్చని, అలా కుదరని పక్షంలో ఆతని ఫ్యాన్స్ ద్వారా పార్టీకి మరిన్ని ఓట్లు పొందాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు చేసిన సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ఇప్పుడు దివంగత ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధాలు బెడిసికొట్టాయి. అధినేత చంద్రబాబు, సినీనటుడు బాలకృష్ణతో తీవ్రస్థాయిలో విభేదాలు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్‌పై ఆశలు వదులుకున్నారు. ఇక మిగిలింది సినీనటుడు బాలకృష్ణ ఒక్కరే. రానున్న ఎన్నికల్లో తాను పోటీచేస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించారు.
పార్టీ ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా బాలకృష్ణ పర్యటించలేకపోవచ్చని, ఒకవేళ పర్యటించినా ఆశించిన ఫలితం రాకపోవచ్చనే భావనలో ఉన్నారు. బహిరంగ సభల్లో ఆయన ప్రసంగాలు, హావభావాలు ప్రజల్ని ఆకర్షించలేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ప్రజల్ని ఆకర్షించే శక్తిగాని, ఆ దిశగా ఆయన ప్రసంగాలు లేకపోవడంతో ఈ ఎన్నికలకు ప్రిన్స్‌మహేష్‌పైనే ఆశలు పెంచుకున్నారు. ఘట్టమనేని కృష్ణ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆయన అల్లుడుకు ఇక్కడ సీటు కేటాయిస్తే జిల్లాలో పార్టీ పరి స్థితి కొంత మెరుగవుతుందనే భావన స్థానిక నేతలకు ఉంది. ఇక్కడ అభ్యర్థులు లభించక ఎక్కడ నుంచో దిగుమతి చేసుకున్నారనే విమర్శ నుంచి తప్పుకునే అవకాశం లేకపోలేదు. ఈ విషయాలను అధినేతకు స్థానిక నేతలు వివరించినట్టు తెలుస్తోంది.
గ్లామర్‌కు రాలని ఓట్లు.. 2004 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సినీ నిర్మాత అశ్వనీదత్ పోటీచేశారు. సినీ రంగంలో మంచి ఫామ్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి అశ్వనీదత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అశ్వనీదత్ కోసం చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే ఊహాగానాలు కూడా వినపడ్డాయి. అశ్వనీదత్‌తోపాటు పార్టీనేతలు ఎప్పటికప్పుడు చిరంజీవి ప్రచారానికి వస్తున్నారని చెప్పుకుంటూ వచ్చారు. చివరకు చిరంజీవి ప్రచారానికి రాకుండా ఓ దినపత్రిక ద్వారా అశ్వనీదత్ గెలుపునకు సహకరించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అయితే ఆ పిలుపునకు అభిమానులు స్పందించకపోవడంతో అశ్వనీదత్ ఓటమి పాలయ్యారు. మరి రానున్న ఎన్నికల్లో ఈ సినీగ్లామర్ ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచిచూడాల్సిందే మరి!