గుంటూరుకు ‘గల్లా’
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు చేస్తున్న కసరత్తు ఆ పార్టీలో కలవరాన్ని సృష్టిస్తోంది. కష్టకాలంలో పార్టీని బతికించినవారిని విస్మరించి సర్వేల పేరుతో ధనికులకు రెడ్ కార్పెట్ పరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. కొనసాగుతున్న నియోజకవర్గాల నుంచే పోటీచేస్తామని తెగేసి చెబుతున్నారు.
కసరత్తు ప్రారంభమైన రోజే నేతల నుంచి తిరుగుబాటు స్వరం వినపడటంతో ఆ కసరత్తును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మరి కొందరు ఎమ్మెల్యేల సమక్షంలో అధినేత రాజధానిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, తెనాలి, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన కసరత్తుపై ఆ పార్టీలో చర్చ కొనసాగుతోంది.
గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ పేరును అధినేత చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలో గల్లా జయదేవ్‌కు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్టు అధినేత స్పష్టం చేశారు. అసెంబ్లీ సెగ్మంట్లలోని పార్టీనేతలు కూడా గల్లాకు అనుకూలంగా ఉండటంతో అతని పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు పేరును అధినేత పరిశీలించినట్టు తెలిసింది. ఆ నియోజకవర్గంలో ఆయనకు బంధువులు వున్నారని, కమ్మ సామాజికవర్గం కూడా అక్కడ అధికంగా ఉన్నట్టు గణాంకాలతో వివరించినట్టు తెలిసింది.
ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలనే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనను రాజా వ్యతిరేకించినట్టు సమాచారం. తాను గుంటూరు నుంచి పోటీచేయనని, తెనాలి నియోజకవర్గంలో ఐదేళ్ల నుంచి పార్టీని పటిష్టం చేస్తుంటే, అక్కడికి ఎలా వెళతానని ఆయన తన అభిమానుల వద్ద పేర్కొన్నట్టు తెలిసింది.
రాజా కూడా దీనిని వ్యతిరేకిస్తున్న సమాచారం బాబు వద్ద ఉండటంతో తర్వాత పరిశీలించే ధోరణిలో ఉన్నట్టు తెలిసింది. ఇక నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరుమల డెయిరీ మేనేజింగ్ డెరైక్టర్ దండా బ్రహ్మానందం పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ వ్యతిరేక వర్గం ఇటీవల చంద్రబాబును కలిసి బ్రహ్మానందంకు సీటు ఇవ్వాలని కోరినట్టు పార్టీ వర్గాల కథనం.
తిరుమల డెయిరీలో ముఖ్య భాగస్వాములంతా బ్రహ్మానందంకు మద్దతు పలకడంతో కోడెల వ్యతిరేక వర్గం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు పార్టీ వర్గాల కథనం. నియోజకవర్గాల పునర్విభజనలో కోడెల స్వగ్రామం కండ్లకుంట (నకరికల్లు మండలం) సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఆయన్ను అక్కడికి పంపితే పరిస్థితులు సానుకూలంగా ఉంటాయనే అభిప్రాయం వినపడుతోంది. అయితే ఈ ప్రస్తావన అధినేత వద్ద రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై రాజధానిలో తరచూ కసరత్తులు జరుగుతుండటంతో పార్టీ నేతలు అక్కడే మకాం వేస్తున్నారని కార్యకర్తలు చెబుతున్నారు.