ఎట్టకేలకు ‘కల్వకుర్తి’పై కన్నెర్ర!
ఏడాదిగా పనులు నిలిపివేసిన గామన్‌ఇండియాపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
60సీ కింద వేరే సంస్థకు పనులిచ్చే యోచన
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని మహత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథ కం పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై ఎట్టకేలకు కన్నెర్ర జేసింది. ఎన్నిమార్లు హెచ్చరిం చినా పనులు పూర్తి చేయని కాంట్రాక్టు సంస్థపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. పనుల నుంచి ప్రస్తుత కాంట్రాక్టు సంస్థ గామన్ ఇండియాను తప్పించి, మిగిలిన పనులను వేరే కాంట్రాక్టు సంస్థకు అప్పగించాలని భావిస్తోంది. ప్రాజెక్టు అధికారులతో సమీక్షించిన నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఈ మేరకు గామన్ ఇండియాపై చర్యలకు గట్టి ఆదేశాలిచ్చారు. దీంతో కాంట్రాక్టు సంస్థపై చర్యలకు సమాయత్తమవుతున్నారు.
మారని సంస్థ తీరు :
కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సుమారు 3.40 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయిం చగా, ప్రాజెక్టు మొత్తాన్ని మూడు దశలుగా విడగొట్టారు. ఇందులో కొల్లాపూర్ ఒకటో దశ కింద 13వేల ఎకరాలు, జొన్నల బొగడ రెండో దశ కింద 47 వేల ఎకరాలు, మూడో దశ గుడిపల్లెగట్టు కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయాలని సంకల్పించారు. మూడో దశ కింద 42.80 కిలోమీటర్ల మేర నీటిని తరలించేందుకు పంప్‌హౌస్, రిజర్వాయర్లను కట్టేందుకు 2005-06లో గామన్ ఇండియా సంస్థకు పనులు అప్పగించారు. 13 మెగావాట్ల కెపాసిటీ గల 5 పంపులు, 800 క్యూసెక్కుల నీటిని 117 మీటర్ల ఎత్తుకి పంప్ చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. 2010 లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో గామన్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పనుల్లో జాప్యం దృష్ట్యా నాలుగేళ్ల కాలంలో రెండుమార్లు గడువు పెంపు అనుమతిని పొందింది. గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం మరోమారు ఏడాది గడువు పొడిగించినా సంస్థ తీరు మారలేదు. రూ.630 కోట్లలో 85శాతం పనులను పూర్తి చేయగా, మరో రూ.100 కోట్ల పనులను పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ నాటికి లక్ష్యంగా పె ట్టుకున్న 1.60 లక్షల ఆయకట్టు సాధ్యమయ్యేట్టు లేదు.
చర్యలకు నిర్ణయం:
పనుల్లో తీవ్ర జాప్యంపై ఇటీవల మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. గత ఏడాది పూర్తిగా పను లు నిలిపివేసిన గామన్ ఇండియా, ఈ ఏడాది జనవరి నుంచి పనులను ఆరంభించిందని, అయితే ఆశించిన రీతిలో పనులు జరగడం లేదని అధికారులు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టయిన జగన్నాధ్‌పూర్‌లోనూ గేటు అమర్చే పనులను గామన్ ఇండియా అల క్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రికి వివరించా రు. దీంతో కాంట్రాక్టు సంస్థను తప్పించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. చట్టంలోని 61 అధికరణ కింద పూర్తిగా పనుల నుం చి తప్పించడమా? లేక 60(సీ) కింద ఇతర సంస్థకు నామినేషన్‌పై పనులు అప్పగించడమా? అన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. గురువారం మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.