games competitions
-
ఆనందం.. ఆకాశాన్నంటింది
సాక్షి నెట్వర్క్/అమరావతి: గ్రామాల్లో ‘ఆడుదాంఆంధ్రా’ క్రీడా సంబరం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. క్రీడా మైదానాల్లోకి యువత భారీ సంఖ్యలో దూసుకొస్తున్నారు. నాల్గవ రోజు శుక్రవారానికి 14,396 గ్రామ/వార్డు సచివాలయాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. దాదాపు 96.61 శాతం సచివాలయాల్లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో 100 శాతం సచివాలయాల్లో పోటీలు మొదలయ్యాయి. ఒక్క రోజే 21,488 మ్యాచ్‌లకు షెడ్యూల్ చేస్తే 18,871 మ్యాచ్‌లను పూర్తి చేశారు. ఏలూరు, బాపట్ల, అనంతపురం, కృష్ణా, వైఎస్సార్, తూర్పుగోదావరి, అనకాపల్లి, చిత్తూరు, విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 92 శాతానికిపైగా మ్యాచ్ షెడ్యూల్ పూర్తయింది. మొత్తం .16లక్షల మంది వీక్షకులు హాజరవగా.. మొత్తంగా నాలుగు రోజుల్లో 28.60 లక్షల మంది ఆడుదాం ఆంధ్ర క్రీడలను వీక్షించారు. పల్నాడుకే వన్నె తెచ్చిన క్రీడలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా యువత ఆటల పోటీలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పర్యవేక్షించారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్ పోటీలను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 257 సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో పోటీలు జరిగాయి. ఇక్కడ 666 మ్యాచ్‌లకు గాను 664 మ్యాచ్‌లు నిర్వహించారు. 8,816 మంది క్రీడాకారులు పాల్గొనగా, 32,850 మంది ప్రేక్షకులు వీక్షించారు. క్రీడల నిర్వహణ పై కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. తిరుపతి జిల్లాలో 392 సచివాలయాల పరిధిలోని మైదానాల్లో క్రీడలు నిర్వహించారు. 1261 మ్యాచ్‌లకు గాను 1260 మ్యాచ్‌లను నిర్వహించారు. కడపలో కదం తొక్కారు కడప జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలు సంబరాన్ని తలపిస్తున్నాయి. పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కడపలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీడీఓలు, ఫిజికల్ డైరెక్టర్లు టోర్నమెంట్‌ను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లాలో 500 సచివాలయాల పరిధిలో 690 మ్యాచ్‌లు నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియంతో పాటు పాఠశాల్లో 70 మ్యాచ్‌లు జరిగాయి. విజయవాడలోని కానూరి వీఆర్ సిద్ధార్థ కళాశాలలో జరుగుతున్న పోటీల్లో క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. విజయవంతంగా ఆడుదాం ఆంధ్రా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం.. ఆంధ్రా’ ఆటల పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావటానికి ఈ ఆటల పోటీలు దోహదపడుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది క్రీడాకారులు వారి పేర్లు నమోదు చేసుకొని క్రీడల్లో పాల్గొంటున్నారు. సచివాలయం స్థాయి నుంచి ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా చక్కని అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రద్యుమ్న, రాష్ట్ర క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ -
ఆన్ లైన్ గేమ్స్: ఇక వారంలో మూడు గంటలే ఆడాలి!
ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన పిల్లలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఆటల మోజులో పడి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకే చైనా ఆన్ లైన్ వీడియో గేమ్స్‌పై ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 1 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు వారంలో కేవలం 3 గంటలు మాత్రమే ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడుకునేలా చైనా ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ (NPPA) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి శుక్రవారాలు, వీకెండ్స్, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది ఇదిలా ఉంటే చైనా ఇలా వీడియో గేమ్స్‌పై నిబంధనలు విధించడం ఇదే తొలిసారి కాదు 2019లో రోజుకు గంటన్నర, ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు గంటల చొప్పున ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే అవకాశాన్ని కలిపించింది. చైనా ప్రభుత్వంపై అసంతృప్తి చైనా ప్రభుత్వం వీడియో గేమ్స్‌పై విధించిన ఆంక్షలపై స్థానిక గేమింగ్ కంపెనీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. గేమింగ్ రీసెర్చ్ సంస్థ 'వెంచర్ బీట్' రిపోర్ట్-2020 ప్రకారం..2020 సంవత్సరం నాటికి చైనాలో 727 మిలియన్ల మంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా.. వారిలో 97శాతం మంది 18 నుంచి 24ఏళ్లలోపు వాళ్లే అధికంగా ఉన్నారు. అయితే తాజాగా ప్రభుత్వ నిర్ణయం అక్కడి గేమింగ్ కంపెనీ యాజమాన్యాల గొంతులో చిక్కిన పచ్చి వెలక్కాయ సమస్యలా మారింది. కాగా, 727 మిలియన్ల మంది వీడియో గేమ్ ఆడగా గేమింగ్ కంపెనీలకు వచ్చే ఆదాయం 41బిలియన్ డాలర్లుగా ఉంది. 2020లో 727 మిలియన్ల మంది గేమ్ ఆడుతుండగా 2021 ఆ సంఖ్య 743.5మిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. 2025నాటికి చైనాలో గేమ్ ఆడేవారి సంఖ్య 781.7 మిలియన్లకు చేరుతుందని వెంచర్ బీట్ అంచనా వేసింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు డ్రాగన్ కంట్రీకి చెందిన వీడియో గేమింగ్ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఈ తరుణంలో చైనా ప్రభుత్వ నిర్ణయం గేమింగ్ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారినట్లైంది. చదవండి : ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు -
పరుగెత్తడమూ విద్యే..
వరంగల్ స్పోర్ట్స్ : ‘విద్య అంటే చదవడం, రాయడం.. ర్యాంకుల కోసం వెంపర్లాడడం కాదు.. ఉదయం, సాయంత్రం మైదానాల్లో పరుగెత్తడం.. ఇష్టమైన ఆటల్లో శిక్షణ పొందడమూ విద్యే’ అని బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, భారత జట్టు కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. ఆదివారం హన్మకొండ అశోకా కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి తల్లిదండ్రులు వారి ఆలోచనలను పిల్లలపై బలవంతంగా రుద్దుతూ తరగతి గదులకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు మైదానాలను పరిచ యం చేసి వారికి ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి. అలా చేయడం వల్ల క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుంది. విద్యార్థులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. ప్రతిభకు కొదువలేదు.. తెలంగాణలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదువలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోసియేషన్ పాటుపడుతోంది. క్రీడలు, క్రీడాకారుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. ప్రతిభ ఉండి ఆర్థికంగా, ఇతర కారణాలతో వెనుకబడిన క్రీడాకారుల వివరాలను మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వారికి మెరుగైన శిక్షణ అందజేస్తాం. ఫిట్నెస్ పెంపునకు ఒప్పందం టోర్నమెంట్ల సమయంలో క్రీడాకారులకు తెలియకుండా చిన్న చిన్న ఒత్తిళ్లు వారి మెదడులోకి చొచ్చుకుపోతుం టాయి. తద్వారా క్రీడలపై దృష్టి పెట్టలేక చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరచలేని పరిస్థితులు ఉన్నాయి. క్రీడాకారుల్లో సైకాలజికల్‌గా ఫిట్నెస్ పెంపొందించేందుకు ఖరగ్‌పూర్ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మెరికల్లాంటి కోచ్‌లను తయారు చేస్తాం.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కోచ్‌ల కొరత ఉంది. కోచ్‌లు ఉన్న కొన్ని చోట్ల నైపుణ్యం కలిగిన వారు తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. అందుకే రానున్న రోజుల్లో క్రీడాకారులనే కాదు మెరికల్లాంటి కోచ్‌లను తయారు చేయాలని సిద్ధమవుతున్నాం. అందుకోసం జూలై 1 నుంచి ప్రత్యేక శిక్షణ తరగుతులు నిర్వహించనున్నాం. ఇప్పడికే కోచ్‌లుగా కొనసాగుతున్న వారితోపాటు కొత్త వారికి ప్రత్యేక శిక్షణ అందించడమే తమ లక్ష్యం. వరంగల్‌లో త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీ.. హైదరాబాద్‌లో మాదిరిగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను క్రీడాకారులు మా ముందుకు తీసుకొస్తున్నారు. అయితే అకాడమీ ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. సాంకేతిక ఇతర కారణాలు అనేకం అడ్డొస్తుంటాయి. వరంగల్ కేంద్రంగా త్వరలోనే అకాడమీ ఏర్పాటు చేసేందుకు పలువురి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరలోనే ఏర్పాటుకు కృషి చేస్తున్నాను. -
ఉత్సాహంగా ఎక్సైజ్ ఆటల పోటీలు
విజయవాడ స్పోర్ట్స్ : జిల్లా ఎక్సైజ్ శాఖ ఆటల పోటీలు గురువారం స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఉత్సాహంగా జరిగాయి. పోటీలను ఆ శాఖ డెప్యూటీ కమిషనర్ డీవీ సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కబడ్డీ, షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్, క్యారమ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల నుంచి జనవరి 6వ తేదీన ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి ఎక్సైజ్ శాఖ ఆటల పోటీల్లో పాల్గొనే జట్లను ఎంపిక చేయనున్నారు.