సాక్షి నెట్‌వర్క్/అమరావతి: గ్రామాల్లో ‘ఆడుదాంఆంధ్రా’ క్రీడా సంబరం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. క్రీడా మైదానాల్లోకి యువత భారీ సంఖ్యలో దూసుకొస్తున్నారు. నాల్గవ రోజు శుక్రవారానికి 14,396 గ్రామ/వార్డు సచివాలయాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. దాదాపు 96.61 శాతం సచివాలయాల్లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి.
అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో 100 శాతం సచివాలయాల్లో పోటీలు మొదలయ్యాయి. ఒక్క రోజే 21,488 మ్యాచ్‌లకు షెడ్యూల్ చేస్తే 18,871 మ్యాచ్‌లను పూర్తి చేశారు. ఏలూరు, బాపట్ల, అనంతపురం, కృష్ణా, వైఎస్సార్, తూర్పుగోదావరి, అనకాపల్లి, చిత్తూరు, విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 92 శాతానికిపైగా మ్యాచ్ షెడ్యూల్ పూర్తయింది. మొత్తం .16లక్షల మంది వీక్షకులు హాజరవగా.. మొత్తంగా నాలుగు రోజుల్లో 28.60 లక్షల మంది ఆడుదాం ఆంధ్ర క్రీడలను వీక్షించారు.
పల్నాడుకే వన్నె తెచ్చిన క్రీడలు
పల్నాడు జిల్లా వ్యాప్తంగా యువత ఆటల పోటీలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పర్యవేక్షించారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్ పోటీలను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 257 సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో పోటీలు జరిగాయి. ఇక్కడ 666 మ్యాచ్‌లకు గాను 664 మ్యాచ్‌లు నిర్వహించారు. 8,816 మంది క్రీడాకారులు పాల్గొనగా, 32,850 మంది ప్రేక్షకులు వీక్షించారు. క్రీడల నిర్వహణ పై కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. తిరుపతి జిల్లాలో 392 సచివాలయాల పరిధిలోని మైదానాల్లో క్రీడలు నిర్వహించారు. 1261 మ్యాచ్‌లకు గాను 1260 మ్యాచ్‌లను నిర్వహించారు.
కడపలో కదం తొక్కారు
కడప జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలు సంబరాన్ని తలపిస్తున్నాయి. పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కడపలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీడీఓలు, ఫిజికల్ డైరెక్టర్లు టోర్నమెంట్‌ను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లాలో 500 సచివాలయాల పరిధిలో 690 మ్యాచ్‌లు నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియంతో పాటు పాఠశాల్లో 70 మ్యాచ్‌లు జరిగాయి. విజయవాడలోని కానూరి వీఆర్ సిద్ధార్థ కళాశాలలో జరుగుతున్న పోటీల్లో క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
విజయవంతంగా ఆడుదాం ఆంధ్రా
ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం.. ఆంధ్రా’ ఆటల పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావటానికి ఈ ఆటల పోటీలు దోహదపడుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది క్రీడాకారులు వారి పేర్లు నమోదు చేసుకొని క్రీడల్లో పాల్గొంటున్నారు. సచివాలయం స్థాయి నుంచి ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా చక్కని అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రద్యుమ్న, రాష్ట్ర క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ
Comments
Please login to add a commentAdd a comment