Gampa goverdhan
-
కామారెడ్డిలో .. ఉద్దండుల సమరానికి 24 ఏళ్లు
సాక్షి, కామారెడ్డి క్రైం: పార్టీలు మారాయి.. కానీ ప్రత్యర్థులు మారలేదు.. రెండున్నర దశాబ్దాల పోటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 24 ఏళ్లుగా ప్రతిసారి నువ్వా, నేనా అన్నట్లుగానే కామారెడ్డి రాజకీయ రణక్షేత్రంలో తలపడుతున్నారు ప్రధాన పార్టీల ప్రత్యర్థులు షబ్బీర్‌అలీ, గంపగోవర్ధన్లు. సూటి ప్రశ్నలు, ఘాటైన విమర్శలు, దేనికైనా సిద్ధమే అనే పోటీతత్వం వారిద్దరిది. అందుకే కామారెడ్డి రాజకీయ ముఖచిత్రం ప్రతిసారి ఓ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. విజయం ఒక్కరినే వరిస్తుంది, కానీ ఈ ఇద్దరు ఉద్దండుల మధ్య జరుగనునన్న ఎన్నికల సమరం రసవత్తరంగా సాగనుందని రాజకీయవర్గాలు విశ్లేశిస్తున్నాయి. 1994 నుంచి .. కామారెడ్డి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్. మాచారెడ్డి మండలానికి చెందిన షబ్బీర్‌అలీ యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. 1989, 2004 ఎన్నికల్లో గెలిచిన షబ్బీర్‌అలీ రెడు సార్లు మంత్రిగా పనిచేశారు. భిక్కనూరు మండలం బస్వాపూర్‌కు చెందిన గంప గోవర్ధన్ సింగిల్‌విండో చైర్మన్‌గా టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీపై గెలిచారు. 1994లో టీడీపీ నుంచి యూసుఫ్‌అలీకి టికెట్ ఇవ్వడం, 2004లో టీడీపీ, బీజేపీ పొత్తు కారణంగా గంపకు టికెట్ దక్కలేదు. 2009లో రెండోసారి, 2014లో మూడోసారి గంప, షబ్బీర్ల మధ్యనే పోటీ కొనసాగింది. మూడుసార్లు విజయం గంపగోవర్ధన్నే వరించినప్పటికీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు మాత్రం రసవత్తరంగా సాగాయి. 2014లో టీఆర్ఎస్ నుంచి గంప, కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీలో నిలిచారు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో గంపగోవర్ధన్ స్వల్ప మెజారిటీతో గెలవడం చూస్తే వారిద్దరి మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో తెలుస్తుంది. బలమైన కేడర్ వారి సొంతం కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రత్యర్థులైన గంప, షబ్బీర్‌అలీలు ఇద్దరికీ బలమైన కేడర్ ఉంది. ఇద్దరికీ గ్రామ, మండల స్థాయిలో వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తే భారీ సంఖ్యలో జనాన్ని తరలించగల సమర్థులు. రెండుసార్లు మంత్రిగా పని చేసిన షబ్బీర్‌అలీ తాను అధికారంలో ఉండగా ఎంతో మంది నాయకులు, కార్యకర్తలను అక్కున చేర్చుకుని అండగా నిలిచారు. అలాగే గంపగోవర్ధన్ అధికారంలో ఉండగా ఎంతో మంది నాయకుల, కార్యకర్తల అభ్యున్నతికి చేయందించారు. అందుకే ఇప్పటికీ వారితో కలిసి పనిచేయడానికి ఆయా పార్టీల్లోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. పోటాపోటీ పార్టీలకు కార్యకర్తలే బలం. బలమైన క్యాడర్‌ను సంపాదించుకున్న చిరకాల ప్రత్యర్థులైన గంప, షబ్బీర్ల మధ్య పోటీత్వమూ ఎక్కువే. ఎన్నికల్లో తలపడిన ప్రతిసారీ పోటీ హోరాహోరీగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, కామారెడ్డి అభివృద్ధి విషయంలో, రాజకీయాల విషయంలోనూ ఒకరిపై ఒకరు తరచుగా ఘాటు విమర్శలకు దిగుతుంటారు. ఏకంగా వారు ఇద్దరూ తమ ఆస్తులు వెల్లడించేందుకు కామారెడ్డి గంజ్‌లోని గాంధీ విగ్రహం వద్ద రెండు నెలల క్రితం పంచాయతీ పెట్టుకున్న సందర్భం పోలీస్‌శాఖను సైతం అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య జరుగనున్న ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. రసవత్తరంగా పోరు ప్రతిసారి ఎన్నికల్లో ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగే పోరులో తానే తక్కువ కాదంటూ ఈసారి బీజేపీ వచ్చి చేరింది. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు అనగానే అందరి దృష్టి గంప, షబ్బీర్లపైనే ఉండేది. ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి ఎన్నికల బరిలో నిలిచిన మాజీ జెడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టేశారు. ఇప్పటివరకు పాలించిన గంప, షబ్బీర్లనే టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గంప గోవర్ధన్ ముందుకు వెళ్తుండగా, తన హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ మేనిఫెస్టోతో షబ్బీర్‌అలీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో కామారెడ్డి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఉద్దండుల మధ్య జరుగుతున్న ఈ సమరంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. -
టీఆర్ఎస్తోనే అభివృద్ధి.. గంప గోవర్ధన్
సాక్షి, కామారెడ్డి రూరల్: టీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ అన్నారు. బుధవారం మండలంలోని ఇస్రోజివాడి, గర్గుల్, తిమ్మక్‌పల్లి(జి), గూడెం, శాబ్దిపూర్‌ల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు గ్రామాల్లో బ్యాండ్‌మేళాలు, బోనాలు, డప్పువాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధి పనులను, ఎన్నికల మేనిఫెస్టోలో కొత్తగా అమలు చేయనున్న పథకాలను ప్రజలకు వివరించారు. రూ.200 ఉన్న పింఛన్లను వెయ్యికి పెంచామన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వచ్చే సంక్రాంతి నుంచి డబుల్ చేసి రూ.2016 అందజేస్తామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా పెంచాయన్నారు. రైతు బీమా కింద రూ.5 లక్షలు అందజేస్తున్నామన్నారు. లక్ష రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు. డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్ల స్థలాలు ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. అందరి ఆశీర్వాదంతో మళ్లీ గాఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ పెద్దన్న తిరిగి సీఎం కావడం ఖాయమన్నారు. ఎంపీపీ లద్దూరి మంగమ్మ, వైస్ ఎంపీపీ పోలీసు క్రిష్ణాజీరావు, ఏఎంసీ చైర్మన్ గోపిగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, ఆత్మకమిటీ చైర్మన్ బల్వంత్‌రావు, నిట్టు వేణుగోపాల్‌రావు, మాజీ సర్పంచ్‌లు భాగ్యవతి, మొగుళ్ల శ్యామల, సాయాగౌడ్, గుడుగుల బాల్‌రాజు, తెడ్డు రమేష్, చింతల రవితేజగౌడ్, కడారి మల్లేష్, మోహన్‌రావు, రవీందర్‌రెడ్డి, పద్మారెడ్డి, బంటు రాజు, గరిగె కిష్టాగౌడ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్లో యాదవ సంఘం ప్రతినిధుల చేరిక మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం ప్రతినిధులు బుధవారం గంప గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, ఎంపీపీ లద్దూరి మంగమ్మ, బండారి నర్సారెడ్డి, బండారి రాంరెడ్డి, గంగుల నర్సారెడ్డి, తోట సంగమేశ్వర్, పందిరి శ్రీనివాస్‌రెడ్డి, షానూర్ పాల్గొన్నారు. అంకుల్ ఆల్ ద బెస్ట్ అంకుల్ ఆల్ ద బెస్ట్ అంటూ చిన్నారులు దీవించారు. మండలంలోని బుధవారం ఇస్రోజివాడి, గర్గుల్ గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నారులను ఎత్తుకుని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. -
మరోసారి ఆశీర్వదించండి
సాక్షి,కామారెడ్డి: ప్రజల చిరకాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కామారెడ్డి నియోజకవర్గంలో నాలుగేళ్లలో దాదాపు వెయ్యి కోట్లతో అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ కోరారు. జిల్లా కేంద్రం లోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేంద్రకుమార్‌కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గంప గోవర్ధన్ సమర్పించారు. నామినేషన్ అనంత రం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలన దేశంలోనే అగ్రగామిగా నిలిచి పోతుం దని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలోనూ దాదాపు రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, జిల్లా గా ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. కామారెడ్డికి రానున్న రెండేళ్ల లో కాళేశ్వరం నీళ్లు తెచ్చి ప్రతి ఎకరానికి రెండు పంటలకు సరిపడా నీరందిస్తామన్నారు. రెండు సెట్ల నామినేషన్ దాఖలు.. డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నామినేషన్ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆర్డీవో కా>ర్యాలయం వద్దకు చేరుకున్నాయి. నామినేషన్ అనంతరం గంపగోవర్ధన్‌ను పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ నేతలు నిట్టు వేణుగోపాల్‌రావు, ఆత్మ కమిటీ చైర్మన్ బల్వంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పథకాల అమలులో అగ్రగామిగా తెలంగాణ
దోమకొండ(నిజామాబాద్): సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కామారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని చింతమాన్‌పల్లి, ముత్యంపేట, అంచనూరు, సీతారాంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని చెప్పారు. మిషన్ కాకతీయ వల్ల ప్రతి గ్రామంలో చెరువులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. బీడీ కార్మికులు, చేనేత, గౌడ, వృద్ధాప్య, వితంతు పింఛన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచుతామని, రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. మహా కూటమి మాయ మాటలకు మోసపోవద్దని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల బాగు కోసం కృషి చేస్తున్నారని, టీఆర్ఎస్ను మరోమారు గెలిపించి మరింత అభివృద్ధి సాధించుకుందామన్నారు. ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు మధుసూదన్‌రావ్, పార్టీ మండల అధ్యక్షుడు కుంచాల శేఖర్, నాయకులు ఐరేని నర్సయ్య, నర్సారెడ్డి, తిరుపతిరెడ్డి, మనోహర్‌రెడ్డి, బాల్నర్సు, వంగ లలిత, నారాగౌడ్, సాయిరెడ్డి పాల్గొన్నారు. -
కామారెడ్డిలో పొలిటికల్ టెన్షన్
కామారెడ్డి: జిల్లాలో రాజకీయంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌లు ఆస్తులపై బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నారు. గంప గోవర్థన్ తన ఆస్తులు ఇవిగో అంటూ కామారెడ్డి మార్కెట్ యార్డులోని గాంధీ విగ్రహం వద్దకు వచ్చి హడావిడి చేశారు. తన ఆస్తుల చిట్టా, షబ్బీర్ ఆస్తుల చిట్టా చదివి వినిపించారు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ ఉందని చెప్పి తప్పించుకోవడం సరికాదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన కాసేపటికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కూడా తన అనుచరులతో గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..తనది తెరిచిన పుస్తకమన్నారు. ప్రతీ పైసాకు లెక్క ఉందని, ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నానని తెలిపారు. చర్చలకు అనుమతి లేదని కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి నేతలకు సూచించారు. ఇటీవల రోడ్‌షోలో గంప గోవర్థన్ ఆస్తులపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. -
ముందస్తు అభ్యర్థులు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నట్లుగానే అధికార టీఆర్ఎస్ పార్టీలోనూ అభ్యర్థిత్వాలపై ముందస్తుగా స్పష్టత వస్తోంది. ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ మరో సారి బరిలో ఉంటారని మంత్రి కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు. దీంతో గంప అనుచరవర్గంలో ఉత్సాహం నింపినట్లయ్యింది. మరోవైపు బాన్సువాడ నియోజకవర్గం నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించుకున్నా రు. ఈ ఎన్నికల్లో తన ముగ్గురు కుమారుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారనే ప్రచా రానికి తెరదించుతూ తానే బరిలో ఉంటా నని స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్ల మెంట్ స్థానం పరి«ధిలోకి వచ్చే జగిత్యాల నియోజకవర్గం టిక్కెట్టును కూడా ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సంజయ్‌కుమార్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో టిక్కెట్ల ప్రకటనలు ఆ పార్టీ వర్గాల్లో జోష్‌ను నింపుతున్నాయి. మరోవైపు ఆయా స్థానాల నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న ఆశావహులకు నిరాశే ఎదురవుతోంది. సెప్టెంబర్‌లోనే మొదటి లిస్టు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని అధినేత కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుపై నెలవారీగా సర్వేలు చేయించిన కేసీఆర్ ఆయా ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. కాగా మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో నాలుగు లేదా ఐదు నియో జకవర్గాలకు మొదటి జాబితాలో చోటు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. అధినేత ప్రకటించినట్లుగానే ఈ నెలలోనే జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే ముం దస్తుగానే అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుండటం గమనార్హం. అధినేత కేసీఆర్ ప్రకటించే జాబితాలో పేర్లు ఉంటేనే ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్ ప్రకటించి ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో తొలి అభ్యర్థిత్వం జిల్లా నుంచే.. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పో టీ చేసే అభ్యర్థుల ప్రకటనను సీఎం కేసీఆర్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలి అభ్యర్థిత్వాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఆదిలాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన కేసీఆర్ ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి నివాసంలో ఆగి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈసారి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలు ఖరారు కావడం గమనార్హం. -
టీఆర్ఎస్ నాయకులపై తేనెటీగల దాడి
నిజామాబాద్: మిషన్ కాకతీయ పనులు ప్రారంభించడానికి వచ్చిన ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం చీకోటివానికుంటలో బుధవారం జరిగింది. వివరాలు.. ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ మిషన్ కాకతీయ పనులు ప్రారంభిస్తున్న సమయంలో కుంట సమీపంలోని చింత చెట్టుమీద ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా విజృంభించాయి. ఈ దాడిలో టీఆర్ఎస్ కార్యకర్తకు ఒక హోంగార్డులపై తేనెటీగలు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి.