సాక్షి, కామారెడ్డి క్రైం: పార్టీలు మారాయి.. కానీ ప్రత్యర్థులు మారలేదు.. రెండున్నర దశాబ్దాల పోటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 24 ఏళ్లుగా ప్రతిసారి నువ్వా, నేనా అన్నట్లుగానే కామారెడ్డి రాజకీయ రణక్షేత్రంలో తలపడుతున్నారు ప్రధాన పార్టీల ప్రత్యర్థులు షబ్బీర్‌అలీ, గంపగోవర్ధన్‌లు. సూటి ప్రశ్నలు, ఘాటైన విమర్శలు, దేనికైనా సిద్ధమే అనే పోటీతత్వం వారిద్దరిది. అందుకే కామారెడ్డి రాజకీయ ముఖచిత్రం ప్రతిసారి ఓ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. విజయం ఒక్కరినే వరిస్తుంది, కానీ ఈ ఇద్దరు ఉద్దండుల మధ్య జరుగనునన్న ఎన్నికల సమరం రసవత్తరంగా సాగనుందని రాజకీయవర్గాలు విశ్లేశిస్తున్నాయి.
1994 నుంచి ..
కామారెడ్డి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు టీఆర్‌ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్. మాచారెడ్డి మండలానికి చెందిన షబ్బీర్‌అలీ యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. 1989, 2004 ఎన్నికల్లో గెలిచిన షబ్బీర్‌అలీ రెడు సార్లు మంత్రిగా పనిచేశారు. భిక్కనూరు మండలం బస్వాపూర్‌కు చెందిన గంప గోవర్ధన్ సింగిల్‌విండో చైర్మన్‌గా టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీపై గెలిచారు.
1994లో టీడీపీ నుంచి యూసుఫ్‌అలీకి టికెట్ ఇవ్వడం, 2004లో టీడీపీ, బీజేపీ పొత్తు కారణంగా గంపకు టికెట్ దక్కలేదు. 2009లో రెండోసారి, 2014లో మూడోసారి గంప, షబ్బీర్‌ల మధ్యనే పోటీ కొనసాగింది. మూడుసార్లు విజయం గంపగోవర్ధన్‌నే వరించినప్పటికీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు మాత్రం రసవత్తరంగా సాగాయి. 2014లో టీఆర్‌ఎస్ నుంచి గంప, కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీలో నిలిచారు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో గంపగోవర్ధన్ స్వల్ప మెజారిటీతో గెలవడం చూస్తే వారిద్దరి మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో తెలుస్తుంది.
బలమైన కేడర్ వారి సొంతం
కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రత్యర్థులైన గంప, షబ్బీర్‌అలీలు ఇద్దరికీ బలమైన కేడర్ ఉంది. ఇద్దరికీ గ్రామ, మండల స్థాయిలో వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తే భారీ సంఖ్యలో జనాన్ని తరలించగల సమర్థులు. రెండుసార్లు మంత్రిగా పని చేసిన షబ్బీర్‌అలీ తాను అధికారంలో ఉండగా ఎంతో మంది నాయకులు, కార్యకర్తలను అక్కున చేర్చుకుని అండగా నిలిచారు. అలాగే గంపగోవర్ధన్ అధికారంలో ఉండగా ఎంతో మంది నాయకుల, కార్యకర్తల అభ్యున్నతికి చేయందించారు. అందుకే ఇప్పటికీ వారితో కలిసి పనిచేయడానికి ఆయా పార్టీల్లోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి.
పోటాపోటీ
పార్టీలకు కార్యకర్తలే బలం. బలమైన క్యాడర్‌ను సంపాదించుకున్న చిరకాల ప్రత్యర్థులైన గంప, షబ్బీర్‌ల మధ్య పోటీత్వమూ ఎక్కువే. ఎన్నికల్లో తలపడిన ప్రతిసారీ పోటీ హోరాహోరీగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, కామారెడ్డి అభివృద్ధి విషయంలో, రాజకీయాల విషయంలోనూ ఒకరిపై ఒకరు తరచుగా ఘాటు విమర్శలకు దిగుతుంటారు. ఏకంగా వారు ఇద్దరూ తమ ఆస్తులు వెల్లడించేందుకు కామారెడ్డి గంజ్‌లోని గాంధీ విగ్రహం వద్ద రెండు నెలల క్రితం పంచాయతీ పెట్టుకున్న సందర్భం పోలీస్‌శాఖను సైతం అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య జరుగనున్న ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది.
రసవత్తరంగా పోరు
ప్రతిసారి ఎన్నికల్లో ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగే పోరులో తానే తక్కువ కాదంటూ ఈసారి బీజేపీ వచ్చి చేరింది. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు అనగానే అందరి దృష్టి గంప, షబ్బీర్‌లపైనే ఉండేది. ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి ఎన్నికల బరిలో నిలిచిన మాజీ జెడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టేశారు. ఇప్పటివరకు పాలించిన గంప, షబ్బీర్‌లనే టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గంప గోవర్ధన్ ముందుకు వెళ్తుండగా, తన హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ మేనిఫెస్టోతో షబ్బీర్‌అలీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో కామారెడ్డి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఉద్దండుల మధ్య జరుగుతున్న ఈ సమరంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment