హైదరాబాద్లో మరో వైద్య కళాశాల!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మరో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కానుంది. దీని ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఈ కళాశాల నిర్మాణానికి రూ. 363 కోట్లు అవసరమవుతాయని వైద్యవిద్యా శాఖ అధికారులు అంచనా వేశారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ఆవరణలో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య విద్యా శాఖ అధికారులు రెండ్రోజుల క్రితమే ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుతం నగరంలో 250 ఎంబీబీఎస్ సీట్లతో ఉస్మానియా , 200 సీట్లతో గాంధీ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో కోటి జనాభా ఉన్నారని, మరో వైద్య కళాశాల ఉంటే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
కొత్తగా ఏర్పడే కళాశాలలో 150 సీట్లు ఉండాలని, 750 పడకలతో ఆస్పత్రిని అనుబంధంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆస్పత్రి నిర్మాణానికి నిధులను 14వ ఆర్థిక సంఘం నుంచి తేవాలని అధికారులు నిర్ణయించారు. ఎంసీఐ అనుమతి లభిస్తే వచ్చే ఏడాది నాటికి కళాశాలను పూర్తి చేయాలని, లేదంటే 2015-16 నాటికైనా 150 సీట్లతో కళాశాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వైద్య విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా, ప్రభుత్వం ఇటీవలే 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ నిజామాబాద్లో వైద్య కళాశాలను నిర్మించిన సంగతి తెలిసిందే.