అధికారాంతమునందు చూడవలె...
అక్షర తూణీరం: అసలా పార్టీ పుట్టడమే కాడి, జోడెద్దులలో పుట్టింది. కాడిని ఏనాడో తీసి ప్రజల మెడ మీద వేశారు. ప్రధాని కుర్చీనీ, పార్టీ ప్రధాన కుర్చీనీ కలిపి కుట్టేసి భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. జోడెద్దులు ఒంటెద్దు అయింది.
‘అధికారాంతమునందు చూడ వలె ఆ అయ్య సౌభాగ్యముల్...’ ఇదొక నీతిపద్యం నాలుగోపాదం. మొన్నామధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాంధీబొమ్మ నీడలో కూర్చుని అంతర్మథనానికి పూనుకున్నారు. నాకు ముచ్చటేసింది. వరసగా పదేళ్లు అధికార పార్టీలో ఉన్న మనం విపక్షంగా విఫలమవుతున్నామా? ప్రతిపక్ష పాత్రని సమర్థ వంతంగా పోషించే విద్వత్తు కొరవడిందా? అల వాటుగా ఎర్రదీపం కారువైపు కాళ్లు లాగుతున్నాయా? మనం పవర్లో లేమన్న నిజం మరచి తాజా అవినీతి ఆరోపణలకు సంజాయిషీలివ్వడానికి సిద్ధపడుతున్నా మా? ఔననే జవాబువస్తోంది. ఇది సహజమే. పదేళ్ల అలవాట్లని పదినెలలైనా అవకుండా మార్చుకోవడం అంత తేలికకాదు. దీనికి ఆధారాలున్నాయి.
రఘువంశ పూర్వీకుడు హరిశ్చంద్రుడు నానా అగ చాట్లుపడి సత్యహరిశ్చంద్రుడై సకుటుంబంగా తిరిగి రాజ్యానికి వచ్చాడు. చంద్రమతి అలవాటుగా రాజప్రాసా దంలో కసువూడ్చడం, అంట్లు తోమడం మొదలుపెట్టి, ఆనక నాలిక్కరుచుకునేది. లోహితాశ్యుడు వంటశాల వెను క గుమ్మంలో నిలబడి, ‘మాతా, చంద్రమతీ! ఆకలిగొన్న ఈ పుత్రునకు శేష భోజనము దయసేతువా?’ అని దీనం గా అర్థించువాడట. తల్లి మిక్కిలిగా విలపించి, ‘నాయనా! అఖండ భూమండ లాధీశు కుమారునకెట్టి దుర్గతి పట్టి నది? నీ తండ్రి దమ్మిడీకి కొరగాని కీర్తి కొరకు నిన్ను నన్ను బలి చేసినాడు’ అని ఇంకను పరిపరి విధముల వాపోయె డిదట. రాముడు అరణ్యవాసం, యుద్ధకాండ ముగించు కుని అయోధ్యకి వచ్చాడు. లక్ష్మణుడు వేకువజామునే అంతఃపురం దగ్గర ఉన్న వేపచెట్టెక్కి మొహం పుల్లలు విరిచి, తానొకటి నోట కరుచుకుని రెండింటిని రొంటిని దోపుకుని దిగాడు. సాక్షాత్తు రాజు చెట్టెక్కగా చూసిన రాచ నెమళ్లు తత్తరపడి పింఛములు ముడిచి చెట్టు దిగినవి. కోకిలలు పాట మరచినవి. చిలకలు తొర్రలో ఒదిగిపోయి నవి. దాసదాసీజనం నివ్వెరపాటుకి గురైనారు. విషయం గ్రహించి, నోట పుల్ల తీసి లక్ష్మణస్వామి నవ్వుకున్నాడు.
రక్షయన్నట్టు రాముడు నవ్వినాడు. ఘటనకు సీత నవ్వి నది. ఇన్నేళ్లకు మనసారా తల్లులు నవ్విరి. పద్నాలుగేళ్ల నిద్రని పూర్తిగా వదుల్చుకుని ఊర్మిళ మగతగా నవ్వినది. రాజగురువు వశిష్టుల వారు నదీస్నానం చేసి ఆశ్రమానికి వెళుతూ నవ్వులను ఆలకించి, చిరునవ్వారు. ఏమా నవ్వు లని మూల పురుషుడు సూర్యదేవుడు తూరుపుకొండపై నుంచి తొంగిచూచాడు. అయోధ్యలో భళ్లున తెల్లవా రింది! ఇంతకు ఇది అలవాటులో పొరబాటు.
ఆ మథనంలో కాంగ్రెస్ వాళ్లు ఒంటెద్దు పోకడలు మానుకోవాలని కూడా అనుకున్నారు. కాని సాధ్యమే! అసలా పార్టీ పుట్టడమే కాడి, జోడెద్దులలో పుట్టింది. కాడిని ఏనాడో తీసి ప్రజల మెడ మీద వేశారు. ప్రధాని కుర్చీనీ, పార్టీ ప్రధాన కుర్చీనీ కలిపి కుట్టేసి భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. జోడెద్దులు ఒంటెద్దు అయింది. మళ్లీ ఒంటెద్దును జోడెద్దులు చేయడం అసాధ్యం. అలవాట్లు ఒకందాన పోవు.
అరణ్య, అజ్ఞాతవాసాల తర్వాత పాండవుల బతుకు ఇలాగే అయింది. ధర్మరాజు పొడుగాటి సిల్కు లాల్చీతో వీధుల వెంట తిరిగేవాడు. భీముడు వంటశాలకి అంకి తం. అర్జునుడు రకరకాల నాట్యముద్రలు పడుతూ విలు విద్యపై గురితగ్గించాడు. నకుల, సహదేవులకు గుగ్గిళ్ల మీద ధ్యాసపోలేదు.
ద్రౌపది జుట్టు విరబోసుకుని మూర లు మూరలు పూలు కడుతోంది. ఎక్కడో ఉన్న కృష్ణుడు ఈ పరిణామానికి బాగా వర్రీ అయ్యాడు. రానున్న మహా సంగ్రామానికి వీరిని సమాయత్తం చేయడం ఎలా? అనే పాయింట్ మీద వర్కవుట్ చేసుకుంటూ వచ్చాడు. చివర కు యుద్ధంలో విజయం సాధించి పెట్టాడు. అదొక చరిత్ర. ‘కాని పలు నీతులు, ధర్మాలు భారతం నిండా చెబు తూ వచ్చిన విదురుడు లాంటి వారు నూతన సామ్రాజ్యా నంతరం ఏమయ్యారు?’- ధర్మసందేహం గురువుగారిని అడిగాను. ‘ఆ, ఏముంది? ఎప్పటి వలెనే ధర్మసూక్ష్మాలు అవ శేష ప్రజకు బోధిస్తూ...’ ‘ఇంకా ఎందుకండీ ధర్మసూక్ష్మం? ధర్మ సంస్థాపన జరిగిపోయింది కదా!’ అన్నాను. ‘జరిగినా అవసరమే! మనకిక్కడ ఆచార్య కోదండ రాం లాగా!’ అన్నారు గురువుగారు. ఆచార్యునకు కడకు పూర్వానుసారము!
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత)