గువాహతి: అస్సాంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు. టిన్సుకియా జిల్లా దూమ్‌దూమా లోని గాంధీ చౌక్‌లో ఉంచిన 5.5 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తవ్వి అక్కడి నుంచి తొలగించడం వివాదానికి దారి తీసింది. మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించడంపై విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశాయి. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ (ఏఏఎస్‌యూ) నిరసనలు చేపట్టింది.
అయితే, విగ్రహం తొలగింపు నిర్ణయం గురించి తనకు తెలియదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. ‘జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం గురించి నాకు తెలియదు. వాస్తవం ఏంటో తెలుసుకుంటా. అస్సాం మహాత్మా గాంధీకి చాలా రుణపడి ఉంది. నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అస్సాంను పాకిస్తాన్‌లో చేర్చాలని కోరినప్పుడు ఆయన భారతరత్న గోపీనాథ్ బోర్డోలోయ్‌కు గాంధీ అండగా నిలిచారు’ అని పేర్కొన్నారు.
మరోవైపు గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా విగ్రహం తొలగింపుపై మండిపడ్డారు. ‘అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం దిబ్రూగఢ్‌లో బాపు విగ్రహం స్థానంలో క్లాక్ టవర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడంలో ఆశ్చర్యం లేదు’ అని విమర్శించారు. కాంగ్రెస్ కూడా ప్రభుత్వం చర్యను తప్పుబట్టింది.
తాము నగర సుందరీకరణ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించడం లేదని, కానీ అందుకు గాంధీ విగ్రహాన్ని తొలగించడం సరికాదని అన్నారు మాజీ ఎమ్మెల్యే దుర్గ భూమిజ్. విగ్రహాన్ని తొలగించడాన్ని అంగీకరించమని.. విగ్రహాన్ని అలాగే ఉంచి, క్లాక్ టవర్‌ను నిర్మించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment