‘లోకల్’ ఢీకొని గ్యాంగ్‌మేన్ మృతి
సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వే మార్గంలో సోమవారం మధ్యాహ్నం ఓ లోకల్ రైలు ఢీ కొని గ్యాంగ్‌మేన్ మరణించాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాలుగో శ్రేణి ఉద్యోగులందరూ రైలురోకో నిర్వహించారు. దీంతో అరగంట పాటు ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఠాణే-ములుండ్ స్టేషన్ల మధ్య గ్యాంగ్ మెన్ పట్టాలపై పనులు చేస్తున్నారు. ఠాణే నుంచి ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) దిశగా వెళుతున్న లోకల్ రైలు వేగంగా దూసుకొచ్చింది. రైలు దగ్గరకు వచ్చేవరకు వీరికి తెలియకపోవడంతో పట్టాల మధ్యలో పనిచేస్తున్న మాధవ్ స్వామి (54)ని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఆయన అక్కడే మరణించాడు. దీంతో నాలుగో శ్రేణి ఉద్యోగులందరూ ఆగ్రహానికి గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే అనేక సందర్భాలలో గ్యాంగ్మన్ పట్టాలపై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు రైళ్లు ఢీకొని మరణించిన ఘటనలున్నాయి. కాగా, వారికి భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చిన అధికారులు నిధులు మంజూరు చేశారు కాని ఇంతవవరకు హామీలు అమలుకు నోచుకోలేదు.
ఈ నేపథ్యంలో సోమవారం నాటి ఘటనతో తిరిగి గ్యాంగ్‌మెన్ రక్షణపై ఆందోళన వ్యక్తమైంది. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలు పట్టాలపై ఆందోళనకు దిగారు.దీంతో అరగంటపాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చివరకు ఉన్నతాధికారులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.