gangavva
-
బిగ్‌బాస్ అంటేనే ఇమేజ్ డ్యామేజ్.. ఎప్పుడు తెలుసుకుంటారో?
కళ అనేది ప్రేక్షకుడికి ఆనందం, కళాకారుడికి జీవితం ఇస్తుంది. ఏ కళాకారుడైనా తన కళను నమ్ముకునే జీవిస్తాడు. ముఖ్యంగా నేటి కళాకారులు తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ కష్టాన్ని, నష్టాన్ని బేరీజు వేసుకోకుండా ఆఖరికి తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టి కళకు అంకితమవుతున్నారు. కానీ దురదృష్ణమేమిటంటే ఎంతటి కళాకారులనైనా కనుమరుగు చేస్తూ క్యాష్ చేసుకుంటుంది బిగ్ బాస్ లాంటి కార్యక్రమం. అదెలాగంటారా చూడండి...ఇమేజ్ పెంచుకోవడానికే..బిగ్ బాస్ కార్యక్రమం దాదాపు 8 సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయం. 8 సీరిస్ లలో వచ్చిన పార్టిసిపెంట్స్ మళ్ళీ ఎక్కడా కనబడట్లేదు. కనీసం విన్నర్స్ ఎవరైనా ఎక్కడైనా కనబడతారనుకున్నా పొరపాటే. బిగ్‌బాస్ కార్యక్రమ రూపేణా ప్రేక్షకాదరణ విపరీతంగా ఉంటుంది. దాన్ని చూసే ప్రతి కళాకారుడు బిగ్‌బాస్‌కు వెళ్ళి తన ఇమేజ్ పెంచుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే తాను బిగ్ బాస్ బ్యాలెన్స్ పెంచుతాడే కానీ తన ఇమేజ్ డామేజ్ కాకుండా చూసుకోలేడు.అదెలాగో ఇంకాస్త వివరంగా చెబుకుందాం.హౌస్‌లో గిల్లికజ్జాలుబిగ్ బాస్ హౌస్ అంటే ఏమిటి ? ఏ సంబంధం లేని నలుగురు పబ్లిక్ ఇమేజ్ ఉన్నవాళ్ళని ఓ ఇంట్లో పెట్టి, వారి మధ్య టాస్కుల పేరుతో గిల్లికజ్జాలు పెట్టి, వారు కొట్టుకుంటే చూసే ప్రేక్షకుడితో తన గల్లా పెట్టి నింపుకునేదే ఈ బిగ్ బాస్ వ్యాపార సూత్రం. సాధారణంగా రోడ్డు మీద ఎవరైనా అనామకుడితో మనకు చిన్న పాటి ప్రమాదం జరిగినా చెలరేగిపోతాం. అటువంటి సమయంలో చుట్టూ వచ్చి పోయే వాళ్ళు ఆగి మరీ మన కొట్లాట వేడుకలా చూసి ఆనందిస్తారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో జరిగేది కూడా అదే! గొడవపడితే ఏమవుతుంది?తెలియని అనామకుడితో జరిగే గొడవ మనకు కాస్తంత అసహనం ఇచ్చినా గొడవపడతాం, అలాంటిది కోట్లాది మంది చూస్తున్నారన్న విషయం తెలిసి కూడా అదుపు తప్పి తోటి పార్టిసిపెంట్స్‌తో గొడవ పడినపుడు ఏమవుతుంది? మహా అయితే బిగ్‌బాస్ చిల్లర రెమ్యునరేషన్ రూపంలో విదిలిస్తాడు, కానీ తన ఇమేజ్ను ఈ కాస్త చిల్లర కోసం పాడు చేసుకుంటున్నామన్న విషయం గ్రహించలేకపోతున్నారు ఇప్పటి పార్టిసిపెంట్స్.గంగవ్వ ఎలిమినేషన్ఈ వారం విశ్లేషణ అంతా పైన విషయంలోనే వుంది. ఇక చెప్పుకోవాల్సిన అంశాలేమైనా ఉన్నాయి అంటే వైల్డ్ ఎంట్రీగా వచ్చిన గంగవ్వ సైలెంట్‌గా అనారోగ్య కారణాలతో ఎగ్జిట్ అయింది. బిగ్‌బాస్ కార్యక్రమాన్ని మొత్తంగా హరికథ రూపేణా పొగిడించుకుని వారాంతంలో హరితేజకు హ్యాండిచ్చి ఎలిమినేట్ చేశాడు బిగ్‌బాస్. బిగ్ డ్యామేజ్వారాంతంలో జంబలకిడిపంబ పేరుతో పార్టిసిపెంట్స్‌ను లింగ వేషధారణతో జుగుప్సాకరమైన డ్యాన్సులు హావభావాలతో రసాభాస చేసి ఈ వారానికి మమ అనిపించారు. ఏదేమైనప్పటికీ బిగ్‌బాస్ అన్నది బిగ్ డ్యామేజ్ అన్న విషయం చూసే ప్రేక్షకులు ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ పార్టిసిపెంట్స్ అయినా ఎప్పటికి గ్రహిస్తారో ఏమో!-ఇంటూరు హరికృష్ణమరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, యూట్యూబర్ గంగవ్వ చిక్కుల్లో పడింది. వీడియోల పేరుతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారంటూ గంగవ్వతో పాటు మరో యూట్యూబర్ రాజుపై కేసు నమోదు అయింది. యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ ఫిర్యాదు మేరకు జగిత్యాల అటవీ శాఖ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. వినోదం కోసం చిలుకను హింసించారని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఏం జరిగింది?2022 లో గంగవ్వ, రాజు కలిసి ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ లో గంగవ్వ చిలుక పంచాంగం అనే వీడియో చేశారు. అందులో గంగవ్వ, రాజు జ్యోతిష్కులుగా నటిస్తూ చిలుకను ఉపయోగించారు. ఇలా వినోదం కోసం చిలుకను పంజరంలో బంధించడం వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్ IV కింద నేరమని గౌతమ్ ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. (చదవండి: మొన్న బెయిల్‌పై వచ్చిన నటుడు.. ఇంతలోనే మూడో పెళ్లితో వైరల్)బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వగంగవ్వ ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది. బిగ్‌బాస్ సీజన్ 4లో గంగవ్వ తొలిసారి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లింది. అయితే అక్కడి వాతావరణం పడక అనారోగ్యం బారిన పడడంతో మధ్యలోనే ఆమెను బయటకు పంపించేశారు. మళ్లీ సీజన్ 8లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. -
పాపం గౌతమ్.. వెళ్లిపోయేముందు వాళ్లను ముంచేసిన మణికంఠ
బిగ్‌బాస్ అనేది గోల్డెన్ ఛాన్స్. ప్రేక్షకులకు దగ్గరచేసే సాధనం, ఫ్రీ పబ్లిసిటీ! అలాంటిది.. ప్రేక్షకులు తనను సేవ్ చేసినా కాదనుకుని వెళ్లిపోయాడు. షో గెలుస్తానన్న అతడు ఏడువారాలకే తన వల్ల కావట్లేదని చేతులెత్తేశాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..రెండు జంటల డ్యాన్స్ హైలైట్బిగ్బాస్ హౌస్‌లో అందరూ సమానమే.. లింగబేధం, కమ్యూనిటీ బేధాలుండవని నాగార్జున హౌస్‌మేట్స్‌కు నొక్కి చెప్పాడు. దీంతో కమ్యూనిటీ గురించి మాట్లాడిన నబీల్, మెహబూబ్ ముఖం వాడిపోయింది. తర్వాత నాగ్.. యష్మిని సేవ్ చేసి హౌస్‌మేట్స్‌తో చిత్రం భళారే విచిత్రం గేమ్ ఆడించాడు. ఇందులో అబ్బాయిల టీమ్ విజయం సాధించింది. ఈ గేమ్‌లో విష్ణు-పృథ్వీ, యష్మి- గౌతమ్ జంటల డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తర్వాత నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.డైలాగ్ డెడికేషన్హౌస్మేట్స్పై సోషల్ మీడియాలో వైరలవుతున్న కొన్ని మీమ్స్ చూపించడంతో అందరూ పగలబడి నవ్వారు. నబీల్ను సేవ్ చేసిన అనంతరం డైలాగ్ డెడికేషన్ అని మరో గేమ్ ఆడించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా కొన్ని డైలాగులను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. అలా మొదటగా నిఖిల్.. నువ్వు ఊరుకోమ్మా.. ఊరికే తుత్తుత్తు అంటావ్.. అన్న డైలాగ్ బోర్డును ప్రేరణ మెడలో వేశాడు. హరితేజ.. వీడిని ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా డైలాగ్ నాగమణికంఠకు అంకితమచ్చింది. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారుతేజ.. అదంతా అప్పుడండి.. ఇప్పుడు నేను మారిపోయాను డైలాగ్ అవినాష్‌కు సూట్ అవుతుందన్నాడు. విష్ణుప్రియ.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు డైలాగ్ గంవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందంది. తు సమ్జా.. నై సమ్జా డైలాగ్ పృథ్వీకి సరిపోతుందన్నాడు మెహబూబ్. ఇక నయని.. నవ్వాపుకుంటున్నావ్ కదరా డైలాగ్ బోర్డును విష్ణు మెడలో వేసింది. అన్న రూల్స్ పెడ్తాడు కానీ ఫాలో అవడు డైలాగ్ నిఖిల్‌కు సెట్ అవుతుందన్నాడు గౌతమ్. సరె సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి? అన్న డైలాగ్‌ను విష్ణు మెడలో వేసింది రోహిణి. బేసిక్ సెన్స్ ఉండదునాకు అర్థం కాలేదు సార్ డైలాగ్ పృథ్వీకి సెట్ అవుతుందన్నాడు మణి. నువ్వు అంత హార్ష్‌గా మాట్లాడకు, ఫీల్ అవుతాను డైలాగ్ తేజకు డెడికేట్ చేసింది యష్మి. నబీల్ వంతు రాగా.. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం డైలాగ్‌ను గౌతమ్‌కు అంకితమిచ్చాడు. గంగవ్వ.. బేసిక్ సెన్స్ ఉండదు, అంటే ఏమో హర్ట్ అయిపోతారు అన్న డైలాగ్ నయనికి డెడికేట్ చేసింది. ఓవరాక్షన్ చేస్తున్నావేంట్రా, ఓవరాక్షన్ అన్న బోర్డును అవినాష్.. పృథ్వీకి ఇచ్చాడు. నాకు ఇంట్రస్ట్ పోయింది సర్ అన్న డైలాగ్‌ను మణికి డెడికేట్ చేసింది ప్రేరణ. మండుతున్నట్లుంది డైలాగ్‌ను మెహబూబ్‌కు అంకితమిచ్చాడు పృథ్వీ. మణికంఠ ఎలిమినేట్తర్వాత నాగ్.. పృథ్వీని సేవ్ చేశాడు. చివర్లో గౌతమ్, మణికంఠ మిగిలారు. ఈ క్రమంలో మణి తనవల్ల కావట్లేదు, వెళ్లిపోతానన్న వీడియను హౌస్‌మేట్స్‌కు ప్లే చేసి చూపించాడు నాగ్. అతడు ఉండాలా? వద్దా? అని హౌస్‌మేట్స్‌ను అడగ్గా మెజారిటీసభ్యులు మణి వెళ్లడమే బెటర్ అన్నారు. చివరిసారి మణికంఠను అడిగి చూశాడు నాగ్. అప్పటికీ అతడు వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. దీంతో మణికంఠ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అయితే మణికంఠ కంటే గౌతమ్‌కు తక్కువ ఓట్లు పడ్డాయన్నాడు. నిజానికి ఎలిమినేట్ కావాల్సింది గౌతమ్ అని చెప్పాడు. ఎక్కడ తప్పు జరుగుతోందని గౌతమ్ ఆలోచనలో పడిపోయాడు. ఆ ఐదుగురినీ బోటు ఎక్కించాడుఅటు మణికంఠ.. జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలా నవ్వుతూ వెళ్లిపోయాడు. పోరాడలేకపోయాను, నా ఓపిక అయిపోయిందంటూ హౌస్మేట్స్ దగ్గర సెలవు తీసుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన మణికంఠతో నాగ్ ఓ గేమ్ ఆడించారు. అందులో భాగంగా మణి.. నయని, విష్ణుప్రియ, నబీల్, హరితేజ, మెహబూబ్ ఫోటోలను బోటు ఎక్కించాడు. మెహబూబ్‌కు విన్నర్‌కు కావాల్సిన లక్షణాలున్నాయన్నాడు. అనంతరం ఆటలో ఒకప్పుడు ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు, ఫినాలే వరకు వస్తావని ఆశిస్తున్నానంటూ నిఖిల్ ఫోటోను నీటిలో ముంచేశాడు. మునిగిపోతావ్, జాగ్రత్త..తేజ ఎనర్జీ చూపించకపోతే ముగిపోతాడన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆడితే బెటర్ అంటూ పృథ్వీని ముంచాడు. అవసరమైనప్పుడే నోరు విప్పు.. వచ్చిన మొదటివారమే చీఫ్ అయ్యావ్.. ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయకపోతే ఆటలో మునిగిపోతావని గౌతమ్‌ను హెచ్చరించాడు. అనవసరమైన చోట నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం వల్ల నీ ఆటకే ఎసరు పడుతుందని ప్రేరణ ఫోటోను ముంచాడు. చివర్లో ప్రేక్షకుల ఓట్లను కాదని వెళ్లిపోయినందుకు తనను క్షమించమని వేడుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: పదోవారం గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్
వయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆమె ఐదేళ్లకే పెళ్లి చేసుకుంది. కష్టాల నీడలోనే పెరిగిన మిల్కూరి గంగవ్వ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయమైంది. తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్లో అడుగుపెట్టింది.స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్ 8లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈసారి వెళ్లగొట్టేదాకా ఉండనంది. మనసు ఉండాలంటున్నా శరీరం వద్దని చెప్తుండటంతో చేసేదేం లేక మరోసారి స్వచ్ఛందంగా ఇంటినుంచి వెళ్లిపోయింది. -
బిగ్ బాస్ తర్వాత గంగవ్వ ఆస్తి విలువ ఎంత అంటే
-
105 రోజుల వినోద క్వారంటైన్
కరోనా వచ్చినా, వస్తుందనే సందేహం వచ్చినా క్వారంటైన్‌కి వెళ్లాలి. ఆ క్వారంటైన్ పద్నాలుగు రోజులే. కాని పదహారు మంది కంటెస్టెంట్లు 105 రోజుల క్వారెంటైన్‌కి వెళ్లే సీజన్ వచ్చింది. బిగ్‌బాస్ 4 సీజన్. ఇక వీరి ఆటలు, పాటలు, తగువులు, తీర్పులు, ఎంట్రీలు, ఎగ్జిట్లు అన్నీ ప్రేక్షకులవి కూడా కాబోతున్నాయి. కరోనా చికాకును కాస్తయినా దూరం చేసే భారీ డైలీ డ్రామా బిగ్‌బాస్ 4. కెమెరా కళ్లున్న ఇల్లు. అనుక్షణం నిఘా. ప్రతి కదలికను వెంటాడే చూపు. ప్రవర్తనపై తీర్పు. అంతలోనే స్నేహం. అంతలోనే వైరం. ఇంట్లోకి అడుగు పెడుతుంటే స్వాగతం. వీడ్కోలు తీసుకుంటూ ఉంటే దుఃఖం. స్టార్ మాలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ షోలో లేని డ్రామా లేదు. అంత వరకూ ముక్కూముఖం అంతా తెలియని వారు, పాత స్నేహం ఉన్నవారు పూర్తిగా కొత్తగా మారి కొత్త జీవితం జీవించడమే ఈ షో విశేషం. అందరి లక్ష్యం ఒక్కటే. అంతిమ విజేతగా నిలవడం. కాని ఆ ప్రయాణం అంత సులువు కాదు. మనుషులను ఓడించి, జయించి, బాధించి, సంతోషపరిచి ఆ స్థానానికి వెళ్లాలి. ప్రతి సందర్భంలోనూ ఒకటే సవాల్. లోపల ఉన్న మంచిని బయటకు తేవాలా.. చెడును బయటకు తేవాలా. ఆ ప్రవర్తనకే ఓట్లు పడతాయి. ఆ వ్యక్తిత్వాన్నే ప్రేక్షకులు గెలిపిస్తారు. ఇదంతా ప్రతి రోజూ గుక్క తిప్పుకోనివ్వకుండా కొనసాగుతుంది. ఈసారి హోస్ట్ ఎవరు? బిగ్‌బాస్ షో నిర్వహణ ఎంత ముఖ్యమో హోస్ట్‌ను నియమించడం కూడా అంతే ముఖ్యం. ఎన్.టి.ఆర్ హోస్ట్‌గా పెద్ద బ్యాంగ్‌తో మొదలైన ఈ షో ఆ తర్వాత నాని, నాగార్జునలతో అదే మీటర్‌ను కొనసాగించింది. బిగ్‌బాస్ 4కు మళ్లీ ఎన్.టి.ఆర్ హోస్ట్ కావచ్చన్న వార్తలొచ్చాయి. ఒక దశలో మహేశ్‌బాబు పేరు వినిపించింది. కాని బిగ్‌బాస్‌కు హోస్ట్ చేసే చాన్స్ మళ్లీ నాగార్జునకే దక్కింది. కరోనా వల్ల సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన నేపథ్యంలో నాగార్జున కూడా మరోసారి ఈ షోను హోస్ట్ చేయడం ఒక ఆసక్తికర వృత్తిగత కార్యకలాపంగా భావించి ఉంటారు. నాగార్జున నిర్వహించిన బిగ్‌బాస్ 3 విజేతగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఈసారి ఎవరు నిలుస్తారో చూడాలి. కంటెస్టెంట్లు ఎవరు? పాల్గొనే వరకు కంటెస్టెంట్లు ఎవరు అనే విషయమై సస్పెన్స్ ఉంచడం బిగ్‌బాస్ షో ఆనవాయితీ. అయితే ఇంతకు ముందు పద్ధతి వేరు. ఇప్పుడు పద్ధతి వేరు. గతంలో కంటెస్టెంట్లను షోకు రెండు మూడు రోజుల ముందు తమ అధీనంలోకి తీసుకునేవారు. కాని ఇప్పుడు కరోనా వల్ల రెండు వారాల ముందు నుంచే వారిని తమ అధీనంలోకి తీసుకోవడం, పరీక్షలు నిర్వహించడం తతిమా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఆగస్టు నెలాఖరుకు టెలికాస్ట్ కావాల్సిన షో సెప్టెంబర్ 6కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల పేర్లు కొన్ని బయటకు తెలియసాగాయి. నటుడు తరుణ్, నటి శ్రద్ధా దాస్, గాయని సునీతల పేర్లు మొదట వినిపించినా వారు తమ పార్టిసిపేషన్‌ను కొట్టి పారేశారు. ప్రస్తుతానికైతే వార్తల్లో ఉన్న పేర్లు ఇవి– 1. లాస్య మంజునాథ్ (టీవీ నటి), 2. మహాతల్లి జాహ్నవి (యూట్యూబర్), 3. గంగవ్వ (యూట్యూబర్– విలేజ్ స్టార్), 4.సుజాత (టివి యాంకర్), 5.అవినాష్ (స్టాండప్ కమెడియన్), 6. సత్య (న్యూస్ రీడర్), 7.సుహైల్ రెయాన్ 8. సూర్యకిరణ్ (డైరెక్టర్), 9. అభిజిత్ (హీరో), 10. అమ్మ రాజశేఖర్ (దర్శకుడు). 11. దివి వైద్య (నటి). మిగిలిన ఐదుగురిలో ఇద్దరు హీరోయిన్లు, ఒక మ్యూజిక్ చానెల్ యాంకర్ ఉంటారని తెలుస్తోంది. ఈ 16 మంది కాకుండా అడిషిషనల్ కంటెస్టెంట్లను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. కరోనా ఆటంకాల వల్ల, ఇతరత్రా ఇబ్బందుల వల్ల వీరిలో ఎవరు పాల్గొంటారో కొత్తగా ఎవరు జతవుతారో ఇవాళ సాయంత్రం తెలిసిపోతుంది. కత్తి మీద సాము ఏమైనా ఈసారి బిగ్‌బాస్ షో నిర్వహణ కత్తి మీద సాము. గెస్ట్‌లు హౌస్‌లోకి రావాలన్నా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి రావాలన్నా అప్పటికప్పుడు అయ్యే పని కాదు. కరోనా ప్రొటోకాల్‌ను పాటించి చేయాలి. అదీగాక బిగ్‌బాస్ షో నిర్వహణ లో కనీసం వంద మంది శ్రమించాల్సి ఉంటుంది. వీరంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే హౌస్‌లో ఉన్నవారికి కూడా కరోనా రావచ్చు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రేక్షకులు ఉత్కంఠగా ఉన్నారన్నది వాస్తవం. ఇల్లు అంతగా కదల్లేని ఈ రోజుల్లో, థియేటర్ల మూసివేత కొనసాగుతున్న ఈ రోజుల్లో ఇంట్లోకి రానున్న వినోదం వారిని ఉల్లాసపరుస్తుందనే ఆశిద్దాం. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
స్టార్... స్టార్... విలేజ్ స్టార్
గంగవ్వా... నీతో ఒక సెల్ఫీ... గంగవ్వా... ఒక షేక్‌హ్యాండ్ ఇవ్వవా... గంగవ్వా... ఏదైనా మాట్లాడవా... గంగవ్వను చూస్తే అందరికీ ఉత్సాహమే. అందరికీ సంతోషమే. గంగవ్వ సెలబ్రిటీ. ఊరి నుంచి నగరానికి, నగరం నుంచి దేశానికి తెలిసి సెలబ్రిటీ. ఆమె మాట ఆమె గుర్తింపు కార్డు. తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి ఆమె అనధికార అంబాసిడర్. ఆమె చేస్తున్న ‘మై విలేజ్ షో’ యూ ట్యూబ్ బాహుబలి అంత పెద్ద హిట్. అందుకే గంగవ్వ సన్మానాలందుకుంటోంది. సత్కారాలు పొందుతూ ఉంది. తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతిరూపంగా ఉన్న గంగవ్వ ‘మై విలేజ్ షో’ ద్వారా యూ ట్యూబ్ స్టార్‌గా ఎదిగింది. కూలిపనులు చేసుకుంటూ జీవించే గంగవ్వ, అక్షరం నేర్చుకోని గంగవ్వ, ఊరు దాటి బయటకు రాని గంగవ్వ... ఇప్పుడు దేశ ఎల్లలు దాటి విదేశాలలోని తెలుగువారి అభిమానాన్నీ చూరగొంటోంది. సినిమాల్లో నటిస్తోంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని తనదైన యాసతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నందుకు ప్రభుత్వం ఆమెను మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా లక్షరూపాయల నగదు పురస్కారంతో సత్కరించింది. ఈ సందర్భంగా తన గురించి అడిగితే కష్టాలను తట్టుకొని ఎలా నిలబడిందో తెలిపింది. ‘మాది జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామం. మా నాయిన లచ్చయ్య నాకు ఊహ తెలియక ముందే కన్నుమూశాడు. పదమూడేళ్ల వయసులో అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తమ్ముళ్ల బాధ్యత తీసుకున్నా. నాకు ముగ్గురు పిల్లలు. మా ఆయన గంగయ్య ఏ పనీ చేయక తాగుడుకు బానిసయ్యాడు. ఏ రాత్రీ గొడవ లేకుండా తెల్లారలేదు. పగటిపూట కూలిపనులకు వెళుతూ, రాత్రిపూట బీడీలు చుట్టేదాన్ని. కంటినిండా నిద్ర అన్న విషయమే మర్చిపోయా. బాగా సంపాదిస్తానని మా ఆయన పదిహేనేళ్ల క్రితం గల్ఫ్‌కి వెళ్లాడు. వెళ్లింది వెళ్లడమే... తను ఉన్నాడో లేడో కూడా తెలిసింది కాదు. నయాపైసా పంపిందిలేదు. ఆ తర్వాత ఎప్పుడో అక్కడే చనిపోయాడని తెలిసింది. భుజాన సచ్చిపోయిన బిడ్డతో... నా చిన్న బిడ్డ అనితకు ఎనిమిదేళ్ల వయసులో మస్తు జొరం వచ్చింది. అప్పుడు మా ఆయన గల్ఫ్‌లో ఉన్నడు. జగిత్యాలలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చిన. వారం రోజులు గడిచాక డాక్టర్ ‘ఇక నీ బిడ్డను ఇంటికి తీసుకపో’ అన్నాడు. నా బిడ్డకు నయం అయ్యింది. డాక్టరు మంచోడు అనుకున్న. తనని భుజాన వేసుకుని బస్టాండుకు వెళ్లా. అనిత కాళ్లు, మెడ వేలాడుతుండడంతో బస్టాండులో ఎవరో చూసి సచ్చిపోయిన బిడ్డను ఎందుకు ఎత్తుకున్నవ్ అని అడిగిండ్రు. సచ్చిపోలే నిద్రపోయింది అని చెప్పిన. సచ్చిపోయినోళ్ల కాళ్లే ఇట్లా వేలాడుతయ్ అది కూడా నీకు తెల్వదా అనడంతో బిడ్డను కిందికి దించి, చూసేసరికి ఊపిరి ఆగిపోయిందని తెలిసింది. బస్టాండులోనే శవాన్ని పెట్టుకుని ఏడ్చిన...’ అంటూ బిడ్డను గుర్తుకు చేసుకొని కంటనీరు పెట్టుకుంది గంగవ్వ. పూరి జగన్నాథ్‌తో... దశ తిప్పిన యూట్యూబ్ వ్యవసాయ కూలీగా పని చేసుకుంట బతుకు వెళ్లదీస్తున్న గంగవ్వకు ‘మై విలేజ్ షో’ అనే యూ ట్యూబ్ షో మరో జన్మనిచ్చిందని చెప్పింది. తనకే తెలియని తనలోని సహజ నటిని ప్రపంచానికి పరిచయం చేసింది. తన స్వభావంతో, తన మాటతో, తన విరుపుతో గంగవ్వ నటించడం వల్ల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆమె ఉన్న ఎపిసోడ్ హిట్ అని పేరుపడింది. గంగవ్వ ఇప్పటి వరకు సుమారు 100 షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. తన ఇంట్లో టీవీ కూడా లేని గంగవ్వ టీవీ, సినిమా స్టార్‌గా ఎదిగింది. గంగవ్వ సహజ నటన ను చూసిన సినిమా డైరెక్టర్లు అవకాశం ఇవ్వడంతో మల్లేశం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో అవకాశం కల్పించారు. టీవీ ఛానల్లో ప్రసారమైన సిక్త్స్‌సెన్స్ కార్యక్రమంలో విజేతగా నిలిచి అబ్బుర పరిచింది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘గ్రామీణ సంస్కృతి ప్రచారకర్త’గా అవార్డు అందుకుంటూ ప్రపంచస్థాయిలో గుర్తింపు మారుమూల గ్రామం లంబాడిపల్లికి చెందిన మిల్కూరి గంగవ్వ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ తరపున రివర్స్ స్టోరీ అంశంపై గంగవ్వ క్షేత్రస్థాయిలో పర్యటించి రిపోర్టింగ్ చేసింది. అమెరికా, ఆస్ట్రేలియాలోని తెలుగువాళ్లు గంగవ్వను కలిసేందుకు ఇష్టపడుతున్నారు. ఒక్కసారి నీ తిట్లతో దీవించు అంటూ గంగవ్వను వెతుక్కుంటూ వెళ్లి, ఆమె మాటలు, తిట్లు వింటూ సంబరపడిపోతున్నారు. పదేళ్ల చిన్నారుల నుండి పండు ముసలివాళ్ల వరకు గంగవ్వను చూడాలని, మాట్లాడాలని పోటీ పడుతున్నారు. సోషల్ మీడియా, రూరల్ మీడియా విభాగంలో గంగవ్వ తన ప్రతిభకు పురస్కారాలు అందుకుంది. ‘బతుకంతా మస్తు కష్టపడ్డ. రాట కొట్టిన, మోట కొట్టిన, బారాన కోసం కూళ్లకు పోయిన. ఫలితం లేకపోయింది. ఇప్పుడు మీ అందరి వల్ల ఇయ్యాల పేరొచ్చింది. చిన్నగున్నమని చింత చేయద్దు. పెద్ద పోకడకు పోవద్దు. పెద్దగ పెంచుకుంట పోతే ఇంక మనకు బాగా పేరొస్తది’ అంటూ పురస్కారం అందుకున్న సందర్భంగా ఇలా అమూల్యమైన మాటలు తెలిపింది గంగవ్వ. – నిర్మలారెడ్డి, జవ్వాజి చంద్రశేఖర్, ల్యాల ఫొటోలు: బొమ్మెన కుమార్ నాకింత గుర్తింపు వస్తదనుకోలేదు బడికి పోలేదు. పలక బలపం పట్టి చదువు నేర్సుకోలేదు కాని ఇప్పుడు ఇంగ్లిష్ కూడా కొంచెం కొంచెం మాట్లాడుతున్న. డైరెక్టర్ పూరి సార్ నన్ను పిలిచి సినిమాల నటించమంటే ‘నటించుడు రాదు సారూ మీరు చెప్పింది చెప్పినట్లు సేత్తా’ అంటే కొద్దిసేపు ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తీసుకున్నడు. మల్లేశం సినిమాలో చేసిన. టీవీలో ఓ యాడాది యాంకర్‌గా చేసిన. ఎక్కడైనా నమ్మకంగా ఉండి, ఆత్మవిశ్వాసంతో పని చేస్తే విజయం లభిస్తుంది. – గంగవ్వ, యూట్యూబ్ స్టార్ -
యూ'స్టార్స్'.. గంగవ్వకు జై..
యూట్యూబ్ ఛానల్స్‌లో సిటీ యువత హల్చల్ చేస్తోంది. లక్షలు,మిలియన్ మంది వీక్షకుల మదిని దోచేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నారు.. కంటెంట్ కన్నా మిన్నగా డైలాగ్ డెలివరీ,రక్తికట్టించే నటీనటుల హావభావాలు వీక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ప్రాచుర్యం కోసం ఒకప్పుడు సినిమా, టీవీ అవకాశాల వైపు మాత్రమే చూసిన యువత ఇప్పుడు సోషల్ వేదికలనే టార్గెట్ చేస్తోంది.సిటీయువత నిర్వహిస్తున్న కొన్న యూ ట్యూబ్ చానెల్స్ విశేషాలివి... గ్రామీణ నేపథ్యమే..సక్సెస్‌కు సారథ్యం... పండుగల విశిష్టతను చాటుతూ అచ్చమైన తెలంగాణ యాసలో గ్రామీణ నేపథ్యంతో క్రియేటివ్ థింక్స్ ఆకట్టుకుంటోంది. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ‘మాకాడ మహాశివరాత్రి’ లఘుచిత్రం వీక్షకుల్ని మెప్పించింది. గంగమ్మ (నది) చెంతకు వెళ్ళి మట్టితో శివలింగం చేసి అభిషేకం చేయడం, గ్రామంలోనే పూజ చేసేందుకు అవసరమయ్యే వస్తువుల సేకరించడం, ఆ తరువాత జాగరణ వంటి పండుగ విశేషాలతో తెరకెక్కించిన ఈ లఘు చిత్రం నాలుగు రోజుల్లోనే 1.2 మిలియన్ వ్యూస్ అందుకుంది. ⇒ వాలంటైన్స్ డే పురస్కరించుకుని ‘లవ్ దే’ పేరిట అప్లోడ్ చేసిన వీడియో వారం వ్యవధిలోనే 1.4 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. లవర్స్ కాని జంటకు ప్రేమ్దళ్ పేరిట కొందరు యువకులు పెళ్ళి చేయడం, ఆ పెళ్ళి విషయం ఇంట్లో తెలవగా వారు ఏవిధంగాఆ పెళ్ళి తంతు నుంచి బయటపడ్డారో అనేది వీక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ⇒ మాఘమాసం మంట, అష్టాచమ్మా, బరుతుడే, విలేజ్‌లో గండాలు, విలేజ్‌లో శ్రీమంతుడు, సెల్ కల్లు తాగితే, అప్పాలు చేయబోతే, థర్టీఫస్ట్ దావత్, మాకాడ బతుకమ్మ వంటి లఘు చిత్రాలు హిట్స్ కొట్టాయి. వీరు తెరకెక్కించే ప్రతి వీడియోలోనూ గ్రామీణ వాతావరణం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఇప్పటివరకు 58 వీడియోల ద్వారా వీక్షకులకు వినోదాన్ని పంచింది. ప్రస్తుతం 1.15 మిలియన్ సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతోంది. గంగవ్వకు జై.. హాస్యపు జడివానలో వీక్షకులను తడిసిముద్దయ్యేలా చేస్తోంది మై విలేజ్ షో అంతేకాదు కొత్త సినిమాలకు ప్రమోషన్‌కు అడ్డాగా కూడా ఇది అవతరించింది. ఇందులో గంగవ్వ నటన ఎనలేని ఆదరణ పొందింది. నకిలీ పోలీసులు ఏవిధంగా దండుకుంటున్నారు, ఆర్టీఏ కార్యాలయం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తప్పుడు చలాన్లను ఇళ్ళకు పంపించి ఏవిధంగా తమ అకౌంట్లో డబ్బును జమ చేయించుకుంటున్నారు?ఇలాంటివి హాస్య నేపథ్యంగా చూపించిన తీరు హాట్సాఫ్ అనిపించుకుంది. ‘విలేజీలో డ్రంక్ అండ్ డ్రైవ్’ పేరిట అప్లోడ్ చేసిన ఈ వీడియో 4.2 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసేసింది. ఇదే కోవలో ‘చేపల దొంగలు’ వీడియోకు 5.3 మిలియన్ వ్యూస్ వచ్చి చేరాయి. 31 దావత్ ప్లాన్ చేస్తే, విలేజ్ సమ్మర్ ప్రాబ్లమ్స్, దొంగల భయం, పిసినారి రాజు, విలేజ్‌లో దీపావళి, అమెరికా సోకు, ఇస్మార్ట్ గంగవ్వ, కరోనా కలకలం, విజయ్ పెండ్లి గోసలు, విలేజ్ పబ్ వంటి కామెడీ వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్‌ను మూటగట్టుకున్నాయి. అలాగే బిత్తిరి సత్తి హీరోగా తుపాకి రాముడు సినిమా ప్రమోషన్ కోసం చేసిన వీడియో సైతం హల్చల్ చేసింది. 2019లో యూట్యూబ్ తెర పైకి వచ్చిన మై విలేజ్ షో ఛానల్లో ఇప్పటివరకు 193 వీడియోలు వినోదాన్ని పంచాయి. 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతుంది. దంచికొడుతున్న దేత్తడి.. ‘దేత్తడి’ ఛానల్ మోస్ట్ పాపులర్ అయ్యింది. ఇందులో హారిక అలేఖ్య నటన కుర్రకారుకు క్రేజీగా మారింది. 2018 ఏప్రిల్‌లో యూట్యూబ్‌లోకి ప్రవేశించిన ఈ ఛానల్ ఇప్పటికే 1 మిలియన్ పైచిలుకు సబ్‌స్క్రైబర్స్‌ను సొంతం చేసుకుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు కామెడీని జోడించి తెరకెక్కించే తీరు వీక్షకులకు దగ్గర చేసింది. మెడికల్ షాప్‌కు వచ్చే వారి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు మెడికల్ దుకాణం పేరిట తీసిన షార్ట్ వీడియో రెండు నెలల్లోనే 1 మిలియన్ వ్యూవర్స్‌ను మూటగట్టుకుంది. దేత్తడి ఛానల్స్ ద్వారా ఇప్పటివరకు అప్లోడ్ చేసిన 94 వీడియోలు యూట్యూబ్ లవర్స్ మదిని దోచేశాయనే చెప్పాలి. సినీనటుడు సుశాంత్ సైతం హారికతో జతకట్టి ‘పెళ్ళి గోల’ షార్ట్‌ఫిల్మ్‌లో వినోదాల జల్లులు కురిపించారు. -
గంగవ్వను కదిలిస్తే కన్నీళ్లే..
‘అవ్వా, అయ్యా... ఒక్క రూపాయి దానం చెయ్యండయ్యా’ అంటూ బస్టాండ్‌లో చేయిజాపి అడుక్కునే గంగవ్వ వెనుక మూడు ప్రాణాలున్నాయి. వాళ్లే జీవితంగా బతుకుతూ, వాళ్ల ఉన్నతి కోసమే బతుకుతున్న గంగవ్వను కదిలిస్తే కన్నీళ్లే సమాధానం చెబుతాయి.కామారెడ్డి బస్టాండ్ ప్రాంతంలో ప్రతి నిత్యం భిక్షాటన చేస్తూ కనిపించే గంగవ్వ వయసు 70 దాటింది. కొడుకులు కూతుళ్లు ఆదరించడం లేదేమో.. అందుకే అడుక్కుంటోందేమో అనుకుంటారంతా. కానీ, అర్ధాంతరంగా మరణించిన కొడుకు పిల్లలను ఎలాగైనా చదివించుకోవాలని ఆ భిక్షాటన చేస్తోందని ఎవరూ ఊహించరు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ ఊరి చివరన ఓ పూరిగుడిసెలో ఉంటుంది గంగవ్వ. ఇద్దరు మనవరాళ్లు, ఓమనవడు ఆమె ఆస్తి. రోజూ పొద్దున లేవగానే గిన్నె చేతిలో పట్టుకుని నాలుగిళ్లు తిరిగి అన్నం అడుక్కువచ్చి ముగ్గురి ఆకలి తీరుస్తుంది. వాళ్లను తయారు చేసి బడికి పంపి, తాను కామారెడ్డి బస్టాండ్‌కు చేరుకుంటుంది. మధ్యాహ్నం వరకు డబ్బులు అడుక్కుని, ఎవరైనా దయతలచి ఏదైనా పెడితే తిని కడుపు నింపుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకోవడం ఆమె దినచర్య. వృద్ధాప్యాన ఒంటి చేత్తో.. గంగవ్వకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. గంగవ్వ పెద్ద కొడుకు సంజీవులు, కోడలు పోచవ్వలను పదేళ్లక్రితం మాయదారి రోగం మింగేసింది. అప్పుడు వాళ్ల పిల్లలు చామంతి, శ్రీకాంత్, వసంతలు పసివారు. ఆ సమయంలో మనవరాళ్లు, మనవడిని గంగవ్వ అక్కున చేర్చుకుంది. అదే సమయంలో ఆమె భర్త కూడా చనిపోవడంతో ఒక్కతే ముగ్గురు పిల్లల బాధ్యతలు తీసుకుంది. రోజూ ఉదయం అన్నం భిక్షం అడిగి పిల్లలకు తలా కొంచెం తిండి పెట్టి వారిని బడికి పంపేది. మధ్యాహ్నం పూట బడిలో భోజనం తిని ఆకలి తీర్చుకునేవారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత నానమ్మ ఏదైనా పెడితే తిని చదువుకునేవారు. రోజూ బడిలో మధ్యాహ్న భోజనంతో ఆకలి తీర్చుకునే ఆ పిల్లలు బడి సెలవులప్పుడు పూట గడవక ఇబ్బంది పడుతుంటారు. పెద్ద మనవరాలు చామంతి గతేడాది పదో తరగతి పాసైంది. ఇంటర్ చదవాలన్న ఆరాటం ఉన్నా ఆర్థిక స్తోమత లేదని ఇంటి దగ్గరే ఉంటోంది. ఈ మధ్యనే కామారెడ్డిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వర్కర్‌గా చేరింది. ఆమెకు ఇచ్చే వేతనం రోజూ రానుపోను ఖర్చులకే సరిపోతోంది. మనవడు శ్రీకాంత్ ప్రస్తుతం కుప్రియాల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. చిన్న మనవరాలు తొమ్మిదో తరగతి చదువుతోంది. పిల్లల కోసమే బతుకుతున్న పెద్దోడు సంజీవులు, కోడలు పోచవ్వ సచ్చిపోయినప్పుడు ఈ ముగ్గురు సంటి పిల్లలు. ఆ దినం సంది వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకున్న. వాళ్లు పెరిగి పెద్దోళ్లైన్రు. నేను తిన్నా, తినకున్నా పిల్లల ఆకలి తీర్చేతందుకే బిచ్చం అడుక్కుంటున్న. వాళ్లు సదువుకుంటే కష్టాలు తీరుతయని సదివిస్తున్న. – కరమంచి గంగవ్వ, కుప్రియాల్ ఆమె మాటనే వినుకుంటం నాకు ఊహ తెలువకముందే అమ్మ, నాన్న చనిపోయిండ్రు. మాకు నాయినమ్మనే అన్నీ తానై చూసుకున్నది. ఇప్పటికీ ఎంతో కష్టపడుతది. అందరిలెక్క మాకు అమ్మా, నాన్న ఉంటే మంచిగుండు అనిపిస్తది. కాని ఏం చేస్తం. నాయినమ్మ మమ్ములను మంచిగ చూసుకుంటది. ఆమె చెప్పినట్టు నడుచుకుంటం. – వసంత, చిన్న మనవరాలు అమ్మ, నాయిన.. నాయినమ్మ మా అమ్మ నాయిన ఎట్లుంటరో నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. మా నాయినమ్మనే అమ్మ, నాయిన లెక్క చూసుకున్నది. ఇప్పటికీ మా కోసమే కష్టపడుతున్నది. ఈ మధ్య కామారెడ్డిలోఆక్యుప్రెజర్ వైద్యశాలలో పనిలో చేరిన. – చామంతి, పెద్ద మనవరాలు అన్నీ నాయినమ్మే... నాకు అమ్మా, నాన్న అన్నీ నాయినమ్మే. చిన్నప్పటి నుంచి నానమ్మతోనే జీవితం. నాయినమ్మ మా కోసం ఎంతో కష్టపడుతోంది. నేను బాగా చదువుకుని నానమ్మ కష్టాలు తీరుస్తా. వానొస్తే గుడిసె మొత్తం కురుస్తది. మాకు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నం. – శ్రీకాంత్, మనవడు జీవితమంతా కష్టాలే... గంగవ్వ జీవితమంతా కష్టాలతోనే సాగిపోయింది. వృద్ధాప్యంలో ఆసరా అవుతారనుకున్న కొడుకులు ఒక్కొక్కరు మాయమయ్యారు. ముగ్గురు కొడుకుల్లో పెద్దోడు సంజీవులు పదేళ్ల క్రితం నయంకాని రోగంతో కన్ను మూస్తే, రెండో కొడుకు రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. చిన్నోడు చిన్న వయసులోనే కనిపించకుండా పోయాడు. బతికున్నాడో లేడో కూడా తెలియదు. ఇద్దరు కూతుళ్లు.. ఎవరి కుటుంబం వారిది. కాలు చేయీ ఆడక తనకు చేసేవాళ్లు లేకపోగా, తనపైనే పెద్ద కొడుకు పిల్లలు ఆధారపడి ఉండడంతో ఆమె జీవితమంతా భిక్షాటనతోనే గడచిపోతోంది. కుప్రియాల్ గ్రామంలో ఉన్న పూరి గుడిసె భారీ వర్షాలు కురిస్తే వాన నీరంతా చేరి ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్యన పైకప్పు నుంచి నీరు జారకుండా ప్లాస్టిక్ కవర్ కప్పించింది.గంగవ్వకు ఆహార భద్రతా కార్డు ద్వారా 24 కిలోల బియ్యం వస్తాయి. ముగ్గురు పిల్లలు, ఆమె నలుగురు తినాలంటే ఆ బియ్యం పదిహేను రోజులకు సరిపోవు. అంత్యోదయ కార్డు కోసం కలెక్టరేట్‌కు తిరిగినా ఎవరూ కనికరించలేదు. వృద్ధాప్య ఫించన్ నెలకు రూ.2016 వస్తోంది. రోజూ భిక్షమెత్తగా వచ్చే డబ్బులు, పింఛన్ డబ్బులతో తన మందులకు, పిల్లల చదువులకు, బట్టలకు వెచ్చిస్తోంది. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి ఫోటోలు: అరుణ్ గౌడ్ -
తొలి తెలుగు ఫీమేల్ స్టార్..
యూట్యూబ్.. సినిమా థియేటర్లను చిన్నబోయేలా చేస్తోంది!వంటల నుంచి న్యూస్ ఎనాలిసిస్ దాకా అన్ని అంశాలతో అరచేతిలోనే ఇన్ఫోటైన్మెంట్ అందుతుంది!హంగామా కాదు.. ఆలోచన ఉన్న సృజనకారులను తెరమీదకు తెస్తోంది...సినిమాస్టార్స్ కంటే ఎక్కువ ఫాలోయింగ్‌ను సంపాదించిపెడుతోంది..పాటలు, ఫైట్లు అనే ఫార్మూలాతో కాకుండా.. ఫ్లాప్‌లు, హిట్లు లేకుండా.. కేవలం క్రియేటివిటీతోనే కెరీర్‌ను స్థిరపరుచుకుంటున్న..పరుచుకున్న యూట్యూబ్ ఫిమేల్ స్టార్స్ పరిచయం.. చాన్నాళ్ల కిందట.. కాఫీ విత్ కరణ్ షోకి అతిథిగా వెళ్లారు ఆలియా భట్. రాపిడ్ రౌండ్లో ‘‘మన రాష్ట్రపతి (అప్పటి) ఎవరు?’’ అన్న ప్రశ్నకు తప్పు సమాధానమిచ్చి అప్పట్లో దేశ ప్రజల ట్రోలింగ్కి గురయ్యారు ఆలియా. ఆ స్పూఫ్‌తో అంతే పాపులర్ అయింది ఓ చానెల్. దాని పేరు ఏఐబి (ఆల్ ఇండియా బ్యాక్చోడ్.. ఉత్తర భారతంలో బ్యాక్చోడ్ అంటే ఊసుపోని కబుర్లు, వదంతులు అని అర్థం). నిజానికి ఇది యూట్యూబ్ కంటే ముందే వచ్చిన చానెల్. అంటే మన దేశంలోకి యూట్యూబ్ రాకముందు ఏఐబీ తన షోస్‌ను ఆడియో రికార్డింగ్ చేసి నెట్లో పెట్టేది. ఒకరకంగా రేడియోలాగా అన్నమాట. తర్వాత అంటే 2013కి యూట్యూబ్ చానెల్‌గా మారింది. తన్మయ్ భట్, జి. కంభ అనే ఇద్దరు యువకులు దీన్ని స్టార్ట్ చేశారు. ఇదెంత ప్రాచుర్యం పొందింది అంటే అప్పటి రియాలిటీ షోస్‌లకు దీటుగా దీనికి వ్యూస్ ఉండేవి. ‘కాఫీ విత్ కరణ్’ స్పూఫ్లో ఆలియానే అతిథిగా వచ్చేంత క్రేజ్ సంపాదించుకుంది ఏఐబి. బాలివుడ్ నుంచి పాలిటిక్స్ దాకా దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామం మీద వ్యంగ్యంగా షో చేసేవాళ్లు దీంట్లో. దేశంలో యూట్యూబ్ చానెల్స్‌కి ఒకరకంగా ఇది ప్రేరణ, స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. కొత్త ఆలోచనలు, భిన్నమైన ప్రెజెంటేషన్సే ఈ షోస్‌కు క్వాలిఫికేషన్. వంటలు, ఫ్యాషన్, యోగా, న్యూస్ కామెంట్స్, ఆర్ట్స్... ఒక్కటేమిటి అభిరుచికి సృజనను జోడించి షో చేసి యూట్యూబ్ చానెల్లో రిలీజ్ చేయడమే. వీటన్నిటికీ వేలల్లో చందాదారులున్నారంటే యూట్యూబ్ చానెల్స్కున్న డిమాండ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. పాపులర్ షోస్‌తో టాప్‌లో ఉన్న యూట్యూబ్ స్టార్స్‌లో చాలా మంది మహిళలే. వీళ్లలో అయిదేళ్ల నుంచి వందేళ్ల అవ్వల దాకా ఉన్నారు. మరీ అంత అతశయోక్తా అనుకోవద్దు.. జబర్దస్త్ దీవెన అయిదేళ్ల పిల్ల. మస్తానమ్మ గుర్తుంది కదా.. ఎలాంటి ప్రయాస లేకుండా కొత్తరకం వంటలను యూట్యూబ్‌లో రుచి చూపించిన ఆమె వందేళ్ల వయసులో యూట్యూబ్ స్టార్ అయ్యారు. ఈ క్రియేటివిటీలో మనవాళ్లకూ స్పేస్ ఉంది. మహాతల్లి జాహ్నవి, వరంగల్ వందన, ‘‘మై విలేజ్ షో’’ మిల్కూరి గంగవ్వ దాకా అందరూ స్టార్సే. మహాతల్లి జాహ్నవి ,మస్తానమ్మ తొలి తెలుగు ఫీమేల్ స్టార్ మహాతల్లి జాహ్నవి.. షోలోని తను వేసే క్యారెక్టరే ఆమె పరిచయనామంగా మారిన యూట్యూబ్ తొలి తెలుగు ఫిమేల్ స్టార్. దైనందిన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లన్నిటినీ స్పృశిస్తూ ఆమె షోస్ ఉంటాయి. నిఫ్ట్‌లో ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన జాహ్నవి మొదట్లో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ హరీష్ నాగరాజుతో కలిసి కొన్ని షార్ట్ఫిల్మ్స్కి పనిచేశారు. ‘‘మహాతల్లి.. మహానుభావుడు’’ అనే లఘు చిత్రంలో నటించారు. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు ‘‘మహాతల్లి’’ యూట్యూబ్ చానెల్‌నూ స్ట్రీమ్ లైన్ చేసింది. ‘‘ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. అయితే అదంత ఈజీ కాదు. కష్టపడితేనే కదా ఫలితం దక్కేది’’ అని ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు జాహ్నవి. మై విలేజ్ షో.. పేరు వినగానే ‘‘అనిలూ.. ఓ అనిలూ’’ అనే డైలాగ్, దాన్ని పలికే మిల్కూరి గంగవ్వే గుర్తొస్తుంది. స్వచ్ఛమైన తెలంగాణ యాస ఆమె ప్రత్యేకత. చదువురాదు.. కాని అలవోకగా డైలాగ్స్ చెప్పగలరు. ‘‘మై విలేజ్ షో’’ సక్సెస్‌లో గంగవ్వది ప్రధాన భాగస్వామ్యం అంటారు ఆ షో నిర్వాహకులు, టెక్నీషియన్స్, యాక్టర్స్ శ్రీకాంత్, అనిల్. గ్రామీణ జీవితం మీద వస్తున్న యూట్యూబ్ తెలుగు షో ‘మై విలేజ్ షో’. అందులోని ఆమె నటనకు తెలుగు లోగిళ్లన్ని జోహార్లు పలుకుతున్నాయి. ఆమె సొంతూరైన జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని లంబాడి పల్లి... ఆమెను చూడ్డానికి వచ్చే అభిమానులతో ఓ పర్యాటక కేంద్రంగా మారిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. యూట్యూబ్ స్టార్ కాకముందు ఆమె ఓ వ్యయసాయ కూలి. ముగ్గురు పిల్లలు. పెళ్లిళ్లు అయిపోయాయి. వాళ్లమ్మ నటనాచాతుర్యం, పేరుప్రఖ్యాతులకు ముచ్చటపడ్తున్నారు పిల్లలు. అన్నట్టు మిల్కూరి గంగవ్వకు సినిమా అవకాశాలూ వచ్చాయి.. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో. ‘‘నన్ను చూసేటందుకు హైద్రవాద్, దుబాయ్, మస్కట్ కెంచి వస్తుండ్రు. సంతోషంగా ఉంటది కదా మరి’’ అంటారు గంగవ్వ. అత్తాకోడళ్ల నుంచి జబర్దస్త్ దీవెన దాకా.. యోధ.. అనగానే రమ్య, వీళ్లద్దరూ నటించిన ‘‘అత్తాకోడళ్లు’’ అనే యూట్యూబ్ చానెల్ షో జ్ఞాపకమొస్తుంది. నాలుగేళ్ల కిందటి ముచ్చట ఇది. అప్పటికి ఈ ఇద్దరి వయసు పదేళ్లలోపే. రమ్య గడసరి అత్తగా, యోధ సొగసరి కోడలుగా.. అత్తాకోడళ్ల ఇష్యూస్ మీద పదుల సంఖ్యలో షోలు చేశారు. అందరినీ అలరించారు. ఇంటింటా అభిమానులను సంపాదించుకున్నారు. ఆరవ తరగతి చదువుతున్న యోధ ఇప్పుడు సినిమాలు, టీవీ షోస్‌తో బిజీ అయిపోయింది. అయినా యూట్యూబ్ చానెల్ షోస్‌ను వదల్లేదు. ఏ కొంచెం విరామం దొరికినా ‘జబర్దస్త్ దీవెన’ పేరు మీద షోస్ చేస్తూనే ఉంది. ఈ జబర్దస్త్ దీవెన ఎవరు? జబర్దస్త్‌లో రాకింగ్ రాకేశ్ టీమ్‌లో యోధాతోపాటు ఉన్న చిన్నమ్మాయి. ఈ అమ్మాయీ యూట్యూబ్ లిటిల్ స్టారే. ఈ ఇద్దరూ కలిసి ‘‘స్మాల్ కిచెన్’’, గేమ్స్, కొన్ని ఫన్నీ షోస్ చేస్తున్నారు. వీళ్ల చానెల్‌కు దాదాపు 60 వేల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ‘‘కెమెరా అంటే ఇష్టం మాకు. మేం ఆడుతున్నా.. పాడుతున్నా.. బొమ్మలు గీస్తున్నా.. అన్నట్టు నేను బొమ్మలు కూడా వేస్తాను.. అన్నిటినీ వీడియోలుగా కాన్సెప్ట్స్‌గా చేసి యూట్యూబ్‌లో పెడ్తూంటా’’ అంటుంది యోధ. దేశంలోనే టాప్.. నిషా మధులిక... మొదట్లో వంటల బ్లాగ్ రాసేవారు. తన అభిమానుల కోరిక మేరకు 2011లో, తన యాభై అయిదవ యేట యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించారు. టెక్నాలజీ అంటే యూత్ అనే అర్థాన్ని తిరగరాశారు. ఎంతోమంది గృహిణులకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రజక్తా కోలీ... తొలుత రేడియో జాకీ. తర్వాత యూట్యూబ్ కామిక్ చానల్‌ను మొదలుపెట్టారు. రాజకుమారి, రెక్కల గుర్రం, గ్రీకు వీరుడు అంటూ నమ్మశక్యంకాని కథలు చెప్పకుండా రోజూవారి జీవితంలోని సంఘటనలనే కథలుగా మలిచి చెప్తుంటారు. ఈమె కథలకు చెవులు కోసుకునే వాళ్లే కాదు.. కళ్లప్పగించే వాళ్లూ లక్షల్లో ఉన్నారు. త్రిష... యూట్యూబ్‌లో ఇంటి చిట్కాల చానెల్‌ను నడుపుతున్నారు. వంటింట్లోని వస్తువులతోనే చిట్కాలు చెప్తారు ఆమె. వీటికి ఎంత డిమాండ్ అంటే చానెల్ పెట్టిన యేడాదిలోపే పదిహేడు లక్షల మంది సబ్‌స్కైబర్స్ అయ్యారు. కోమల్ పాండే... ఫ్యాషన్ చానెల్‌ను రన్ చేస్తారు. షాపింగ్ జోలికి పోకుండా ఇదివరకే బీర్వాలో మూలుగుతున్న దుస్తులతో అప్డేట్గా ఎలా ముస్తాబవచ్చో చెప్తారు. ఆమె ‘రీ సైకిల్డ్ ఫ్యాషన్’ వీడియోస్ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటింటా ప్రతిభావంతులే! అందుకే వీళ్లంతా మనింట్లోవాళ్లుగానే అనిపిస్తారు. వీళ్లు తీసుకునే థీమ్స్ కూడా ఎప్పుడో ఒకప్పుడు మనకు తారసపడ్డవే.. తారసపడేవిగానే ఉంటాయి. కాబట్టే అంత కనెక్టివిటీ! కనుకే.. మనింటి తారలుగా వెలుగుతున్నారు. ఒక ఐడియా మన టాలెంట్‌ను బయటకు తెచ్చి.. జీవితాన్ని మార్చి యూట్యూబ్ స్టార్‌ని చేయొచ్చు. దాన్ని ఫ్రేమ్ చేయడానికి సెల్‌ఫోన్ కెమెరా చాలు.. ప్రదర్శించడానికి యూట్యూబ్ థియేటర్ ఉండనే ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ లాంటి గొడవ, పైసా ఖర్చు లేకుండా రాబడినీ పొందొచ్చు. ఆలస్యం ఎందుకు? మీరూ స్టార్లయిపోవచ్చు. రెడీ.. యాక్షన్!! -
‘గంగవ్వ’ ఎరుకనే కదా..!
సాక్షి, మల్యాల(పెద్దపల్లి): అచ్చమైన తెలంగాణభాష ఆమె సొంతం. అమాయకమైన చూపులు.. శివాలెత్తే మాటలకు కేరాఫ్‌గా నిలుస్తోంది మై విలేజ్ షో ఫేం గంగవ్వ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ దినసరి కూలీ. తనకు రాని నటనతోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మై విలేజ్‌షో అనే ఛానల్‌తో యూ ట్యూబ్ ఐకాన్‌గా మారింది. గంగవ్వ కనపడితే చాలు ఒక్క సెల్ఫీ అంటూ యువత పోటీ పడుతున్నారు. నటనతెలియని గంగవ్వకు ఏకంగా పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు ఆఫర్ ఇవ్వడం ఆమె ప్రతిభకు నిదర్శనం. వ్యవసాయ కూలీనుంచి.. మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన మిల్కూరి గంగవ్వ ఉరఫ్ మై విలేజ్ షో గంగవ్వ వ్యవసాయ కూలీ. డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ పట్టా పొందిన అదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ పల్లెటూరి సంస్కృతిని చాటిచెప్పేందుకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ఛానల్ను దాదాపు ఐదేళ్లక్రితం ప్రారంభించాడు. తమ ఇంటి సమీపంలో ఉండే గంగవ్వ హుషారుతనం.. చలాకీ మాటలు.. అచ్చ తెలంగాణభాషను గుర్తించాడు. తన ఛానల్లో నటించడానికి అవకాశం ఇచ్చాడు. అలా సాగిన తన ఐదేళ్ల ప్రస్థానంలో ఇప్పుడు గంగవ్వ లేనిదే మై విలేజ్‌షో లేదు అనేంతగా ఫేమస్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. గంగవ్వ మై విలేజ్ షో షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ఛానల్లో ఇప్పటి వరకు 100కు పైగా షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించింది. ప్రతీ వీడియోలో తన ప్రత్యేకతను చాటుకుంది. మొన్నటి సంకాంత్రికి భీమవరంలో కోడిపందాలకు పోటీలు, తరువాత వచ్చిన ఎన్నికల్లో తీరును విశ్లేషిస్తూ ‘సెటైరికల్‌గా సర్పంచ్ గంగవ్వ’, నిన్నటి శివరాత్రి మహాత్యం వివరించే శివరాత్రి జాగారణ పేరుతో యూట్యూబ్ వీడియోలు తీస్తూ తన యాస,మాట తీరుతో గుర్తింపు పొందింది. ఓ వార్తాఛానల్లోని ప్రోగ్రాంలో ఏడాదిపాటు నటించింది. మరో వార్తాఛానల్లో రెండు పండుగ ఎపిసోడ్లు చేసింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం నాడు ఏర్పాటుచేసే ‘సినీవారం’లో సత్కారం పొందింది. సినీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ సమంతను కలిసింది. వాళ్లే గంగవ్వ నటనను యూట్యూబ్‌లో చూసి ఆహ్వానించడం విశేషం. గంగవ్వతో ఒక్క సెల్ఫీ.. ఒక్కసారి నీ తిట్లతో దీవించు అంటూ గంగవ్వను వెతుక్కుంటూ వెళ్లి, గంగవ్వ మాటలు, తిట్లకు సంబరపడిపోతున్నారు యువత. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు గంగవ్వతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడుతున్నారు. పల్లెటూరి యాసతోపాటు మాటతో ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నుండి పట్నం దాకా ఎక్కడికివెళ్లినా గంగవ్వ ఒక్క సెల్ఫీ అంటూ ఎగబడుతున్నారు. చెప్పింది చేసుడే తెలుసు.. వ్యవసాయ పనికి పోయేదాన్ని. పని లేనప్పుడు బీడీలు చేసేదాన్ని. శ్రీకాంత్ మా వీడియోలో నటిస్తవా అని అడిగిండు. నాకు నటించుడు రాదు..నువ్వు చెప్పింది సేత్త అన్న. శ్రీకాంత్ చెప్పింది చెప్పినట్లు చేస్త గంతే. ఎవుసం పనిచేసుకునేదాన్ని తీసుకువచ్చి ప్రపంచానికి పరిచయం చేసిండు శ్రీకాంత్. సినిమాల్లో నటించు అంటే నా ఊరిని ఇడిసి ఎక్కడికి రాను అని చెప్పిన. మొన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ నన్ను పిలిచి సినిమాల నటించుమంటే నటించుడు రాదు సారు..మీరు చెప్పింది చెప్పినట్లు సేత్తా అంటే కొద్దిసేపు ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తీసుకున్నడు. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏ పనిచేసిన మంచిగనే ఉంటాం. – గంగవ్వ -
డయేరియాతో మహిళ మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం దుర్కి గ్రామంలో డయేరియాతో గంగవ్వ (50) అనే మహిళ గురువారం మృతి చెందింది. గ్రామంలో డయేరియా ప్రబలింది. దీంతో సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు గ్రామంలో మూడు రోజులు వైద్యశిబిరం నిర్వహించారు.అయితే గంగవ్వ ఈ రోజు మరణించింది. దాంతో బోధన్ ఆర్డీవో సుధాకర్ రెడ్డి గురువారం దుర్కి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులకు అందుతున్నసేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.