కళ అనేది ప్రేక్షకుడికి ఆనందం, కళాకారుడికి జీవితం ఇస్తుంది. ఏ కళాకారుడైనా తన కళను నమ్ముకునే జీవిస్తాడు. ముఖ్యంగా నేటి కళాకారులు తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ కష్టాన్ని, నష్టాన్ని బేరీజు వేసుకోకుండా ఆఖరికి తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టి కళకు అంకితమవుతున్నారు. కానీ దురదృష్ణమేమిటంటే ఎంతటి కళాకారులనైనా కనుమరుగు చేస్తూ క్యాష్ చేసుకుంటుంది బిగ్ బాస్ లాంటి కార్యక్రమం. అదెలాగంటారా చూడండి...
ఇమేజ్ పెంచుకోవడానికే..
బిగ్ బాస్ కార్యక్రమం దాదాపు 8 సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయం. 8 సీరిస్ లలో వచ్చిన పార్టిసిపెంట్స్ మళ్ళీ ఎక్కడా కనబడట్లేదు. కనీసం విన్నర్స్ ఎవరైనా ఎక్కడైనా కనబడతారనుకున్నా పొరపాటే. బిగ్‌బాస్ కార్యక్రమ రూపేణా ప్రేక్షకాదరణ విపరీతంగా ఉంటుంది. దాన్ని చూసే ప్రతి కళాకారుడు బిగ్‌బాస్‌కు వెళ్ళి తన ఇమేజ్ పెంచుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే తాను బిగ్ బాస్ బ్యాలెన్స్ పెంచుతాడే కానీ తన ఇమేజ్ డామేజ్ కాకుండా చూసుకోలేడు.అదెలాగో ఇంకాస్త వివరంగా చెబుకుందాం.
హౌస్‌లో గిల్లికజ్జాలు
బిగ్ బాస్ హౌస్ అంటే ఏమిటి ? ఏ సంబంధం లేని నలుగురు పబ్లిక్ ఇమేజ్ ఉన్నవాళ్ళని ఓ ఇంట్లో పెట్టి, వారి మధ్య టాస్కుల పేరుతో గిల్లికజ్జాలు పెట్టి, వారు కొట్టుకుంటే చూసే ప్రేక్షకుడితో తన గల్లా పెట్టి నింపుకునేదే ఈ బిగ్ బాస్ వ్యాపార సూత్రం. సాధారణంగా రోడ్డు మీద ఎవరైనా అనామకుడితో మనకు చిన్న పాటి ప్రమాదం జరిగినా చెలరేగిపోతాం. అటువంటి సమయంలో చుట్టూ వచ్చి పోయే వాళ్ళు ఆగి మరీ మన కొట్లాట వేడుకలా చూసి ఆనందిస్తారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో జరిగేది కూడా అదే!
గొడవపడితే ఏమవుతుంది?
తెలియని అనామకుడితో జరిగే గొడవ మనకు కాస్తంత అసహనం ఇచ్చినా గొడవపడతాం, అలాంటిది కోట్లాది మంది చూస్తున్నారన్న విషయం తెలిసి కూడా అదుపు తప్పి తోటి పార్టిసిపెంట్స్‌తో గొడవ పడినపుడు ఏమవుతుంది? మహా అయితే బిగ్‌బాస్ చిల్లర రెమ్యునరేషన్ రూపంలో విదిలిస్తాడు, కానీ తన ఇమేజ్‌ను ఈ కాస్త చిల్లర కోసం పాడు చేసుకుంటున్నామన్న విషయం గ్రహించలేకపోతున్నారు ఇప్పటి పార్టిసిపెంట్స్.
గంగవ్వ ఎలిమినేషన్
ఈ వారం విశ్లేషణ అంతా పైన విషయంలోనే వుంది. ఇక చెప్పుకోవాల్సిన అంశాలేమైనా ఉన్నాయి అంటే వైల్డ్ ఎంట్రీగా వచ్చిన గంగవ్వ సైలెంట్‌గా అనారోగ్య కారణాలతో ఎగ్జిట్ అయింది. బిగ్‌బాస్ కార్యక్రమాన్ని మొత్తంగా హరికథ రూపేణా పొగిడించుకుని వారాంతంలో హరితేజకు హ్యాండిచ్చి ఎలిమినేట్ చేశాడు బిగ్‌బాస్.
బిగ్ డ్యామేజ్
వారాంతంలో జంబలకిడిపంబ పేరుతో పార్టిసిపెంట్స్‌ను లింగ వేషధారణతో జుగుప్సాకరమైన డ్యాన్సులు హావభావాలతో రసాభాస చేసి ఈ వారానికి మమ అనిపించారు. ఏదేమైనప్పటికీ బిగ్‌బాస్ అన్నది బిగ్ డ్యామేజ్ అన్న విషయం చూసే ప్రేక్షకులు ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ పార్టిసిపెంట్స్ అయినా ఎప్పటికి గ్రహిస్తారో ఏమో!
-ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment