నిర్భయ నిందితులకు ఉరిశిక్షను స్వాగతించిన యూఎస్
నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు న్యూఢిల్లీలోని సత్వర న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని అమెరికా స్వాగతించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మెరీ హర్ఫ్ శనివారం వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కోర్టు తీర్పు మానవ మృగాలకు ఓ చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. ఆ తీర్పుతో భారత న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందని ఆమె అన్నారు.
భారత్లోనే కాకుండే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దాడులను ఆరికట్టేందుకు మరింత కఠినమైన చట్టాలు తేవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ కూడా నిర్భయ నిందితులకు విధించిన శిక్షను సమర్థించారు. లింగ ఆధారిత హింస అనేది ప్రస్తుత ప్రపంచంలో అంటుజాడ్యంలా విస్తరించిందని అన్నారు. నిర్భయ మృత్యుముఖంలోకి జారుకునే వరకు మృత్యువుతో పోరాడిన ధీరవనిత అని జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు.
గతేడాది డిసెంబర్ 16న భారత దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫార్మసీ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నిర్భయతోపాటు ఆమె స్నేహితుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆ ప్రమాదంలో నిర్భయ తీవ్రంగా గాయపడి, న్యూఢిలీ ఆసుపత్రిలో చికిత్స పొందింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో మరింత మెరుగైన వైద్యం కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సింగపూర్ తరలించింది.
అక్కడ చికిత్స పొందుతూ గతేడాది డిసెంబర్ 29న మృత్యు ముఖంలోకి జారుకుంది. ఆ క్రమంలో న్యూఢిల్లీతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు పెల్లుబికాయి. దీంతో భారత ప్రభుత్వం నిర్భయ కేసుపై ప్రత్యేక న్యాయ స్థానం ఏర్పాటు చేసింది. ఆ కేసులో ఆరుగురు నిందితుల్లో నలుగురుకి శుక్రవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. మరో ఇద్దరు నిందితుల్లో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకుని మరణించగా,మరోకరు బాలనేరస్థుడుని జువైనెల్ కోర్టు మూడేళ్ల కారగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే.