Gantyada
-
గంట్యాడ ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా
సాక్షి, విజయనగరం : గంట్యాడలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా రావడం పట్ల డిప్యూటీ సీఎం , వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం స్పందించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ అంశంపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కరోనా సోకిన 20 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో మొత్తం 108 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. అయితే కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని డీఎమ్‌హెచ్‌వోను కూడా సూచించినట్లు తెలిపారు. (చదవండి : ఏపీలో 60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు) ఒకవేళ కరోనా సోకిన విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే హోంక్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ క్వారంటైన్లో ఉండే విద్యార్థులకు ప్రతి రోజు వైద్య బృందం వారి ఆరోగ్యం పై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్న కోవిడ్ విద్యార్థులకు ప్రత్యేక మెడికల్ కిట్స్ అందచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.కరోనా సోకకుండా అన్ని పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్స్ వినియోగించే విధంగా అవగాహన కల్పించాలని కోరుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
చెరువులో జారి చిన్నారుల మృత్యువాత
గంట్యాడ (గజపతినగరం): బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడి మృతిచెందిన సంఘటన బుధవారం విజయనగరం జిల్లాలో విషాదం నింపింది. గంట్యాడ మండలం నరవలో గేదెల మనోజ్ (9), రొంగలి శేఖర్ (10), రొంగలి వాసు (8) మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బహిర్భూమికి వెళ్లారు. సాయంత్రం పొలం పనుల నుంచి వచ్చిన వారి తల్లిదండ్రులు పిల్లలు కనిపించకపోవడంతో వెదకసాగారు. పిల్లలు చెరువు వైపు వెళ్లడం చూశామని గ్రామస్తుడొకరు చెప్పడంతో అనుమానం వచ్చి చెరువులో వెదికారు. పిల్లలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని విగతజీవులుగా కనిపించారు. మనోజ్‌ది బుడతనాపల్లి. అతడి తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం విశాఖలో ఉంటున్నారు. ఇటీవల నరవలో ఒక వివాహానికి కుమారుడితో సహా వచ్చారు. గ్రామంలో కూలిపనులు దొరకడంతో ఇక్కడే ఉంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
తాటిపూడి జలాశయంలో ముగ్గురి గల్లంతు
గంట్యాడ (విజయనగరం జిల్లా) : గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతులు విశాఖపట్నం జిల్లా సింహాచలానికి చెందినవారుగా గుర్తించారు. మొత్తం ఏడుగురు కుటుంబసభ్యులు విహారయాత్రకు వెళ్లారు. స్నానానికి దిగిన సమయంలో ఈత రాకపోవడంతో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు మునిగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బాదం చెట్టెక్కి.. షాక్‌తో విద్యార్థి మృతి
అందివస్తాడనుకున్న కొడుకు అర్ధంతరంగా అందని తీరాలకు చేరుకోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని వారు కన్న కలలన్నీ కల్లలవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఆనందంగా సాగిపోతున్న తమ జీవితంలో విద్యుత్తీగ రూపంలో విషాదం చోటు చేసుకుందని తల్లడిల్లిపోతున్నారు. కళ్లెదుటే కన్నకొడుకును కోల్పోయిన వారిని చూసి గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. * విద్యుత్‌వైరు తాకి విద్యార్థి మృతి * బాదం పిక్కలకోసం చెట్టెక్కి మృత్యువాత * మరొకరికి తీవ్ర గాయూలు * గుండెలవిసేలా రోదిస్తున్న కన్నవారు * జయితిలో విషాదఛాయలు జయితి (మెంటాడ) : విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి నిండు ప్రాణం గాలిలో కలిసిపోగా, మరో విద్యార్థి తీవ్ర గాయూల పాలైన సంఘటన మండలంలోని జరుుతి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నారుు. గ్రామానికి చెందిన గెద్ద నాగరాజు(ఏడో తరగతి), మన్నెపురి సురేష్(ఆరో తరగతి) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఒంటిపూట బడులు కావడంతో 12.30 గంటల సమయంలో స్కూల్ వదిలేశారు. వెంటనే ఆ ఇద్దరు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి బ్యాగులు పెట్టేసి బాదం పిక్కల కోసం గ్రామ సమీపంలో ఉన్న మల్లికార్జునస్వామి ఆలయూనికి సుమారు రెండున్నర గంటల సమయంలో వెళ్లారు. అక్కడున్న బాదం చెట్టు ఎక్కి పిక్కలు తీస్తుండగా చెట్టుకు ఆనుకుని వెళ్తున్న విద్యుత్ వైర్లు తగిలి నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, సురేష్ మాత్రం తీవ్ర గాయూలతో కింద పడిపోయూడు. వెంటనే స్థానికులు 108కి సమాచారం ఇచ్చి సురేష్‌ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆండ్ర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్పృహ కోల్పోయిన నాగరాజు తల్లి మృతుడి తల్లిదండ్రులు అప్పలనాయుడు, లక్ష్మి, నాన్నమ్మ పాపమ్మలను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కుమారుడి మృతదేహం చూసిన తల్లి లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నాగరాజు అన్నయ్య శంకరరావు గజపతినగరంలో ఇంటర్ చదువుతున్నాడు. విద్యార్థుల కుటుంబాలను విద్యుత్ శాఖాధికారులు, కాంట్రాక్టర్ ఆదుకోవాలని వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. -
వివాహితపై లైంగిక దాడికి యత్నం
గంట్యాడ: మండలంలోని డికెపర్తి పంచాయతీ అడ్డతీగలో ఓ వివాహిత(30)పై అదేగ్రామానికి చెందిన రౌతు అంజిబాబు అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించినట్లు బాధితురాలు సోమవారం గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు గంట్యాడ ఎస్సై షేక్షరీప్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతనెల 25వతేదీన బాధితురాలి భర్త జామి ఎల్లమాంబ పండగకు వెళ్లాడని అదేరోజు రాత్రి 9గంటల సమయంలో కొడుకు వరస అయిన అంజిబాబు తనపై లైంగికదాడికి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భయంతో కేకలు పెట్టగా జనం వచ్చేసరికి పరారయ్యాడని తెలిపింది. -
బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంతో నష్టం
గంట్యాడ: మండలంలోని లక్కిడాం ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ శంకర సూర్యారావు నిర్య్లక్షం కారణంగా నష్టపోయామంటూ బ్యాంక్ పరిధిలో గల సుమారు 10గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగారు. తొలివిడత రైతు రుణమాఫీ ఎస్బీఐ బ్రాంచ్పరిధిలో 497మందికి వర్తించింది. ఇందులో 300మందికి పైగా రైతులకు రూ.10లోపు రుణమాఫీ రావడం బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యమేనని రైతులు ఆందోళనవ్యక్తం చేశారు. బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యం వల్లనే రుణమాఫీ వర్తించలేదని వాపోయారు. బ్యాంకులో లోను పెట్టుకున్నప్పుడు పాస్‌పుస్తకాలతోపాటు మీసేవ కార్యాలయంలో తీసిన అడంగల్, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులు జతచేశామని తెలిపారు.ప్రస్తుతం వచ్చిన రుణమాఫీలో పాస్‌పుస్తకంలో చూపిన విస్తీర్ణం ఇప్పుడు లేదని 0నుంచి 5సెంట్లవరకు మాత్రమే విస్తీర్ణం ఉన్నట్లు చూపారన్నారు. సెంట్ల భూమి ఉంటే వేలకొద్దీరుణం ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకుడు,సిరిపురం ఎంపీటీసీ సభ్యుడు పి.జైహింద్‌కుమార్ మాట్లాడుతూ రైతులపట్ల బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. లోనుకోసం బ్యాంకు చుట్టూ తిప్పి రుణమాఫీ వచ్చేసరికి నిలువునా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మేనేజర్‌ను వివరణ అడిగినా సరైన సమాధానం చెప్పడంలేదన్నారు.ఇంత అన్యాయం జరుగుతున్నా అధికారులు, అధికార పార్టీ నాయకులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సిరిపురం,చంద్రంపేట,రావివలస,లక్కిడాం తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.