బాప్రే.. గ్యాప్
నిబంధనలు పట్టించుకోని ప్రభుత్వం
గ్యాప్ ఏరియాలో పోలీసు బందోబస్తుతో సర్వేకు సన్నాహలు
అటవీ శాఖకు భూముల బదిలీకి ఏర్పాట్లు
అలా జరిగితే తమ బతుకులు ప్రశ్నార్థకమేనని గిరిజనుల ఆందోళన
నాతవరం: పోలీసు బందోబస్తుతో గ్యాప్ ఏరియా భూములు సర్వే చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించిన తరువాతే గ్యాప్ ఏరియా భూములు సర్వే చేయాలన్న గిరిజనుల డిమాండ్‌ను ఫ్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపించడంలేదు. ప్రభుత్వం అనుకున్నట్లే గ్యాప్ ఏరియా భూములు అటవీ శాఖకు అప్పగిస్తే తమ జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పూర్వం నుంచి సాగు చేసుకుంటున్న కొండపోడు బంజరు భూములకు పట్టాలు, హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనులు ఏళ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నా ఇక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు. సరుగుడు పంచాయతీని అనుకొని ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో సాగు చేసుకుంటున్న అసనగిరి, తొరడ, కొత్త దద్దుగుల, ముంతమామిడిలొద్దు గ్రామాల గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు, పట్టాలు, పాసు పుస్తకాలు అక్కడి రెవెన్యూ అధికారులు ఇచ్చారు. విశాఖ జిల్లాలో సరుగుడు పంచాయతీలో భూములు సాగుచేసుకొని జీవనం సాగిస్తున్న 16 గ్రామాల గిరిజనులకు మాత్రం నేటికీ ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు.
ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం గ్యాప్ ఏరియా భూములుగా పరిగణించి అటవీ శాఖకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. వాస్తవంగా ఈ ప్రాంతం 5వ షెడ్యూల్డు ఏరియాతో పాటు 1/70 యాక్టు, పీసా చట్టం అమలులో ఉన్నాయి. నాలుగు నెలల క్రితం గ్రామాల్లో పీసా చట్టం అమలు కోసం అధికారులు ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీని కూడా నియమించారు. పీసా చట్ట ప్రకారం పంచాయతీలకు నిధులు కూడా మంజూరు చేశారు. ఈ నేపధ్యంలో తమ హక్కులను తుంగలో తొక్కి గ్యాప్ ఏరియా భూములు సర్వే చేయడానికి వెళ్లిన సర్వేయర్లను గిరిజనులు మూకుమ్మడిగా అడ్డగించారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ విశాఖలోని తన కార్యాలయానికి గిరిజన పెద్దల్ని రప్పించి చర్చించారు. పీసా చట్ట ప్రకారం గిరిజనుల అభీష్టం మేరకే పనులు చేయాలి. పూర్వం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, హక్కు పత్రాలు ఇవ్వాలి. పాడేరు ఐటీడీఏ ద్వారా గిరిజనులకు కల్పించే సదుపాయాలు ఈ ప్రాంత గిరిజనులకు కూడా కల్పించాలి. సరుగుడు పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలకు తాగునీరు, విద్య, రహదారి, వైద్య సదుపాయాలు కల్పించాలి, గిరిజనులకు ఎలాంటి హాని జరగకుండా గ్యాప్ ఏరియా భూములు అటవీ శాఖకు బదిలీ చేయాలని జాయింట్ కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నారు.
ఇప్పుడు ఈ డిమాండ్లేవీ పరిష్కరించకుండా ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి భూములను సర్వే చేసి అటవీ శాఖకు అప్పగించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే అక్కడి గిరిజనులకు పోలీసులు, రెవెన్యూ అధికారుల నుంచి హెచ్చరికలు కూడా వెళ్లాయి. నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు గిరిజన పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుతగలరాదని సూచించారు. గిరిజనులు మొండిగా వ్యవహరిస్తే పోలీసు బందోబస్తుతో పనులు చేయడం ఖాయమని ఆయన స్వయంగా హెచ్చరికలు చేశారు. ఇదే జరిగితే ఎప్పటినుంచో నివాసముంటున్న తమ గ్రామాలకు, సాగుచేసుకుంటున్న భూములకు తాము దూరమవుతామని గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు.