Gareth Bale
-
బేల్ X రొనాల్డో
* వేల్స్, పోర్చుగల్ సెమీస్ పోరు * యూరో కప్ లియోన్: గ్యారెత్ బేల్, క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విలువైన ఆటగాళ్లే కాకుండా తమ ఆటతో అభిమానులను మంత్రముగ్ధులను చేయగల సత్తా ఉన్నవారు. స్పానిష్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ తరఫున ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలిసే ఆడతారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఎవరి బలమేమిటో.. బలహీనత ఏమిటో ఇరువురికి మంచి అవగాహన ఉంది. గత మూడేళ్లలో వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా రియల్ మాడ్రిడ్ రెండు చాంపియన్స్ లీగ్ టైటిళ్లను దక్కించుకోగలిగింది. అయితే ఇప్పుడు తమ జట్ల ఆశలను మోస్తూ ప్రత్యర్థులుగా ఎవరు గొప్పో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. యూరో కప్‌లో భాగంగా నేటి (బుధవారం) రాత్రి వేల్స్, పోర్చుగల్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. నిజానికి ఈ మ్యాచ్‌ను రెండు జట్ల మధ్య కాకుండా ఇద్దరి స్టార్ల షోగానే అంతా భావిస్తున్నారు. ఇక తమ సంచలన ప్రదర్శనతో గత 50 ఏళ్లలో ఓ మేజర్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి బ్రిటిష్ జట్టుగా చరిత్ర సృష్టించాలని వేల్స్ ఉవ్విళ్లూరుతుండగా... కిందా మీదా పడుతూ ఇక్కడిదాకా వచ్చిన పోర్చుగల్ ఈ మ్యాచ్‌లోనైనా స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి టైటిల్ వేటలో నిలవాలని భావిస్తోంది. జోష్‌లో వేల్స్ ఇప్పటికే ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను క్వార్టర్స్‌లో కంగుతినిపించి తామేమిటో వేల్స్ నిరూపించుకుంది. ఆ మ్యాచ్‌లో బేల్ పెద్దగా రాణించకపోయినా సమష్టి కృషితో సెమీస్‌కు రాగలిగింది. అయితే అంతకుముందు మ్యాచ్‌ల్లో తను చూపిన ప్రతిభ అద్భుతం. ఇప్పటికే మూడు గోల్స్‌తో జోరుమీదున్నాడు. నిజానికి వేల్స్ ఇక్కడిదాకా రాగలుగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ తమ గ్రూప్‌లో టాప్‌లో నిలిచింది. అలాగే బెల్జియంపై 3-1తో నెగ్గి అందరికీ షాక్ ఇచ్చింది. హల్ రాబ్సన్-కను సూపర్ ఫామ్ ఇక్కడా కొనసాగితే పోర్చుగల్‌కు ఇబ్బందులు తప్పవు. కానీ మిడ్‌ఫీల్డర్ ఆరోన్ రామ్సే, డిఫెండర్ బెన్ డేవిస్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చు. రామ్సే స్థానంలో ఇప్పటిదాకా బెంచికే పరిమితమైన ఆండీ కింగ్‌ను ఆడించనున్నారు. రొనాల్డో ఫామ్ కీలకం మరోవైపు పోర్చుగల్ ఆటతీరు సెమీస్ వరకు అంత అద్భుతంగా సాగలేదనే చెప్పవచ్చు. నిర్ణీత 90 నిమిషాల్లో ఇప్పటిదాకా ఒక్క గోల్ కూడా చేయకుండా సెమీస్‌కు చేరింది. తమ గ్రూప్ మ్యాచ్‌లన్నీ డ్రాగానే ముగిశాయి. క్వార్టర్స్‌లో పెనాల్టీ షూటవుట్‌తో నెగ్గింది. జట్టు ఒత్తిడినంతా భరిస్తున్న రొనాల్డో.. హంగెరీతో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి నాలుగు యూరో కప్‌లలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అయితే ఐస్లాండ్, ఆస్ట్రియా, క్రొయేషియా, పోలండ్లపై విఫలమయ్యాడు. అతడి ఫామ్‌లేమి జట్టును ఆందోళనపరుస్తోంది. ఈసారైనా తన హోదాకు తగ్గ ఆటతీరును ప్రదర్శించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. తను మరో గోల్ సాధిస్తే యూరో చరిత్రలో తొమ్మిది గోల్స్ చేసిన మైకేల్ ప్లాటిని సరసన నిలుస్తాడు. డిఫెండర్ పెపే గాయం కారణంగా ఆడేది అనుమానంగా మారింది. మైదానంలోకి పిల్లల్ని తేకండి పారిస్: మ్యాచ్‌ను గెలిచిన ఆనందంలో తమ భార్యా పిల్లలతో మైదానంలో సంబరాలు జరుపుకోవడం ఇక కుదరదని యూరో చాంపియన్‌షిప్ నిర్వాహకులు తేల్చి చెప్పారు. క్వార్టర్స్‌లో బెల్జి యంపై విజయంతో సంచలనం సృష్టించిన అనంతరం వేల్స్ ఆటగాళ్లు తమ పిల్లలను మైదానంలోకి తీసుకొచ్చి ఎంజాయ్ చేశారు. ‘ఇది యూరో చాంపియన్‌షిప్. ఫ్యామిలీ పార్టీ ఎంతమాత్రం కాదు. చిన్న పిల్లలకు స్టేడియం అంత సురక్షితమైనది కాదు. ఒకవేళ అభిమానులు ఫీల్డ్ పైకి వస్తే వారి భద్రత పరిస్థితి ఏమిటి? మేం ఎలా సమాధానం చెప్పుకోవాలి?’ అని టోర్నీ డెరైక్టర్ మార్టిన్ కాల్లెన్ ప్రశ్నించారు. -
వేల్స్ వండర్
యూరోలో సెమీస్‌కి... క్వార్టర్స్‌లో 3-1తో బెల్జియంపై విజయం యూరో కప్ అరంగేట్రంలోనే వేల్స్ జట్టు అనూహ్య రీతిలో అదరగొడుతోంది. ఇప్పటిదాకా తాము సాధించిన విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ ఏకంగా ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టించింది. స్టార్ ఫుట్‌బాలర్ గ్యారెత్ బేల్ మెరుపులు మెరిపించకున్నా సమష్టి ఆటతీరుతో అన్ని విభాగాల్లో రాణించిన వేల్స్ సగర్వంగా సెమీఫైనల్లోకి ప్రవేశించి కొత్త చరిత్రను సృష్టించుకుంది. లిల్లే: ఓ పెద్ద టోర్నీలో 58 ఏళ్ల తర్వాత ఆడుతున్న వేల్స్ జట్టు ఎవరి అంచనాలకూ అందని రీతిలో యూరో కప్ సెమీఫైనల్లో ప్రవేశించింది. మిడ్‌ఫీల్డర్ హల్ రాబ్సన్ కను కళ్లుచెదిరే గోల్ సహా యంతో శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఫేవరెట్ బెల్జియంపై 3-1తో వేల్స్ నెగ్గింది. వేల్స్ నుంచి అష్లే విలియమ్స్ (31వ నిమిషంలో), రాబ్సన్ (55), వోక్స్ (86) గోల్స్ చేయగా బెల్జియం నుంచి రడ్జా నైన్గోలన్ (13) ఏకైక గోల్ సాధించాడు. 2014 ప్రపంచకప్‌లోనూ బెల్జియం క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈనెల 6న పోర్చుగల్‌తో జరిగే సెమీఫైనల్లో వేల్స్ తలపడుతుంది. తమ సరిహద్దుకు కేవలం వంద కి.మీ దూరంలోనే ఉన్న ఈ స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించేందుకు బెల్జియం నుంచి ఏకంగా లక్షా 50 వేల మంది లిల్లే నగరానికి వచ్చారు. స్టేడియంలో మెజారిటీ అభిమానుల మద్దతుతో ఆరంభంలో బెల్జియం చెలరేగి ఆడింది. మ్యాచ్ తొలి 20 నిమిషాలు బెల్జియందే హవా నడిచింది. ఈ సమయంలో థామస్ మునియర్, యానిక్ కరాస్కో, ఈడెన్ హజార్డ్ గోల్స్ ప్రయత్నాలు తృటిలో తప్పాయి. అయితే 13వ నిమిషంలో హజార్డ్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న రడ్జా 30 గజాల దూరం నుంచి టాప్ లెఫ్ట్ కార్నర్ ద్వారా బెల్జియం కు ఆధిక్యాన్నిచ్చాడు. ఈ షాక్ నుంచి త్వరగానే కోలుకున్న వేల్స్ 31వ నిమిషంలో స్కోరును సమం చేసింది. ఆరోన్ రామ్సే రైట్ వింగ్ కార్నర్ నుంచి ఇచ్చిన పాస్‌ను అష్లే విలియమ్స్ హెడర్ ద్వారా గోల్ చేసి జట్టులో సంతోషం నింపాడు. ఇక ఇక్కడి నుంచి బెల్జియం వ్యూహాలు ఏమాత్రం పనిచేయలేదు. ముఖ్యంగా వీరి బ్యాక్‌లైన్ సమన్వయలోపాన్ని వేల్స్ సొమ్ము చేసుకుంది. ద్వితీయార్ధం 55వ నిమిషంలో ఔరా అనే రీతిలో రాబ్సన్ చేసిన వరల్డ్ క్లాస్ గోల్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లిష్ సెకండ్ టైర్ క్లబ్లో ఆడే ఈ ఆటగాడు... రామ్సే క్రాస్‌ను అందుకుని పెనాల్టీ ఏరియాలో బెల్జియం ముగ్గురు డిఫెండర్లను వెనక్కీ ముందుకు ఏమార్చుతూ బంతిని అతి వేగంగా నెట్లోకి పంపడంతో వేల్స్ సంబరాలు మిన్నంటాయి. అనంతరం 64వ నిమిషంలో బెల్జియంకు ఫ్రీకిక్ లభించినా వినియోగించుకోలేకపోయింది. 75వ నిమిషంలో ఆరోన్ రామ్సే ఎల్లో కార్డ్ అందుకోవడంతో తను సెమీస్‌కు దూరం కానున్నాడు. ఇక చివర్లో క్రిస్ గుంటర్ ఇచ్చిన క్రాస్ షాట్‌ను గాల్లోనే అందుకున్న వోక్స్ తలతో చేసిన గోల్‌తో వేల్స్ ఆధిక్యం మరింత పెరిగింది. ఇంజ్యూరీ సమయంలో హజార్డ్ ప్రయత్నాలు విఫలం కావడంతో బెల్జియం పరాజయం ఖాయమైంది. 1ఓ మేజర్ టోర్నీలో సెమీస్‌కు చేరడం వేల్స్‌కు ఇదే తొలిసారి 2 స్వీడన్ (1992లో) అనంతరం అరంగేట్రంలోనే సెమీస్‌కు చేరిన రెండో జట్టు వేల్స్. 3ఈ మ్యాచ్‌లో వేల్స్ తరఫున గోల్స్ చేసిన ముగ్గురూ ఇంగ్లండ్‌లోనే జన్మించారు -
బేల్ గోల్ చేసినా...
మాడ్రిడ్ (స్పెయిన్): ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన గారెత్ బేల్... రియల్ మాడ్రిడ్ తరఫున అరంగేట్రం చేశాడు. స్పెయిన్ లీగ్ ‘లా లీగా’లో భాగంగా శనివారం విల్లార్ రియల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతను బరిలోకి దిగి ఓ గోల్ సాధించాడు. అయితే రియల్ మాడ్రిడ్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో ‘డ్రా’ అయ్యింది. ఆట 50వ నిమిషంలో డాని కార్వాజల్ ఇచ్చిన క్రాస్‌ను అద్భుతంగా గోల్‌పోస్ట్‌లోకి పంపిన బేల్ ఆ తర్వాత మైదానంలో నుంచి బయటకు వచ్చాడు. అతని స్థానంలో అంజెల్ డి మారియో ఆడాడు. ఈ నెలారంభంలో విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ రూ. 878 కోట్లు వెచ్చించి బేల్‌ను టోటెన్హామ్ హాట్స్పర్ క్లబ్ నుంచి కొనుగోలు చేసింది.