గ్యారెత్ బేల్, క్రిస్టియానో రొనాల్డో
* వేల్స్, పోర్చుగల్ సెమీస్ పోరు
* యూరో కప్
లియోన్: గ్యారెత్ బేల్, క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విలువైన ఆటగాళ్లే కాకుండా తమ ఆటతో అభిమానులను మంత్రముగ్ధులను చేయగల సత్తా ఉన్నవారు. స్పానిష్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ తరఫున ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలిసే ఆడతారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఎవరి బలమేమిటో.. బలహీనత ఏమిటో ఇరువురికి మంచి అవగాహన ఉంది. గత మూడేళ్లలో వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా రియల్ మాడ్రిడ్ రెండు చాంపియన్స్ లీగ్ టైటిళ్లను దక్కించుకోగలిగింది.
అయితే ఇప్పుడు తమ జట్ల ఆశలను మోస్తూ ప్రత్యర్థులుగా ఎవరు గొప్పో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. యూరో కప్‌లో భాగంగా నేటి (బుధవారం) రాత్రి వేల్స్, పోర్చుగల్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. నిజానికి ఈ మ్యాచ్‌ను రెండు జట్ల మధ్య కాకుండా ఇద్దరి స్టార్ల షోగానే అంతా భావిస్తున్నారు. ఇక తమ సంచలన ప్రదర్శనతో గత 50 ఏళ్లలో ఓ మేజర్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి బ్రిటిష్ జట్టుగా చరిత్ర సృష్టించాలని వేల్స్ ఉవ్విళ్లూరుతుండగా... కిందా మీదా పడుతూ ఇక్కడిదాకా వచ్చిన పోర్చుగల్ ఈ మ్యాచ్‌లోనైనా స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి టైటిల్ వేటలో నిలవాలని భావిస్తోంది.
జోష్‌లో వేల్స్
ఇప్పటికే ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను క్వార్టర్స్‌లో కంగుతినిపించి తామేమిటో వేల్స్ నిరూపించుకుంది. ఆ మ్యాచ్‌లో బేల్ పెద్దగా రాణించకపోయినా సమష్టి కృషితో సెమీస్‌కు రాగలిగింది. అయితే అంతకుముందు మ్యాచ్‌ల్లో తను చూపిన ప్రతిభ అద్భుతం. ఇప్పటికే మూడు గోల్స్‌తో జోరుమీదున్నాడు. నిజానికి వేల్స్ ఇక్కడిదాకా రాగలుగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ తమ గ్రూప్‌లో టాప్‌లో నిలిచింది.
అలాగే బెల్జియంపై 3-1తో నెగ్గి అందరికీ షాక్ ఇచ్చింది. హల్ రాబ్సన్-కను సూపర్ ఫామ్ ఇక్కడా కొనసాగితే పోర్చుగల్‌కు ఇబ్బందులు తప్పవు. కానీ మిడ్‌ఫీల్డర్ ఆరోన్ రామ్‌సే, డిఫెండర్ బెన్ డేవిస్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చు. రామ్‌సే స్థానంలో ఇప్పటిదాకా బెంచికే పరిమితమైన ఆండీ కింగ్‌ను ఆడించనున్నారు.
రొనాల్డో ఫామ్ కీలకం
మరోవైపు పోర్చుగల్ ఆటతీరు సెమీస్ వరకు అంత అద్భుతంగా సాగలేదనే చెప్పవచ్చు. నిర్ణీత 90 నిమిషాల్లో ఇప్పటిదాకా ఒక్క గోల్ కూడా చేయకుండా సెమీస్‌కు చేరింది. తమ గ్రూప్ మ్యాచ్‌లన్నీ డ్రాగానే ముగిశాయి. క్వార్టర్స్‌లో పెనాల్టీ షూటవుట్‌తో నెగ్గింది. జట్టు ఒత్తిడినంతా భరిస్తున్న రొనాల్డో.. హంగెరీతో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి నాలుగు యూరో కప్‌లలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
అయితే ఐస్‌లాండ్, ఆస్ట్రియా, క్రొయేషియా, పోలండ్‌లపై విఫలమయ్యాడు. అతడి ఫామ్‌లేమి జట్టును ఆందోళనపరుస్తోంది. ఈసారైనా తన హోదాకు తగ్గ ఆటతీరును ప్రదర్శించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. తను మరో గోల్ సాధిస్తే యూరో చరిత్రలో తొమ్మిది గోల్స్ చేసిన మైకేల్ ప్లాటిని సరసన నిలుస్తాడు. డిఫెండర్ పెపే గాయం కారణంగా ఆడేది అనుమానంగా మారింది.
మైదానంలోకి పిల్లల్ని తేకండి
పారిస్: మ్యాచ్‌ను గెలిచిన ఆనందంలో తమ భార్యా పిల్లలతో మైదానంలో సంబరాలు జరుపుకోవడం ఇక కుదరదని యూరో చాంపియన్‌షిప్ నిర్వాహకులు తేల్చి చెప్పారు. క్వార్టర్స్‌లో బెల్జి యంపై విజయంతో సంచలనం సృష్టించిన అనంతరం వేల్స్ ఆటగాళ్లు తమ పిల్లలను మైదానంలోకి తీసుకొచ్చి ఎంజాయ్ చేశారు. ‘ఇది యూరో చాంపియన్‌షిప్. ఫ్యామిలీ పార్టీ ఎంతమాత్రం కాదు. చిన్న పిల్లలకు స్టేడియం అంత సురక్షితమైనది కాదు. ఒకవేళ అభిమానులు ఫీల్డ్ పైకి వస్తే వారి భద్రత పరిస్థితి ఏమిటి? మేం ఎలా సమాధానం చెప్పుకోవాలి?’ అని టోర్నీ డెరైక్టర్ మార్టిన్ కాల్లెన్ ప్రశ్నించారు.