వేల్స్ వండర్ | Gareth Bale feeling 'incredible' after Wales stun Belgium at Euro 2016 | Sakshi
Sakshi News home page

వేల్స్ వండర్

Published Sun, Jul 3 2016 2:06 AM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

వేల్స్ వండర్

వేల్స్ వండర్

యూరోలో సెమీస్‌కి...
 క్వార్టర్స్‌లో 3-1తో
 బెల్జియంపై విజయం

 
 యూరో కప్ అరంగేట్రంలోనే వేల్స్ జట్టు అనూహ్య రీతిలో అదరగొడుతోంది. ఇప్పటిదాకా తాము సాధించిన విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ ఏకంగా ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టించింది. స్టార్ ఫుట్‌బాలర్ గ్యారెత్ బేల్ మెరుపులు మెరిపించకున్నా సమష్టి ఆటతీరుతో అన్ని విభాగాల్లో రాణించిన వేల్స్ సగర్వంగా సెమీఫైనల్లోకి ప్రవేశించి కొత్త చరిత్రను సృష్టించుకుంది.
 
 లిల్లే: ఓ పెద్ద టోర్నీలో 58 ఏళ్ల తర్వాత ఆడుతున్న వేల్స్ జట్టు ఎవరి అంచనాలకూ అందని రీతిలో యూరో కప్ సెమీఫైనల్లో ప్రవేశించింది. మిడ్‌ఫీల్డర్ హల్ రాబ్సన్ కను కళ్లుచెదిరే గోల్ సహా యంతో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఫేవరెట్ బెల్జియంపై 3-1తో వేల్స్ నెగ్గింది. వేల్స్ నుంచి అష్లే విలియమ్స్ (31వ నిమిషంలో), రాబ్సన్ (55), వోక్స్ (86) గోల్స్ చేయగా బెల్జియం నుంచి రడ్జా నైన్‌గోలన్ (13) ఏకైక గోల్ సాధించాడు. 2014 ప్రపంచకప్‌లోనూ బెల్జియం క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈనెల 6న పోర్చుగల్‌తో జరిగే సెమీఫైనల్లో వేల్స్ తలపడుతుంది.
 
 తమ సరిహద్దుకు కేవలం వంద కి.మీ దూరంలోనే ఉన్న ఈ స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించేందుకు బెల్జియం నుంచి ఏకంగా లక్షా 50 వేల మంది లిల్లే నగరానికి వచ్చారు. స్టేడియంలో మెజారిటీ అభిమానుల మద్దతుతో ఆరంభంలో బెల్జియం చెలరేగి ఆడింది. మ్యాచ్ తొలి 20 నిమిషాలు బెల్జియందే హవా నడిచింది. ఈ సమయంలో థామస్ మునియర్, యానిక్ కరాస్కో, ఈడెన్ హజార్డ్ గోల్స్ ప్రయత్నాలు తృటిలో తప్పాయి.
 
 అయితే 13వ నిమిషంలో హజార్డ్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న రడ్జా 30 గజాల దూరం నుంచి టాప్ లెఫ్ట్ కార్నర్ ద్వారా బెల్జియం కు ఆధిక్యాన్నిచ్చాడు. ఈ షాక్ నుంచి త్వరగానే కోలుకున్న వేల్స్ 31వ నిమిషంలో స్కోరును సమం చేసింది. ఆరోన్ రామ్‌సే రైట్ వింగ్ కార్నర్ నుంచి ఇచ్చిన పాస్‌ను అష్లే విలియమ్స్ హెడర్ ద్వారా గోల్ చేసి జట్టులో సంతోషం నింపాడు. ఇక ఇక్కడి నుంచి బెల్జియం వ్యూహాలు ఏమాత్రం పనిచేయలేదు. ముఖ్యంగా వీరి బ్యాక్‌లైన్ సమన్వయలోపాన్ని వేల్స్ సొమ్ము చేసుకుంది.
 
 ద్వితీయార్ధం 55వ నిమిషంలో ఔరా అనే రీతిలో రాబ్సన్ చేసిన వరల్డ్ క్లాస్ గోల్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లిష్ సెకండ్ టైర్ క్లబ్‌లో ఆడే ఈ ఆటగాడు... రామ్‌సే క్రాస్‌ను అందుకుని పెనాల్టీ ఏరియాలో బెల్జియం ముగ్గురు డిఫెండర్లను వెనక్కీ ముందుకు ఏమార్చుతూ బంతిని అతి వేగంగా నెట్‌లోకి పంపడంతో వేల్స్ సంబరాలు మిన్నంటాయి. అనంతరం 64వ నిమిషంలో బెల్జియంకు ఫ్రీకిక్ లభించినా వినియోగించుకోలేకపోయింది. 75వ నిమిషంలో ఆరోన్ రామ్‌సే ఎల్లో కార్డ్ అందుకోవడంతో తను సెమీస్‌కు దూరం కానున్నాడు. ఇక చివర్లో క్రిస్ గుంటర్ ఇచ్చిన క్రాస్ షాట్‌ను గాల్లోనే అందుకున్న వోక్స్ తలతో చేసిన గోల్‌తో వేల్స్ ఆధిక్యం మరింత పెరిగింది. ఇంజ్యూరీ సమయంలో హజార్డ్ ప్రయత్నాలు విఫలం కావడంతో బెల్జియం పరాజయం ఖాయమైంది.
 
 1ఓ మేజర్ టోర్నీలో సెమీస్‌కు చేరడం వేల్స్‌కు ఇదే తొలిసారి
 2 స్వీడన్ (1992లో) అనంతరం అరంగేట్రంలోనే సెమీస్‌కు చేరిన రెండో జట్టు వేల్స్.
 3ఈ మ్యాచ్‌లో వేల్స్ తరఫున గోల్స్ చేసిన ముగ్గురూ ఇంగ్లండ్‌లోనే జన్మించారు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement