తెలుగుతల్లిని ముక్కలు చేసిన వారిని జనం విడిచిపెట్టరు
బ్రోకర్, జోకర్ల గురించి త్వరలోనే బహిరంగంగా మాట్లాడతా
కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు
తెలుగుతల్లిని ముక్కలు చేసిన ఏ ఒక్కరినీ జనం విడిచిపెట్టరని, సరైన సమయం కోసమే ఎదురుచూస్తున్న ప్రజలు ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని కేంద్ర మాజీమంత్రి, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అన్నారు. సాక్షి ప్రతినిధి గరికిపాటి ఉమాకాంత్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
యాభై ఏళ్ల నుంచి తెలుగువారి మనస్తత్వాన్ని పూర్తిగా స్టడీచేశా.. తెలుగుజాతికి అవమానం జరిగినప్పుడు వాళ్లు వెంటనే రియాక్ట్ కారు.. ఆ బాధను గుండెల్లో దాచుకుంటారు.. ఇప్పుడు కూడా అంతే.. కట్టలు తెంచుకునే ఆక్రోశాన్ని, ఆత్మగౌరవాన్ని అలాగే దాచుకున్నారు. తెలుగుతల్లిని తమ కళ్ల ముందే ఆపరేషన్ పేరుతో పొట్ట కోసి బిడ్డని తీసి తిరిగి పొట్ట కుట్టకుండా తల్లి చావుకి కారణమైన ఏ ఒక్కరినీ జనం విడిచిపెట్టరు. సరైన బుద్ధి చెబుతారు... ఎవరైతే తెలుగుతల్లి కోసం నిజాయితీగా పోరాడారో ఆ తల్లికి మనశ్శాంతినివ్వడం కోసమైనా వారిని గెలిపిస్తారు.. ఇక ఎన్నికల్లో డబ్బుకు, మందుకి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఎవరు ఔనన్నా కాదన్నా సత్యం. ఈ ఎన్నికల్లో కూడా జనం డబ్బు తీసుకుంటారు. డబ్బే కాదు ఇంకేమిచ్చినా తీసుకుంటారు. కానీ ఓటు మాత్రం తీసుకున్న వాళ్లకి వేయరు. తెలుగుతల్లి కోసం పోరాడిన వారినే ఎన్నుకుంటారు.
వాళ్ల బండారం త్వరలోనే బయటపెడతా...
పూర్వం బ్రోకర్ అనే పదానికి అర్థం అసహ్యంగా ఉండేది. బ్రోకర్ అంటే ఏహ్యభావంతో చూసేవారు. ఇప్పుడు బ్రోకర్‌కి స్టేటస్ వచ్చింది. ప్రతి కుంభకోణం వెనుక బ్రోకర్ ఉంటున్నాడు. రాజకీయపార్టీలు మారేందుకు, టికెట్లు ఇప్పించేందుకు, రాజకీయపార్టీల మధ్య పొత్తులు కుదిర్చేందుకు బ్రోకర్లు ఉంటున్నారు. చివరికి రాష్ట్రాన్ని ముక్కులు చేయడంలోనూ ఓ బ్రోకర్ పాత్ర ఉంది.
ఇటీవల నేను ఈ వ్యాఖ్య చేసినప్పటి నుంచి ఎవరి గురించి చెబుతానో అని జనం ఎదురుచూస్తున్నారు.. ఆ బ్రోకర్, రాజకీయాల్లోకి వస్తున్న జోకర్ల గురించి నేను త్వరలోనే మాట్లాడతా. బహిరంగంగా ప్రజల సమక్షంలోనే ప్రకటిస్తా. ఇందుకు టైమ్ కోసం ఎదురుచూస్తున్నా. ఇంకా దాసరి గర్జించలేదేమిటని చాలామంది అడుగుతున్నారు. నేను గర్జించేవాడిని కాదు ఎదిరించేవాడిని. వాస్తవాలను మాట్లాడేవాడిని.. నేనేమిటో.. నా శక్తి సామర్థ్యాలేమిటో ప్రజలకు తెలుసు.