ఉగ్రదాడిలో కమాండో, జవాన్ వీరమరణం
పఠాన్‌కోట్: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దగ్గర ఉగ్రవాదుల, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక గరుడ్ కమాండో, భద్రతాదళానికి చెందిన మరో జవాను వీరమరణం పొందారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఈ భీకర ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. దీంతో దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
శనివారం తెల్లవారుజామున దాడిచేసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక గరుడ్ కమాండో, మరొక జవాను ఉన్నట్టు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. స్థానికంగా ఉద్రిక్తతను రాజేసిన ఈ ఘటనలో భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే, దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువమందే ఉన్నారా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.
ఉగ్రవాదుల దాడిపై హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఈదాడిని మన జాతీయ భద్రతా దళాలు, జవాన్లు, పంజాబ్ పోలీసులు విజయవంతంగా తిప్పికొట్టాయని వెల్లడించారు. పాకిస్తాన్ మన పొరుగు దేశం.. భారతదేశం శాంతిని కోరుకుంటోందన్నారు. కానీ తమ దేశంపై జరిగే దాడులను ఉపేక్షించమని, ధీటుగా సమాధానం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు.
గతరాత్రి పఠాన్ కోట్ - పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగు ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేశామని భద్రతా అధికారులు తెలిపారు. పఠాన్‌కోట్, పాక్ మధ్య ఈ కాల్స్ జరిగినట్టు తమకు సమాచారం ఉందని వెల్లడించారు. కాగా ఇరుదేశాల మధ్య శాంతిసాధనకోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన జరగడం విచారకరమని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అన్నారు.