Gas cutters
-
బ్యాంకుకే కన్నమేశారు..
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ బ్రాంచ్‌కు దొంగలు కన్నమేశారు. రోడ్డు పక్కనే భవనం.. ఎప్పుడూ వాహనాల రద్దీ అయినా పక్కా ప్రణాళికతో బ్యాంకులోకి చొరబడిన దుండగులు గ్యాస్‌కట్టర్‌తో లాకర్‌ను కట్ చేసి సుమారు రూ.3కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. సినిమా ఫక్కీలో సాగిన ఈ చోరీలో ఏ ఒక్క ఆధారం వదలకుండా పోలీసులకు సవాల్ విసిరారు. దొంగలు వదిలి వెళ్లి గ్యాస్ సిలిండర్ ఒక్కటే పోలీసులకు దొరికింది. బుధవారం అర్ధరాత్రి, గురువారం వేకువజాము మధ్య సమయంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బ్యాంకు భవనం వెనుక కిటికీ కార్డ్‌బోర్డు పగులగొట్టి.. ఇనుప గ్రిల్స్ తొలగించి దుండగులు లోనికి చొరబడ్డారు. సుమారు 60 కిలోల బరువు ఉండే గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నారు. గ్యాస్ కట్టర్ సహాయంతో నగదు, బంగారం ఉంచిన స్ట్రాంగ్ రూం డోర్ కట్‌చేశారు. లాకర్‌ను కూడా గ్యాస్ కట్టర్‌తో కట్‌చేసి ఆరు కిలోల బంగారు ఆభరణాలు, రూ.18.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు వెనక భాగంలో కన్నం వేసిన కిటికీ అక్కడే నిచ్చెన తయారీ.. దొంగలు బ్యాంకు వెనుకవైపు ఎత్తయిన ప్రహరీ దూకేందుకు అక్కడే ఉన్న తుమ్మచెట్ల కొమ్మలు నరికి నిచ్చెన తయారు చేసుకున్నారు. దాని సహాయంతో గోడ దూకిన దొంగలు గ్యాస్ సిలిండర్, ఇతర సామగ్రి గోడ దాటించారు. పని ముగించుకున్నాక నిచ్చెన, గ్యాస్ సిలిండర్ మాత్రం అక్కడే వదిలి వెళ్లారు. అలారం,సీసీ కెమెరాలు, కంప్యూటర్ ధ్వంసం.. అలారం మోగకుండా దొంగలు వైర్లు కత్తిరించారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. గతం రికార్డులు కూడా దొరకకుండా కంప్యూటర్ను పగులగొట్టారు. సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యే డీవీఆర్ ఎత్తుకెళ్లారు. స్వీపర్ సమాచారంతో.. గురువారం ఉదయం బ్యాంకు శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్ మహిళ తాళం తీసి చూడగా లోపల సామగ్రి చిందరవందరగా పడిఉంది. బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ సింగ్వా సూచన మేరకు గ్రామంలోనే ఉండే బ్యాంకు ఉద్యోగి వెళ్లి పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, లాకర్ కట్‌చేసి ఉండడంతో చోరీ జరిగిందని నిర్ధారణకొచ్చారు. మంథని పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ బృందాలను రప్పించారు. ఇంత భారీ చోరీ జరిగినా దొంగలు ఒక్క ఆధారం కూడా అక్కడ వదిలి వెళ్లకపోవడంతో ప్రొఫెషనల్ దొంగలు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కిటికీతోపాటు లాకర్ రూం, లాకర్, ఇతర వస్తువులపై వేలిముద్రలు లభించకపోవడం గమనార్హం. చెరువు కట్ట వరకు వెళ్లిన డాగ్ స్క్వాడ్.. డాగ్ స్క్వాడ్ దొంగల వాసనను పసిగట్టలేకపోయాయి. బ్యాంకులో, బయట ఆవరణలో తిరిగిన డాగ్స్, వెనుక సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువు కట్ట వరకు వెళ్లి ఆగిపోయాయి. దీని ఆధారంగా దొంగలు వారి వాహనాన్ని చెరువు కట్ట వద్ద వదిలి బ్యాంకు వరకు నడుచుకుంటూ వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన దొంగతనాల్లో ఇదే అతిపెద్దదని సీపీ సత్యనారాయణ ప్రకటించారు. ఐదు రోజుల క్రితమే పికెట్ ఎత్తివేత.. గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను ఫిబ్రవరి 17న కల్వచర్ల వద్ద గ్రామానికి చెందిన కుంట శ్రీను, చిరంజీవి దారుణంగా హత్య చేశారు. దీంతో గ్రామంలో సుమారు నెల రోజులుగా పోలీస్ పికెట్ కొనసాగుతుంది. ఈ కేసులో ఏడో నిందితుడు గ్రామానికి చెందిన వెల్ది వసంతరావును వారం క్రితమే అరెస్ట్ చేశారు. కేసు విచారణ కొలిక్కి రావడం, గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఐదు రోజుల క్రితం పికెట్ ఎత్తివేశారు. ఈ విషయాన్ని కూడా దొంగలు గమనించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులకు చాలెంజ్.. బ్యాంకు చోరీ ఘటనను పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు. సీపీ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి క్లూ దొరక్కపోయినా.. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దొంగలు 5 నుంచి 10 మంది వరకు ఉంటారని, వీరిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దొంగలు ముందస్తుగా రెక్కీ నిర్వహించే చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కానరాని కనీస భద్రత చర్యలు.. ఎస్బీఐ గుంజపడుగు బ్రాంచ్‌లో గ్రామంతోపాటు సమీప గ్రామాల రైతులు ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. వ్యవసాయ రుణాలతోపాటు బంగారం తాకట్టుపెట్టి రుణం పొందుతారు. చోరీకి గురైన బంగారంలో ఎక్కువ మొత్తం రైతులకు సబంధించిందే అని సమాచారం. కాగా, కొందరు రైతులు బుధవారం రుణాలు చెల్లించి బంగారం తీసుకున్నట్లు తెలిసింది. రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకులో ఉన్నా.. బ్యాంకు వద్ద కనీస భద్రత చర్యలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. మరోవైపు కిటికీ వద్ద శాశ్వత గోడ కట్టించాల్సిన అధికారులు కార్డ్బోర్డ్ కొట్టి వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు అద్దాలు పగులగొట్టి చోరీకి యత్నించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయినా భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఉప్పల్‌లో పోలీసులు కార్డాన్ సెర్చ్
హైదరాబాద్: ఉప్పల్ ప్రాంతంలోని చిలుకానగర్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి పోలీసుల కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. మల్కాజ్గిరి డీసీపీ ఆధ్వర్యంలో దాదాపు 400 మంది పోలీసులు 19 బృందాలుగా విడిపోయి, దాదాపు 2వేల ఇళ్లలో సోదాలు చేశారు.తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం వరకు తనిఖీలు కొనసాగాయి. ఈ సోదాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఉంచిన గ్యాస్ కట్టర్లు, సిలిండర్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారికి బ్యాంకు దొంగతనాలతో సంబంధం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
దోపిడీ దొంగలు దోచుకుపోయారు..
సోమవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు తెగబడ్డారు.. పక్కా వ్యూహంతో బ్యాంకులోకి చొర బడి అందినకాడికి దోచుకుపోయారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లు, అధునాతన పరికరాలు ఉపయోగించి లూటీకి పాల్పడ్డారు. ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని జోడిమెట్ల దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీ ఘటన మంగళవారం జిల్లాలో కలకలం రేపింది. తెల్లవారుజామున బ్యాంకు కిటికీ చువ్వలను వంచి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.32 లక్షల నగదు, తొమ్మిది తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్లతో లాకర్లను ఓపెన్ చేస్తున్న సమయంలో వెలువడిన నిప్పురవ్వల కారణంగా రికార్డులకు మంటలు అంటుకున్నాయి. దీంతో దొంగలు పారిపోయారు. పోలీసులు వివరాలు సేకరించారు. ఘట్కేసర్: దక్కన్ గ్రామీణ బ్యాంకులో దోపిడీకి పాల్పడింది చోరీల్లో ఆరితేరిన ముఠాయేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు బ్యాంకు దోపిడీకి పక్కా ప్రణాళికను అమలు చేయడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది. కాగా ప్రస్తుతానికి బ్యాంకులో రూ.32 లక్షలు, 9 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే దోపిడీకి గురైన ఇంకో లాకర్ యజమాని అందుబాటులో లేకపోవడంతో అందులో ఏమేర సొమ్ము చోరీకి గురైందన్న విషయాన్ని పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. బ్యాంకులో పెద్ద ఎత్తున లావాదేవీలు మండలంలోని చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని జోడిమెట్లలో పదేళ్ల క్రితం దక్కన్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేశారు. పోచారంలో ఇన్ఫోసిస్, ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుతో ఇక్కడ రియల్ వ్యాపారం పుంజుకొని ఈ బ్యాంకులో లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రోజూ మాదిరిగానే సోమవారం సాయంత్రం కార్యకలాపాలు ముగిసిన అనంతరం సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం 5.30గంటలకు బ్యాంకు నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు బ్యాంకు మేనేజర్ శ్రవణ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి బ్యాంకును తెరిచిచూడగా లోపల దట్టంగా పొగ అలుముకుంది. అనుమానంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. తగులబడుతున్న రికార్డులు, ఫైళ్లపై నీరుపోసి పోలీసులు బ్యాంకులోపలికి ప్రవేశించారు. బ్యాంకులో ఉండవలసిన డబ్బు లేకపోవడం, లాకర్లు పగిలి ఉండటం, కిటికీ ఇనుప చువ్వలు వంచి ఉండటంతో బ్యాంకు దోపిడీకి గురైనట్లు పోలీసులు గ్రహించారు. దోపిడీ జరిగింది ఇలా.. మంగళవారం తెల్లవారుజామున దుండగులు బ్యాంకు సమీపంలోని భవనానికి ఎడమ వైపున వాహనాన్ని నిలిపారు. చుట్టు పక్కల ఇళ్లు లేకపోవడంతో వీరిని ఎవరూ గమనించే అవకాశం లేకపోయింది. అనంతరం వాహనాలను పైకి ఎత్తే జాకీ సాయంతో కిటికీ చువ్వలను వంచారు. అందులోనుంచి లోనికి వెళ్లిన దుండగులు వారితో పాటు గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, టార్చి, ఇనుపరాడ్, ఆక్సబ్లేడ్, టైబార్, కారం పొడి పొట్లాలు తీసుకువెళ్లారు. గ్యాస్ కట్టర్ సాయంతో లాకర్‌రూంలోకి చొరబడి అక్కడ ఉన్న క్యాష్ చెస్ట్‌లో ఉన్న రూ.32 లక్షలను తీసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న 70 లాకర్లలో రెండింటిని తెరిచారు. 36వ నంబర్ లాకర్ లో పోచారంకు చెందిన అనంత్‌రెడ్డి దాచిన 9 తులాల బంగారు నగలు దోచుకున్నారు. 27వ నంబర్ చెందిన లాకర్‌ను ధ్వంసం చేశారు. దాని యాజమాని అందుబాటులో లేరు. అనంతరం మరో లాకర్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తుండగా నిప్పురవ్వలు పడి అక్కడున్న రికార్డులు అంటుకున్నాయి. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో దుండగులు ఇక అక్కడ ఉండటం మంచిది కాదని భావించి పరారయ్యారు. వెళ్లే సమయంలో సీసీకెమెరాల పుటేజీ హర్డ్డిస్క్ను తీసుకెళ్లారు. గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, టైబార్, కారంపొడి ప్యాకెట్లు, టార్చి, మూడు మంకీక్యాప్లను అక్కడే వదిలారు. బ్యాంకులో చోరీ సంఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. జేసీపీ శివధర్, డీసీపీ రమారాజేశ్వరీ, మల్కాజిగిరి ఏసీపీ రవిచంద్రన్‌రెడ్డి తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగీలం బ్యాంకులోనికి వెళ్లి పరిసరాల్లో కొంత దూరం వరకు వెళ్లి తిరిగి వచ్చింది. క్లూస్‌టీం, ఎస్ఓటీ, ఎస్బీ, ఐబీ పోలీసులు బ్యాంకులో ఆధారాలను సేకరించారు. ఆందోళనలో ఖాతాదారులు చోరీల్లో ఆరితేరిన ముఠానే దక్కన్ గ్రామీణ బ్యాంకులో దోపిడీకి పాల్పడిందని డీసీపీ రమా రాజేశ్వరి తెలిపారు. సంఘటన స్థలం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఇలాంటి దొంగతనాలు గతంలో కరీంనగర్, షాద్‌నగర్, వరంగల్‌లో జరిగినట్లు చెప్పారు. దోపిడీకి గ్యాస్‌కట్టర్, గ్యాస్ సిలిండర్, జాకీ తదితర వస్తువులను వాడటాన్ని బట్టి పెద్ద ముఠాయే ఈ దోపిడీకి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికి రూ.32 లక్షల నగదు, 9తులాల బంగారం బ్యాంకులో దోపిడీకి గురైనట్లు నిర్ధారించామని, దోపిడీకి గురైన సొమ్ము ఇంకా పెరగవచ్చన్నారు. బ్యాంకులో దోపిడీ విషయం తెలుసుకున్న ఖాతాదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ లాకర్లు సురక్షితంగా ఉన్నాయో లేవోనన్న ఆందోళన వారిలో కనిపించింది. అయితే రెండు లాకర్లు మాత్రమే చోరీకి గురైనట్లు బ్యాంకు అధికారులు తెలపడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకు వద్దకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంపీపీ బండారి శ్రీనివాస్ వెళ్లి ఖాతాదారులకు ధైర్యం చెప్పారు. -
డి ఫర్ దోపిడీ..
బ్యాంకులో దోపిడీకి ప్లాన్.. ఇందుకోసం బ్యాంకు సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న భవనం నుంచి బ్యాంకు లోపలికి 125 అడుగుల మేర సొరంగం తవ్వడం.. దాంట్లోంచి వెళ్లి బ్యాంకులోని నగదును, లాకర్లను కొల్లగొట్టడం.. వినడానికి సినిమా స్టోరీలా ఉన్నా.. హర్యానాలోని గొహానా పట్టణంలో ఇది నిజంగానే జరిగింది. అక్కడి పంజాబ్ నేషనల్ బ్యాంకులో మొత్తం 350 లాకర్లు ఉండగా.. దొంగలు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి అందులో 89 లాకర్లను తెరిచి.. రూ.కోట్ల విలువైన సొత్తును కొల్లగొట్టుకుపోయారు. దానికి సంబంధించిన చిత్రాలే ఇవి.. 7 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పులో ఈ సొరంగాన్ని తవ్వారు. వారాంతపు సెలవుల అనంతరం సోమవారం బ్యాంకును తెరిచినప్పుడు ఈ విషయం బయటపడింది. శనివారం లేదా ఆదివారం రాత్రి దోపిడీ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, తమ విలువైన సొత్తును భద్రపరచడంలో బ్యాంకు నిర్లక్ష్యం వహించిందని ఆరోపిస్తూ.. ఖాతాదారులు బ్యాంకుపై కేసు వేయాలని యోచిస్తున్నారు.