బ్యాంకుకే కన్నమేశారు.. | Sbi Bank Robbery At Peddapalli District | Sakshi
Sakshi News home page

బ్యాంకుకే కన్నమేశారు..

Published Sat, Mar 27 2021 5:24 AM | Last Updated on Sat, Mar 27 2021 5:31 AM

Sbi Bank Robbery At Peddapalli District - Sakshi

బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్న సీపీ సత్యనారాయణ

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు దొంగలు కన్నమేశారు. రోడ్డు పక్కనే భవనం.. ఎప్పుడూ వాహనాల రద్దీ అయినా పక్కా ప్రణాళికతో బ్యాంకులోకి చొరబడిన దుండగులు గ్యాస్‌కట్టర్‌తో లాకర్‌ను కట్‌ చేసి సుమారు రూ.3కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. సినిమా ఫక్కీలో సాగిన ఈ చోరీలో ఏ ఒక్క ఆధారం వదలకుండా పోలీసులకు సవాల్‌ విసిరారు. దొంగలు వదిలి వెళ్లి గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కటే పోలీసులకు దొరికింది. 

బుధవారం అర్ధరాత్రి, గురువారం వేకువజాము మధ్య సమయంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బ్యాంకు భవనం వెనుక కిటికీ కార్డ్‌బోర్డు పగులగొట్టి.. ఇనుప గ్రిల్స్‌ తొలగించి దుండగులు లోనికి చొరబడ్డారు. సుమారు 60 కిలోల బరువు ఉండే గ్యాస్‌ సిలిండర్‌ తెచ్చుకున్నారు. గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో నగదు, బంగారం ఉంచిన స్ట్రాంగ్‌ రూం డోర్‌ కట్‌చేశారు. లాకర్‌ను కూడా గ్యాస్‌ కట్టర్‌తో కట్‌చేసి ఆరు కిలోల బంగారు ఆభరణాలు, రూ.18.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. 


బ్యాంకు వెనక భాగంలో కన్నం వేసిన కిటికీ 

అక్కడే నిచ్చెన తయారీ.. 
దొంగలు బ్యాంకు వెనుకవైపు ఎత్తయిన ప్రహరీ దూకేందుకు అక్కడే ఉన్న తుమ్మచెట్ల కొమ్మలు నరికి నిచ్చెన తయారు చేసుకున్నారు. దాని సహాయంతో గోడ దూకిన దొంగలు గ్యాస్‌ సిలిండర్, ఇతర సామగ్రి గోడ దాటించారు. పని ముగించుకున్నాక నిచ్చెన, గ్యాస్‌ సిలిండర్‌ మాత్రం అక్కడే వదిలి వెళ్లారు. 

అలారం,సీసీ కెమెరాలు, కంప్యూటర్‌ ధ్వంసం.. 
అలారం మోగకుండా దొంగలు వైర్లు కత్తిరించారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. గతం రికార్డులు కూడా దొరకకుండా కంప్యూటర్‌ను పగులగొట్టారు. సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యే డీవీఆర్‌ ఎత్తుకెళ్లారు. 

స్వీపర్‌ సమాచారంతో..
గురువారం ఉదయం బ్యాంకు శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్‌ మహిళ తాళం తీసి చూడగా లోపల సామగ్రి చిందరవందరగా పడిఉంది. బ్యాంకు మేనేజర్‌ ప్రహ్లాద్‌ సింగ్‌వా సూచన మేరకు గ్రామంలోనే ఉండే బ్యాంకు ఉద్యోగి వెళ్లి పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూం, లాకర్‌ కట్‌చేసి ఉండడంతో చోరీ జరిగిందని నిర్ధారణకొచ్చారు. మంథని పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్‌ బృందాలను రప్పించారు. ఇంత భారీ చోరీ జరిగినా దొంగలు ఒక్క ఆధారం కూడా అక్కడ వదిలి వెళ్లకపోవడంతో ప్రొఫెషనల్‌ దొంగలు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కిటికీతోపాటు లాకర్‌ రూం, లాకర్, ఇతర వస్తువులపై వేలిముద్రలు లభించకపోవడం గమనార్హం.  

చెరువు కట్ట వరకు వెళ్లిన డాగ్‌ స్క్వాడ్‌..
డాగ్‌ స్క్వాడ్‌ దొంగల వాసనను పసిగట్టలేకపోయాయి. బ్యాంకులో, బయట ఆవరణలో తిరిగిన డాగ్స్, వెనుక సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువు కట్ట వరకు వెళ్లి ఆగిపోయాయి. దీని ఆధారంగా దొంగలు వారి వాహనాన్ని చెరువు కట్ట వద్ద వదిలి బ్యాంకు వరకు నడుచుకుంటూ వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన దొంగతనాల్లో ఇదే అతిపెద్దదని సీపీ సత్యనారాయణ ప్రకటించారు. 

ఐదు రోజుల క్రితమే పికెట్‌ ఎత్తివేత..
గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను ఫిబ్రవరి 17న కల్వచర్ల వద్ద గ్రామానికి చెందిన కుంట శ్రీను, చిరంజీవి దారుణంగా హత్య చేశారు. దీంతో గ్రామంలో సుమారు నెల రోజులుగా పోలీస్‌ పికెట్‌ కొనసాగుతుంది. ఈ కేసులో ఏడో నిందితుడు గ్రామానికి చెందిన వెల్ది వసంతరావును వారం క్రితమే అరెస్ట్‌ చేశారు. కేసు విచారణ కొలిక్కి రావడం, గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఐదు రోజుల క్రితం పికెట్‌ ఎత్తివేశారు. ఈ విషయాన్ని కూడా దొంగలు గమనించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

పోలీసులకు చాలెంజ్‌.. 
బ్యాంకు చోరీ ఘటనను పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు. సీపీ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి క్లూ దొరక్కపోయినా.. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దొంగలు 5 నుంచి 10 మంది వరకు ఉంటారని, వీరిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దొంగలు ముందస్తుగా రెక్కీ నిర్వహించే చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.  

కానరాని కనీస భద్రత చర్యలు..
ఎస్‌బీఐ గుంజపడుగు బ్రాంచ్‌లో గ్రామంతోపాటు సమీప గ్రామాల రైతులు ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. వ్యవసాయ రుణాలతోపాటు బంగారం తాకట్టుపెట్టి రుణం పొందుతారు. చోరీకి గురైన బంగారంలో ఎక్కువ మొత్తం రైతులకు సబంధించిందే అని సమాచారం. కాగా, కొందరు రైతులు బుధవారం రుణాలు చెల్లించి బంగారం తీసుకున్నట్లు తెలిసింది. రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకులో ఉన్నా.. బ్యాంకు వద్ద కనీస భద్రత చర్యలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఒక సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. మరోవైపు కిటికీ వద్ద శాశ్వత గోడ కట్టించాల్సిన అధికారులు కార్డ్‌బోర్డ్‌ కొట్టి వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు అద్దాలు పగులగొట్టి చోరీకి యత్నించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయినా భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement