డి ఫర్ దోపిడీ..
బ్యాంకులో దోపిడీకి ప్లాన్.. ఇందుకోసం బ్యాంకు సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న భవనం నుంచి బ్యాంకు లోపలికి 125 అడుగుల మేర సొరంగం తవ్వడం.. దాంట్లోంచి వెళ్లి బ్యాంకులోని నగదును, లాకర్లను కొల్లగొట్టడం.. వినడానికి సినిమా స్టోరీలా ఉన్నా.. హర్యానాలోని గొహానా పట్టణంలో ఇది నిజంగానే జరిగింది. అక్కడి పంజాబ్ నేషనల్ బ్యాంకులో మొత్తం 350 లాకర్లు ఉండగా.. దొంగలు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి అందులో 89 లాకర్లను తెరిచి.. రూ.కోట్ల విలువైన సొత్తును కొల్లగొట్టుకుపోయారు. దానికి సంబంధించిన చిత్రాలే ఇవి.. 7 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల వెడల్పులో ఈ సొరంగాన్ని తవ్వారు.
వారాంతపు సెలవుల అనంతరం సోమవారం బ్యాంకును తెరిచినప్పుడు ఈ విషయం బయటపడింది. శనివారం లేదా ఆదివారం రాత్రి దోపిడీ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, తమ విలువైన సొత్తును భద్రపరచడంలో బ్యాంకు నిర్లక్ష్యం వహించిందని ఆరోపిస్తూ.. ఖాతాదారులు బ్యాంకుపై కేసు వేయాలని యోచిస్తున్నారు.