ఒకటిన్నర నిమిషాల్లో బ్యాంకు దోపిడీ పూర్తి!
కేవలం నలుగురంటే నలుగురే ముసుగు వ్యక్తులు.. వాళ్లు తీసుకున్న సమయం సరిగ్గా 90 సెకండ్లు. ఈలోపే మొత్తం పని పూర్తిచేసేశారు. పంజాబ్‌లోని లూథియానాలో గల పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో రూ. 15 లక్షలు దోచేశారు. ఈ ఘటన సోమవారం మిట్ట మధ్యాహ్నం జరిగింది. ఆ బ్రాంచి కూడా కోచర్ మార్కెట్ పోలీసు పోస్టుకు సరిగ్గా 200 మీటర్ల దూరంలోనే ఉంది. దొంగలు బ్యాంకులోకి ప్రవేశించే సమయానికి బ్యాంకులో ఒక కస్టమర్, ఆరుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేడు.
దొంగలు గాల్లోకి కాల్పులు జరుపుతూ లోపలకు ప్రవేశించారు. డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన అంకుశ్ చౌదరి అనే కస్టమర్‌ను కొట్టారు. ఇద్దరు దొంగలు లాబీలోనే ఉన్నారు. వాళ్లలో ఒకడు కౌంటర్ లోంచి క్యాషియర్ తలకు తుపాకి గురిపెట్టాడు. మూడో దొంగ మేనేజర్‌ను బంధించగా నాలుగో వ్యక్తి క్యాషియర్ వెనక్కి వెళ్లి, కొద్ది నిమిషాల క్రితమే కస్టమర్ డిపాజిట్ చేసిన రూ. 15 లక్షలు తీసుకున్నాడు. అదే సమయానికి బ్యాంకు లోపలకు వస్తున్న ఓ మహిళ.. లోపల జరుగుతున్న విషయాన్ని చూసి వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. అందరికీ విషయం చెప్పారు. కానీ చుట్టుపక్కల వాళ్లు స్పందించేలోపే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
అయితే ఈ నేరంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర సైతం ఉండే అవకాశం లేకపోలేదని పోలీసులు అంటున్నారు. ఈ బ్యాంకులో ఓ గార్డును పెట్టుకోవాలని ఎప్పటినుంచో చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.