'ప్రతి ముస్లిం ముప్పేనని అమెరికా భావిస్తోంది'
లండన్: అమెరికాలో సెలవులను గడుపాలని, డిస్నీల్యాండ్‌ను పిల్లలకు చూపించాలని తపించిన ఓ తండ్రికి నిరాశ ఎదురైంది. తన సోదరుడు, తొమ్మిది మంది పిల్లలతో కలిసి బయలుదేరిన ఆయనను గేట్‌విక్ విమానాశ్రయంలో అమెరికా అధికారులు విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. బ్రిటన్ వాసి అయిన మహమ్మద్ తారిఖ్ మహమూద్ కుటుంబానికి ఈ చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరనున్న విమానంలో ప్రయాణించేందుకు వారిని అనుమతించలేదు.
అమెరికా భద్రతా సంస్థ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సంస్థ ఆదేశాల కారణంగానే వారి పట్ల ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనపై తారిఖ్ మహమూద్ స్పందిస్తూ విమానం ఎక్కనివ్వకుండా తమను అడ్డుకోవడంపై అమెరికా అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వాలని, దీంతో సెలవుల్లో అమెరికా వెళ్లాలన్న తమ ఆశ ఆడియాస అయిందని చెప్పారు.
అమెరికాపై జరిగిన దాడులతో ప్రతి ముస్లిం తమకు ముప్పేనని వారు భావించడమే తమను అడ్డుకోవడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ ఘటనపై లేబర్ పార్టీ ఎంపీ స్టెల్లా క్రిసీ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు లేఖ రాశారు. ఈ విషయమై అమెరికా అధికారుల నుంచి వివరణ కోరాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేయనున్నట్టు కామెరాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.