ఏటా వెయ్యి సినిమాలూ.. ఏ లాభం?
కోల్కతా: భారత్లో ఏటా 1000కిపైగా సినిమాలు నిర్మితమవుతున్నా.. అంతర్జాతీయంగా మనకు పెద్దగా గుర్తింపు లేదు. అంతర్జాతీయ మార్కెట్లో మన సినిమాకు ఉన్న ముద్ర చాలా చిన్నది. ఇదే అభిప్రాయన్ని ప్రముఖ అంతర్జాతీయ సినీ విశ్లేషకుడు, కైరో చిత్రోత్సవంలో భారత ప్రతినిధి గౌరంగ్ జలాన్ వ్యక్తం చేశారు. 'అంతర్జాతీయంగా చూసుకుంటే భారత ముద్ర చాలా పరిమితం. నిజానికి మనం వెయ్యికిపైగా సినిమాలు ప్రతి ఏడాది నిర్మిస్తున్నా.. మన సినిమాలు మనవాళ్లు, ప్రవాస భారతీయులకు తప్ప ఇతరులకు చేరడం లేదు. మనం అంతర్జాతీయ స్థాయి కథలపై ఫోకస్ చేయాల్సిన అవసరముంది. అంతర్జాతీయ ప్రేక్షకులపై మనం దృష్టి పెట్టాలి. ప్రపంచస్థాయి కథతో మనం వారికి కనెక్ట్ కాగలం' అని ఇటీవల కోల్కతాకు వచ్చిన ఆయన పీటీఐ వార్తాసంస్థతో తెలిపారు.
అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అయిన కైరో చిత్రోత్సవం 'దు ఫిలిం ద ఆమౌర్ దె మన్స్'లో ఈసారి భారత్ నుంచి రెండు చిత్రాలు 'మాంఝీ', 'రంగ్రసియా' మాత్రమే ఎంపికయ్యాయని ఆయన చెప్పారు. ఇటీవల మన చిత్రాలు విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పటికీ కంటెంట్ పరంగా ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరముందని, ఫ్రెంచ్, స్పానిష్ మాట్లాడే దేశాల్లో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కంటే ఫ్రెంచ్, స్పానిష్ సబ్ టైటిల్స్ తో మన చిత్రాలు ప్రదర్శిస్తే ఇంకా మెరుగ్గా ప్రేక్షకులకు రీచ్ కావచ్చునని ఆయన చెప్పారు.