12న జగన్ జనభేరి
కోడుమూరు, ఆలూరు, పత్తికొండలో పర్యటన
రోడ్‌షో.. జనంతో మాటామంతీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 12న జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన జనభేరి.. రెండో విడత ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో ఒక్క రోజు వాయిదా పడిందన్నారు. 12న ఉదయం 10 గంటలకు కోడుమూరుకు చేరుకోనున్న జననేత రోడ్‌షో అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. అక్కడి నుంచి నేరుగా ఆలూరుకు పయనమవుతారని.. మార్గమధ్యలో స్థానికులను కలుసుకుంటారన్నారు.
సాయంత్రం 3.30 గంటలకు ఆలూరులో రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారన్నారు. అనంతరం నేరుగా పత్తికొండకు చేరుకుని రోడ్‌షో చేపడతారని.. ఆ తర్వాత జనభేరిలో ప్రసంగిస్తారని వెల్లడించారు. చాలా కాలం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పర్యటనల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
ఆ చిరునవ్వు కోసం.. ఆ చేతి స్పర్శ కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కుటుంబ పెద్దగా బాగోగులు చూసుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక రైతులు, వృద్ధులు, అక్కాచెల్లెళ్లు.. అన్నాతమ్ముళ్లకు కుటుంబ సభ్యుడు వస్తున్న అనుభూతిని కలిగిస్తోంది.