Gautam Bambawale
-
దాపరికం లేని చర్చలతోనే శాంతి ..
సాక్షి, బీజింగ్ : భారత్, చైనాలు నిర్భయంగా.. ఎలాంటి దాపరికాలు లేకుండా చర్చించడం ద్వారానే రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని చైనాలోని భారత రాయబారి గౌతమ్ బాంబావాలే అన్నారు. డోక్లాంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయన్నారు. చైనాకు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.చైనా గత సంవత్సరం భారత భూభాగమైన డోక్లాంలోకి చొచ్చుకురావడం వల్లే విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. చైనా బీజింగ్ నగరం నుంచి డోక్లాం మీదుగా రోడ్డు మార్గాన్ని నిర్మించాలనుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడి, ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. చైనా తన బలగాలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించడంతో భారత్ కూడా తన బలగాలను సరిహద్దుకు చేర్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇరు దేశాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇది వరకు చాలా చర్చలు జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వలేదని, డోక్లంపై దాపరికం లేని చర్చలు మరిన్ని జరగాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడమే ఇరు దేశాలకు మంచిదన్నారు. -
పాక్‌లో భారత హైకమిషనర్‌గా అజయ్ బిసారియా
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో భారత హైకమిషనర్‌గా 1987 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అజయ్ బిసారియా నియమితుల య్యారు. ప్రస్తుతం పోలెండ్‌లో భారత రాయబారిగా ఉన్న అజయ్ త్వరలోనే విధుల్లో చేరతారని విదేశాంగ శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. పాక్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న గౌతమ్ బంబావలే ఇటీవల చైనా రాయబారిగా వెళ్లిన నేపథ్యంలో.. అజయ్ పాక్‌లో భారత హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన అనంతరం అజయ్ రష్యన్ భాషను స్పెషలైజేషన్‌గా ఎంచుకున్నారు. -
పాక్ రాయబారికి భారత్ సమన్లు
న్యూఢిల్లీ/కరాచీ: భారత్ లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ బాసిత్‌కు భారత విదేశాంగ వ్వవహారాల శాఖ సమన్లు జారీ చేసింది. తమ దేశ అధికారిని కార్యక్రమానికి పిలిచి చిట్టచివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయిందని చెప్పి అవమానిస్తారా అని అందులో ప్రశ్నించింది. ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇస్తారని, తమ ఆందోళన పాక్ ప్రభుత్వానికి చేరవేయాలని కోరింది. భారత్ తరుపున పాకిస్థాన్‌లో హైకమిషనర్ గా గౌతం బాంబ్వాలే పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయనను కరాచీలోని ఓ కార్యక్రమంలో మాట్లాడేందుకు పాక్ అధికారులు ఆహ్వానించారు. తీరా ఆయన బయలుదేరే సమయానికి రావొద్దంటూ చివరి నిమిషంలో సమాచారం ఇచ్చారు. ఇంతటి బాధ్యత రహితంగా వ్యవహరించిన పాక్ తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమన్లు పంపించింది. కాగా, దీనిపూ వివరణ కోరగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ ప్రతినిధులు వారి కార్యక్రమాలు పూర్తి చేయాలని భారత్ కోరుకుంటుందని అందులో భాగంగానే వివరణ కోరిందని చెప్పారు. -
'ఇస్లామాబాద్'పై భారత్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న కశ్మీర్ సమస్యను మళ్లీ రగిలించేందుకు పాకిస్థాన్ అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో ఉత్పన్నమైన పరిస్థితులను బూచిగా చూపుతూ అనేక కుట్రలకు తెరలేపింది. ఐక్యరాజ్య సమితిలో భారత్ పై హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు నుంచి హఫీజ్ సయీద్, సిరాజ్ అల్ హకూన్ లాంటి చెంచాలతో క్షేత్రస్థాయి 'కశ్మీర్ స్వాతంత్ర్య పోరాటం' చేయిస్తోంది. ఈ క్రమంలోనే సిరాజ్ ఉల్ హకూన్ నేతృత్వంలోని జమాతే ఇస్లామి(జేఐ) సంస్థ భారత హై కమిషన్ కార్యాలయం(ఇస్లామాబాద్) ముట్టడికి పిలుపు నిచ్చింది. మరోవైపు హఫీజ్ కు చెందిన 'జమాత్ ఉల్ దవా' వైద్య బృందం ఒకటి ఇస్లామాబాద్ హై కమిషనర్ లో భారత వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో పాక్ రాజధానిలోని ఇండియన్ ఎంబసీ వద్ద ఉద్రక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ లో 'నో స్కూల్ గోయింగ్ మిషన్'ను అమలు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది. ఇండియన్ హైకమిషన్ లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులెవరూ తమ పిల్లలను పాక్ లోని స్కూళ్లకు పంపకూడదని హై కమిషనర్ గౌతమ్ బంబావతేకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పిల్లలను వెంటనే ఇండియాకు పంపాలని ఉద్యోగులకు సూచించింది. తీవ్ర పరిణామాలు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో తప్ప విదేశాల్లోని భారత హై కమిషన్ ఇలాంటి నిర్ణయం తీసుకోదు. సోమవారం నాటి నిర్ణయం భారత్- పాక్ మధ్య బలహీనమవుతోన్న సంబంధాలకు పరాకాష్ట అని పరిశీలకులు భావిస్తున్నారు. (ఇస్లామాబాద్ లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయం) ఆదివారం రావల్పిండి నుంచి బయలుదేరిన జమాతే ఇస్లామి(జేఐ) భారీ ర్యాలీలో ఆ సంస్థకు చెందిన వేలాది మంది కార్యకర్తలు బస్సులు, బైకులులతో ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ కార్యాలయం వైపుకు కదులుతున్నారు. ఈ మేరకు అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం ఇండియన్ కాన్సులేట్ చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి, భద్రతను కట్టుదిట్టం చేసింది. సాయుధ బలగాలేకాక వెయ్యిమంది పోలీసులనూ మోహరించింది. జమాతే సంస్థ వచ్చే వారం కశ్మీర్ సరిహద్దు వరకు ర్యాలీ నిర్వహించనుంది. జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ ఇప్పటికే లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కు యాత్ర నిర్వహించి సంగతి తెలిసిందే. కశ్మీర్ పై వరుసగా పేలుతున్న పాక్ కు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ఆదివారం ఘాటుగా సమాధానమిచ్చారు. 'కశ్మీర్ తన పాలనలోకి వస్తుందని పాక్ కలలు కంటోంది. అవి కల్లలేగానీ, ఎన్నటికీ నిజం కాబోదు'అని పరోక్షంగా నవాజ్ షరీఫ్ కు చురకలంటించారు సుష్మ. బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తర్వాత చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటివరకు 46 మంది పౌరులు చనిపోయారు. దాదాపు 2వేల మంది గాయపడ్డారు. గడిచిన 16 రోజులుగా అక్కడి 10 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నాయి. -
భారత నేవీ అధికారిని అరెస్ట్ చేసిన పాక్
ఇస్లామాబాద్: భారత నిఘా విభాగానికి చెందిన అధికారిని అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇండియన్ నేవీలో కమాండర్ స్థాయిలో ఉన్న అధికారి కుల్ యాదవ్ భూషన్ 'రా' సంస్థలో నిఘా అధికారిగా పనిచేస్తున్నట్లు గుర్తించినట్టు బలోచిస్తాన్ ప్రాంతానికి చెందిన హోంమంత్రి మిర్ సర్ఫరాజ్ బుగి వెల్లడించారు. అనుమతి లేకుండా అధికారి తమ దేశంలోకి ప్రవేశించారని పాక్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఆందోళన చేపట్టి నిరసన తెలిపినందుకు భారత హై కమిషనర్ గౌతమ్ బాంబవాలేకు సమన్లు జారీచేస్తున్నట్లు పాక్ అధికారులు చెబుతున్నారు. బలోచిస్తాన్ వేర్పాటువాదులు, టెర్రరిస్టులతో భారత అధికారికి సంబంధాలు ఉన్నాయని పాక్ అధికారి బుగ్టి అరోపించారు. భారత్ మాత్రం పాక్ ఆరోపణల్ని కొట్టిపారేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.