GCMMF
-
అమూల్.. రెండంకెల వృద్ధి
న్యూఢిల్లీ: అమూల్ బ్రాండ్ కింద పాలు, పాల పదార్థాల తయారీలో ఉన్న గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయంలో రెండంకెల వృద్ధి ఆశిస్తోంది. తమ ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఇందుకు కారణమని సంస్థ ఎండీ జయెన్ మెహతా తెలిపారు.జీసీఎంఎంఎఫ్ 2023–24లో రూ.59,445 కోట్ల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎని మిది నెలల్లో తాజా పాలు, చీజ్, ఐస్ క్రీం సహా అన్ని ఉత్పత్తుల విభాగాల్లో డిమాండ్ వృద్ధి చెందిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సగ టున రోజుకు 310 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేశామని మెహతా వెల్లడించారు. సంస్థ పాల ప్రాసెసింగ్ వార్షిక సామర్థ్యం దాదాపు 500 లక్షల లీటర్లు. యూఎస్ సహా దాదాపు 50 దేశాలకు పాల ఉత్పత్తులను ఈ సంస్థ ఎగుమతి చేస్తోంది. రూ.11,000 కోట్ల పెట్టుబడి.. నూతన ప్లాంట్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ఇతర కంపెనీల కొనుగోలు ద్వారా సంస్థ సామర్థ్యాన్ని విస్తరించడానికి రూ.11,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలను ఇప్పటికే ప్రకటించినట్టు తెలిపారు. ఇందులో 80 శాతం ఖర్చు చేశామన్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారం మెరుగ్గా ఉందని, చాలా ప్రొడక్టులు విడుదల చేసినట్టు వివరించారు.జీసీఎంఎంఎఫ్ గుజరాత్లోని 18,600 గ్రామాలలో 36 లక్షల మంది రైతులను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద రైతు యాజమాన్యంలోని పాడి పరిశ్రమ సహకార సంస్థ. 18 సభ్య సంఘాల ద్వారా రోజుకు 300 లక్షల లీటర్లకుపైగా పాలను సేకరిస్తోంది. ఇంటర్నేషనల్ ఫామ్ కంపారిజన్ నెట్వర్క్ ప్రకారం పాల ప్రాసెసింగ్ పరంగా ప్రపంచంలోని టాప్ 20 డెయిరీ కంపెనీలలో జీసీఎంఎంఎఫ్ 8వ స్థానంలో నిలిచింది. -
మళ్ళీ పెరిగిన అమూల్ పాల ధరలు: ఈ సారి ఎంతంటే?
రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడి పాలిట భారంగా మారిపోతున్నాయి. ఈ తరుణంలో అమూల్ పాల ధరలు మళ్ళీ పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత ఉంది? అమూల్ పాల ధరలు ఎక్కడ పెరిగాయనే.. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. నివేదికల ప్రకారం, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) 'అమూల్' పేరుతో విక్రయిస్తున్న పాల ధరలను శనివారం ఏకంగా రెండు రూపాయలను పెంచింది. ఈ ధరలు గుజరాతీ నగరాలైన సౌరాష్ట్ర, అహ్మదాబాద్, గాంధీనగర్లలో అమలులోకి వచ్చాయి. ధరల పెరుగుదల తరువాత 500 మీ.లీ పాలు రూ. 32, అమూల్ స్టాండర్డ్ ధర రూ. 29, అమూల్ తాజా ధర రూ. 26, అమూల్ టి-స్పెషల్ ధర రూ. 30కి చేరింది. డిసెంబర్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తరువాత పాల ధరలను పెంచడం ఇదే మొదటిసారి. గత ఆగష్టు నెలలో GCMMF పాల ధరలు 2 రూపాయలు పెంచింది. (ఇదీ చదవండి: రెండు సార్లు ఓటమి.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధించాడిలా..) జిసిఎమ్ఎమ్ఎఫ్ సభ్య సంఘాలు గుజరాత్ రాష్ట్రంలోని 18,154 గ్రామాలలో ఉన్న మొత్తం 36 లక్షల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి ప్రతి రోజు సగటున 264 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తోంది. గత ఫిబ్రవరిలో ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలో అమూల్ ధరలు పెరిగిన తరువాత మదర్ డెయిరీ కూడా పాల ధరలను రూ. 2 వరకు పెంచింది. ముడిసరుకు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో మదర్ డెయిరీ ప్రతినిధి తెలిపారు. -
అమూల్ ఎండీకి మాఫియా డాన్ బెదిరింపు!
అహ్మదాబాద్: అమూల్ పాలు ఈ పేరు వినే ఉంటారు కదా..! ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనే ఆ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధీకి మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవి పూజారి పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి 25 కోట్లు ఇవ్వాలని తనను డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోధీ ఫిర్యాదు మేరకు కేసును అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ కు అప్పగించినట్లు ఆనంద్ ఎస్పీ సౌరభ్ సింగ్ తెలిపారు. తాను ఫెడరేషన్ మీటింగ్ లో ఉన్నప్పుడు తొలిసారి ఫోన్ కాల్ వచ్చినట్లు సోధీ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలర్ తనను తాను రవి పూజారిగా చెప్పి తాను ఆస్ట్రేలియాలో ఉంటానని పరిచయం చేసుకున్నారని తెలిపారు. తొలుత ఏదో వ్యాపారం పనిమీద ఫోన్ చేసి ఉంటారని భావించానని, అతడి నెంబరును మరో అధికారి మొబైల్ యాప్లో చెక్ చేయగా, అతను గ్యాంగ్ స్టర్ అని తెలిసినట్లు చెప్పారు. తనకు రూ. 25 కోట్లు ఇవ్వకపోతే కాల్చిపారేస్తామని బెదిరించినట్లు వివరించారు. ఈ సంస్థపై ఆధాపడి 36 లక్షల పేద కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పడానికి ప్రయత్నించానని కానీ, పూజారి అవన్నీ తనకేం పట్టవనీ డబ్బు ఇవ్వాల్సిందేనని చెప్పినట్లు తెలిపారు. మే మొదటివారంలో సోధీకి పూజారి మరో మూడు మార్లు ఫోన్ చేసినట్లు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కే ఎన్ పటేల్ తెలిపారు. ఫోన్లన్నీ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) తో చేయడం వల్ల వ్యక్తి నంబర్ను కచ్చితంగా పట్టుకోలేమని వివరించారు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల నుంచి మాత్రం ఫోన్లు వచ్చినట్లు గుర్తించమన్నారు. గత ఏడాది నవంబర్, జనవరిలో పూజరి బెదిరించిన వ్యక్తుల కేసులను కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
14 శాతం పెరిగిన అమూల్ టర్నోవర్
న్యూఢిల్లీ: గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో 14 శాతంపెరిగింది. ఈ సంస్థ అమూల్ బ్రాండ్ కింద పాలు, ఇతర పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.18,143 కోట్లుగా ఉన్న టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.20,730 కోట్లకు పెరి గిందని జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ ఆర్.ఎస్. శోధి చెప్పారు. వినియోగదారుల ఉత్పత్తుల విభాగంలో అమ్మకాలు 21% వృద్ధి చెందడమే దీనికి కారణమని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రైతులకు 8-10% అధిక ధరను చెల్లించామని తెలిపారు. అయితే దేశీయ మార్కెట్లో పాల సేకరణ ధరలు 15-20 శాతం వరకూ తగ్గాయని పేర్కొన్నారు. నెయ్యి, స్కిమ్మ్డ్ మిల్క్ పౌడర్ వంటి బల్క్ కమోడిటీ విభాగాల్లో రాబడులు 70%కి పైగా క్షీణించాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గడమే దీనికి కారణమని వివరించారు. పాల సరఫరా 15% పెరిగినందున పాల ధరలను తక్షణం పెంచే యోచనేదీ లేదని తెలిపారు. విస్తరణ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 230 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తున్నామని, రెండేళ్లలో దీనిని 320 లక్షల లీటర్లకు పెంచడం లక్ష్యమని శోధి చెప్పారు.