చంటిబిడ్డల కోసం కొండాకోనల్లోకి!
చంటిబిడ్డల కోసం కొండాకోనల్లోకి!
హిమాచల్‌ప్రదేశ్... హిమాలయ పర్వతాల కుదురు! పీఠభూమి అంతమై పర్వత సానువులు మొదలయ్యే ప్రదేశం. ఇంకా చెప్పాలంటే పర్వత సానువుల్లో విస్తరించిన చిన్న చిన్న నివాస ప్రదేశాల సమూహం. పర్యటనకు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో దైనందిన జీవితానికి అంత కఠినమైన ప్రదేశం. రాష్ట్రంలో సగానికి పైగా గ్రామాలకు వేరే గ్రామాలను కలుపుతూ రోడ్లు ఉండవు. కొండల బారుల మధ్య కాలిబాటలోనే చేరుకోవాలి. మొబైల్ కనెక్షన్ ఉన్నా సిగ్నల్ ఉండదు, ఆ రెండూ కలిసినా ఫోన్ చార్జింగ్కు కరెంటు ఉండదు. ఇదీ గ్రామీణ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం. ఒకే రాష్ట్రంలో ఉంటారు, కానీ పేరుకైనా ఒకరి జిల్లాలు మరొకరికి తెలియని పరిస్థితులే ఎక్కువ. అలాంటి రాష్ట్రంలో ఓ అమ్మాయి గీతావర్మ. కమ్యూనిటీ హెల్త్‌వర్కర్‌గా ఆమె అక్కడ ఉద్యోగం చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన క్యాలెండర్లో గీతావర్మకు కూడా పేజీ ఉంది. అంటే విశేషం ఏదో ఉండాలి కదా! ఏమిటా విశేషం?
పట్టు వదలని హెల్త్ వర్కర్
పిల్లలకు మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థతో మనదేశం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రచార ఉద్యమం మొదలైంది. అందులో భాగంగా దేశంలో అన్ని ఆరోగ్య కేంద్రాలకూ మందుల సరఫరా జరిగింది. చిన్న పిల్లలందరికీ హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్లు వేయడమూ జరుగుతోంది. అయితే అంతమందిలో గీతావర్మ ఒక్కరే ప్రత్యేకం అయ్యారు! ఆమె తన పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికీ వెళ్లి, ఇంటింటికీ తిరిగి చంటిబిడ్డల జాబితా నమోదు చేసుకుని వ్యాక్సిన్లు వేసింది. రోడ్డు ఉన్న చోట్ల టూ వీలర్ మీద వెళ్లింది. రోడ్డు లేని గ్రామాలకు సైతం వ్యాక్సిన్ మెటీరియల్ కిట్ మోసుకుంటూ మంచు నిండి, పట్టుజారిపోతున్న రాళ్ల బాటల్లో నడిచి వెళ్లింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ఎల్తైన ప్రదేశం ‘మండి’లో ఉన్న రిమోట్ సెటిల్‌మెంట్‌లనూ వదల్లేదామె. రాయగర్ వంటి మారుమూల గ్రామాల శివార్లలో గుడారాలు వేసుకుని నివసిస్తున్న గొర్రెల కాపర్ల కుటుంబాలను కూడా వెతికి పట్టుకుని వ్యాక్సిన్ వేసింది.
ముఖ్యమంత్రి ప్రశంసలు
‘‘రాష్ట్రానికి గౌరవం తెచ్చావు తల్లీ’’ అంటూ సంతోషపడిపోయారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్. నూటికి నూరు శాతం వ్యాక్సిన్ వేసిన రికార్డు తన రాష్ట్రానికి అందడం ఒక సంతోషం, ఆ గొప్పతనాన్ని సాధించింది ఒక మహిళ కావడం మరొక సంతోషం. ఒక ప్రభుత్వ ఉద్యోగి అంతటి అంకితభావంతో విధులు నిర్వహించడం మరింత సంతోషం. గీతావర్మ సేవలు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టడం మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మనదేశానికి చోటు కల్పించినందుకు గర్వంగా భావిస్తున్నారు ఆ రాష్ట్రంలోని ప్రముఖులు. ప్రతిష్టాత్మకమైన ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ గుర్తింపు తెచ్చినందుకు ఇతర రాష్ట్రాలు కూడా గీతావర్మను అభినందిస్తున్నాయి. ఇలాంటి అమ్మాయి రాష్ట్రానికి ఒక్కరుంటే చాలన్నంతగా గీతావర్మకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.
డబ్లు్య.హెచ్.వో.
గీతావర్మది హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లా, కర్సోగ్ తెహ్సిల్లోని సాప్నోత్ గ్రామం. అదే జిల్లాలోని శంకర్దెహ్రా హెల్త్ సబ్ సెంటర్లో డ్యూటీ. ఆమె అక్కడికి దగ్గర్లోని సెరాజ్ వ్యాలీలోని ఎగుడుదిగుడు రోడ్ల మీద టూవీలర్లో ప్రయాణించడం ఫేస్బుక్లో వైరల్ అయింది. ట్విటర్, వాట్సాప్‌లలోనూ శరవేగంతో తిరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆమె సర్వీస్‌ను గుర్తించింది. ఈ ఏడాదికి విడుదల చేసిన క్యాలెండర్లో గీతావర్మ మంచుకొండల మధ్య వ్యాక్సిన్ కిట్ మోసుకుంటూ నడుస్తున్న ఫొటోను, క్లుప్తంగా వివరాలనూ ప్రచురించింది.
– మను