19 నుంచి గీతం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష
11 నుంచి స్లాట్ బుకింగ్, హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
సాగర్‌నగర్(విశాఖ): గీతం విశ్వవిద్యాలయం విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు ప్రాంగణాల్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతుందని విశ్వవిద్యాలయం అడ్మిషన్ల డెరైక్టర్ కె.నరేంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయస్థాయిలో 44 పట్టణాల్లో మే 8 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 19 నుంచి మే 8 మధ్య తమకు అనువైన తేదీలు, సమయం(స్లాట్ బుకింగ్), పరీక్షా కేంద్రాన్ని గీతం వెబ్సైట్ ద్వారా ఈ నెల 11 నుంచి నమోదు చేసుకోవాలని సూచించారు.
స్లాట్ బుకింగ్ అనంతరం హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను మే 16న ప్రకటిస్తామని, ఆ తర్వాత అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీలను తెలియజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, కడప, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ లో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు గంటల కాలవ్యవధి గల ప్రవేశ పరీక్ష 300 మార్కులకు ఉంటుందని.. తప్పు సమాధానానికి ఒక మార్కు తీసివేయటం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన సిలబస్‌ను గీతం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు గీతం విశ్వవిద్యాలయంలోని అడ్మిషన్ల కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.